Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సొంతం
- పసిడి ఫైట్‌లో థారులాండ్ బాక్సర్‌పై ఏకపక్ష విజయం
- స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
- 14 ఏండ్లలో పసిడి నెగ్గిన రెండో భారత బాక్సర్ రికార్డు
- నయా వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్
సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. క్రీడల్లోకి వచ్చేందుకు ఎన్నో అడ్డంకులు, మరెన్నో సవాళ్లు. అయినా, ఆమె బెదరలేదు!!
నలుగురు అక్కాచెల్లెళ్లలో మూడో అమ్మాయి. సంప్రదాయ బాట వీడి చేతికి గ్లోవ్స్ ధరించి బాక్సింగ్ రింగ్‌లోకి దిగేందుకు అధిగమించాల్సిన సవాళ్లు ఎన్నో!. అయినా, ఆమె బెదరలేదు!!
దిగ్గజ బాక్సర్‌కు ట్రయల్స్ సవాల్ విసిరి వివాదాల ఊబిలో పడింది!. ప్రతికూల పవనాలు గట్టిగా వీచాయి. అయినా, ఆమె ధైర్యం చెక్కు చెదరలేదు. ఆమె బెదరలేదు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్. తొలిసారి మెగా ఈవెంట్ బరిలో నిలిచింది. రింగ్‌లో బలమైన ప్రత్యర్థులు. అయినా, ఆమె బెదరలేదు!!
దూకుడు.. దూకుడు.. దూకుడు.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన మన బంగారం నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. పసిడి పతకంతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారత బాక్సింగ్‌కు కొత్త క్వీన్ వచ్చిందని పసిడి పంచ్‌తో చాటిచెప్పింది!.
నవతెలంగాణ-ఇస్తాంబుల్
భారత బాక్సర్ నిఖత్ జరీన్ దేశం గర్వపడే ప్రదర్శన చేసింది. 2022 ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పసిడి పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం పసిడి పోరులో థారులాండ్ బాక్సర్ జిట్పాంగ్ జుటామస్‌పై నిఖత్ జరీన్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్ జరీన్‌ను ఏకగ్రీవ విజేతగా ఎంచుకున్నారు. 5-0తో తిరుగులేని విజయం సాధించిన అరంగేట్రంలోనే ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. గత 14 ఏండ్లలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన రెండో భారత బాక్సర్‌గానూ నిఖత్ జరీన్ రికార్డు నెలకొల్పింది. ఈ సమయంలో దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పంచ్ సంధించింది. ఆరుసార్లు చాంపియన్ ఎంసీ మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితాదేవి (2006), జెన్నీ ఆర్ఎల్ (2006), లేఖ కెసి (2006)ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ పసిడి సొంతం చేసుకున్న భారత బాక్సర్‌గా నిఖత్ జరీన్ ఎలైట్ జాబితాలో చేరిపోయింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి రౌండ్ నుంచి పసిడి పోరు వరకు అన్ని బౌట్లలోనూ నిఖత్ జరీన్ ఏకగ్రీవ విజయాలు నమోదు చేయటం విశేషం.
నిఖత్ దూకుడు : నాలుగేండ్ల విరామం అనంతరం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం తిరిగి భారత్ గూటికి చేరుకుంది. తొలి రౌండ్ అద్వితీయ ప్రదర్శన చేసిన నిఖత్ జరీన్ ఫైనల్లోనూ అదే వ్యూహంతో బరిలో నిలిచింది. పసిడి పోరులో ప్రత్యర్థి థారులాండ్ బాక్సర్ జిట్పాంగ్ జుటామస్‌పై గతంలో నిఖత్ జరీన్ విజయం సాధించింది. గత రికార్డు అనుకూలత భారత బాక్సర్‌కు ఉంది. అయినా, ఫైనల్లో నిఖత్ ఏమాత్రం ఏమరపాటుగా లేదు. సహజంగా నిఖత్ జరీన్ బ్యాక్‌ఫుట్ బాక్సర్. జాతీయ శిక్షణ శిబిరంలో తన ఆట తీరు, స్టయిల్‌ను తగు విధంగా మార్పు చేసుకున్న నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో బలమైన పంచ్‌లు విసిరింది. జిట్పాంగ్ బలహీనతలపై గట్టి దెబ్బ కొట్టిన నిఖత్ జరీన్.. ఆమెను తన వ్యూహంలోకి తెచ్చుకుంది. మూడు రౌండ్ల బౌట్లో నిఖత్ జరీన్ ప్రతి రౌండ్లోనూ దుమ్మురేపింది. థారులాండ్ బాక్సర్‌ను కార్నర్ చేస్తూ పంచ్‌ల వర్షం కురిపించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన నిఖత్ జరీన్ ప్రత్యర్థిపై పంచ్‌లు విసిరేందుకు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో నిఖత్ జరీన్ దూకుడుకు ఐదుగురు న్యాయమూర్తులు పూర్తి పాయింట్లు కేటాయించారు. 10-9, 10-9, 10-9, 10-9, 10-9తో తొలి రౌండ్లోనే నిఖత్ జరీన్ ఆధిపత్యానికి గట్టి పునాది వేసుకుంది. రెండో రౌండ్లో జిట్పాంగ్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. రౌండ్ నిఖత్ జరీన్ చేజారలేదు. ఇక మూడో రౌండ్లో నిఖత్ జరీన్ అలుపెరుగని పంచ్‌లు విసిరింది. ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్ జరీన్‌ను 5-0తో ఏకగ్రీవ విజేతగా ప్రకటించారు. 2011లో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించిన నిఖత్ జరీన్.. 2022లో ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించింది. భారత బాక్సింగ్ చరిత్రలో సువర్ణాధ్యానికి శ్రీకారం చుట్టింది. భారత బాక్సర్లు పర్వీన్, మనీశలు సైతం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించారు. సెమీఫైనల్లో పోరాడి ఓడిన మనీశ, పర్వీన్‌లు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 12 మంది బాక్సర్లతో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు బయల్దేరిన టీమ్ ఇండియా.. ఓ పసిడి, రెండు కాంస్య పతకాలతో స్వదేశానికి పయనం అవుతోంది.