Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగారు బాక్సర్ నిఖత్ జరీన్ నయా తుఫాన్ సృష్టించింది. 14 ఏండ్ల వయసులోనే జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన తెలంగాణ తేజం.. అత్యున్నత స్థాయిలో తనేంటూ నిరూపించుకునేందుకు దశాబ్దానికి పైగా చెమటోడ్చింది!. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించి ఇస్తాంబుల్‌లో చిరస్మరణీయ విజయం అందుకుంది. పసిడి పంచ్‌తో యావత్ దేశం దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. కామన్వెల్త్ క్రీడల కోసం సన్నద్ధం కానున్న నిఖత్ జరీన్.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యమని చెబుతోంది. మహిళల బాక్సింగ్ నయా వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌తో ఇంటర్వ్యూ.
- ఏండ్ల కఠోర శ్రమ ఫలితమే ఈ విజయం
- నయా వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్
నవతెలంగాణ-హైదరాబాద్
దిగ్గజాలు మేరీకోమ్, సరితాదేవి సరసన నిలిచిన భావన ఎలా ఉంది?
నిజంగా చాలా సంతోషంగా ఉంది. దిగ్గజాల సరసన నిలువటం గౌరవంగా భావిస్తున్నాను. ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ విజయాన్ని ఎన్నడూ ఊహించలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి నెగ్గుతానని అనుకోలేదు. కానీ కఠోర శ్రమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నా లక్ష్యానికి అంకితమయ్యాను, అందుకు ఎంతగానో కష్టపడ్డాను. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు సన్నద్ధం కావడానికి భాస్కర్, నా కోచ్‌లు చాలా శ్రమించారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) ముఖ్య పాత్ర పోషించింది. టాప్స్ (టార్గెట్ ఒలింపిక్ పొడియం స్కీమ్) గొప్పగా ఉపయోగపడింది. ఈ పసిడి ప్రయాణంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు.
ఈ ఏడాది ఇది రెండో బంగారు పతకం. ఒలింపిక్ పసిడి దిశగా ఇది తొలి అడుగు అనుకోవచ్చా?
జాతీయ చాంపియన్‌షిప్స్‌కు ముందు నా ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచాను. ' పారిస్ సన్నద్ధత మొదలైంది' అని పెట్టాను. అప్పట్నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి కోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నాను. ఏ టోర్నమెంట్ బరిలో నిలిచినా గెలుపు, ఓటములు ఆలోచన చేయలేదు. గెలుపోటములు నాకు ప్రధానం కాదు. పారిస్ ఒలింపిక్స్‌లో ఉపయుక్తంగా ఉండేందుకు వీలైనంత అనుభవం గడించాలని అనుకున్నాను. ఒలింపిక్స్ ప్రిపరేషన్లో భాగంగా నా షార్ట్కమింగ్స్పై దృష్టి పెట్టాను.
మేరీకోమ్, విజేందర్ సింగ్‌లలో ఎవరైనా అభినందన సందేశం పంపారా?
విజేందర్ సింగ్ ట్వీట్ చూశాను. అందరి ట్వీట్స్‌కు సమాధానం ఇవ్వాల్సి ఉంది. తొలుత ప్రధానమంత్రి నరెంద్ర మోడీ ట్వీట్‌కు బదులు ఇవ్వాలి. ఆ ట్వీట్ చూడగానే నేను ఎంతగానో సంతోషించాను. అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి బదులు పంపిస్తాను.
నిఖత్ జరీన్ ఎవరు?' కామెంట్ నుంచి 'వరల్డ్ చాంపియన్'గా నిలిచిన ప్రయాణం ఎలా అనిపించింది?
నేను చాలా హార్డ్‌వర్క్ చేశాను. కఠోరంగా శ్రమించాను, దేశానికి పతకం సాధించాను. నా బలహీనతలు నాకు తెలుసు. బలహీనతలను బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాను. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో అది బాగా పని చేసింది. నిరుడు చాలా టోర్నమెంట్లలో ఆడాను, పతకాలు సాధించాను. ఆ అనుభవం, ఆత్మవిశ్వాసం వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పనికొచ్చాయి. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో అన్ని బౌట్లు ఏకగ్రీవంగా గెలిచాను. నా ప్రదర్శన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను.
ఫైనల్స్‌కు ప్రవేశంతో రజతం ఖాయమైంది. అయినా, ఫైనల్స్ అనంతరం భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఫైనల్‌కు ముందు మీ ఆలోచనలు? ప్రణాళికలు ఎలా ఉన్నాయి?
ఫైనల్స్ రోజు ఉదయం సాధారణంగానే గడిచింది. నా బౌట్లు అన్ని మధ్యాహ్నాంలోనే ఉన్నాయి. ఫైనల్ ఒక్కటే సాయంత్రం జరిగింది. ఫైనల్ ప్రత్యర్థి బాక్సర్‌ను థారులాండ్ ఓపెన్‌లో గతంలోనే ఓడించాను. జిట్‌పాంగ్‌ను మరోసారి ఓడిస్తానని నమ్మకం నాకుంది. కానీ భావోద్వేగాలు, కాస్త ఆందోళన సైతం ఉన్నాయి. నేనూ పసిడి పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూశాను. పసిడి రేసులో చివరి అడుగు. ఎందుకు తేలిగ్గా తీసుకోవాలని అనుకున్నాను. రింగ్‌లోకి అడుగుపెట్టాను, వంద శాతం ప్రదర్శన ఇచ్చాను. మూడు రౌండ్లలో 9 నిమిషాల పాటు నా శక్తి మేరకు ఆడాలని భావించాను. తొలి రెండు రౌండ్లలో ఏకగ్రీవంగా నెగ్గి.. మూడో రౌండ్లో కాస్త దూకుడు తగ్గుదామని అనుకున్నాను. కానీ రెండో రౌండ్లో జిట్పాంగ్ పైచేయి సాధించింది. చివరి రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నాను. పసిడి విజేతగా రిఫరీ నా చేయి ఎత్తగానే ఎంతగానో ఉద్వేగానికి లోనయ్యాను.
నా సమయం వస్తుంది'.. గతంలో నిఖత్ చెప్పిన మాట. ఇప్పుడు నిఖత్ సమయం వచ్చిందా?
అవును..వచ్చింది. ఈ పసిడి పతకం చూసిన తర్వాత నా సమయం వచ్చిందని మీకు అనిపించటం లేదు. ఈ విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. కఠోర శ్రమ కొనసాగిస్తూ దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని అనుకుంటున్నాను.
నిఖత్ జరీన్ తదుపరి టార్గెట్?
నా తర్వాతి లక్ష్యం కామన్వెల్త్ క్రీడలు. బర్మింగ్‌హామ్‌లో పతకం కోసం సన్నద్ధం అవుతున్నాను.
ఒలింపిక్స్‌లో భారత్ రెండు కాంస్య పతకాలు నెగ్గింది. మేరీకోమ్, లవ్లీనాలు ఆ ఘనత సాధించారు. ఒలింపిక్స్‌లో బాక్సింగ్ సాధించిన తొలి భారత బాక్సర్‌గా నిఖత్ నిలువనుందా?
ఒలింపిక్ పసిడి కోసం అత్యుత్తమ ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరికి ఒలింపిక్ పసిడి ముద్దాడాలనే స్వప్నం ఉంటుంది. నేను అదే స్వప్నంతో జీవిస్తున్నాను. ఒలింపిక్స్‌కు అదే కలతో వెళ్తాను. ఒలింపిక్స్‌లో పసిడి నెగ్గేందుకు నా శక్తి మేరకు కష్టపడతాను.