Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐపీఎల్ ఫామ్‌కు సెలక్టర్లు పట్టం కట్టారు!. జాతీయ జట్టులో చోటుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రదర్శన ప్రామాణికంగా కాదంటూనే.. టీ20 లీగ్‌లో ధనాధన్ జోరు చూపించిన క్రికెటర్లకు జాతీయ జట్టులో చోటు కల్పించారు. జమ్మూ కాశ్మీర్ స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లకు తొలిసారి సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. ధనాధన్ సంచలనం దినేశ్ కార్తీక్ 2019 తర్వాత తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదివారం జట్టును ప్రకటించింది.
- అర్షదీప్ సింగ్‌కు సైతం జట్టులో చోటు
- రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు, రోహిత్‌కు విశ్రాంతి
- దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలకు విశ్రాంతి లభించింది. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న స్టార్ క్రికెటర్లకు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు విలువైన విరామం దక్కింది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రాకు సైతం సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి లభించటంతో కెఎల్ రాహుల్‌కు సారథ్య పగ్గాలు దక్కాయి. సఫారీతో సిరీస్‌కు నాయకత్వం వహిస్తాడనే అంచనాలున్న శిఖర్ ధావన్‌కు అసలు జట్టులోనే చోటు లభించకపోవటం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ సారథిగా విజయవంతమైన హార్దిక్ పాండ్య.. అటు బ్యాట్, ఇటు బంతితో ఫామ్ నిరూపించుకున్నాడు. విరామం అనంతరం, భారత జట్టులో తిరిగి చోటు సాధించాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకోనున్నాడు.
ఆ ఐదుగురు మిస్! : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఐదుగురు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్‌లకు జట్టులో చోటు లభించలేదు. ఈ ముగ్గురు ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ఎంపిక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకోలేదు. చెన్నై సూపర్‌కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ గాయంతో ఐపీఎల్ 15 సీజన్‌కు పూర్తిగా దూరం కాగా.. చెన్నై సూపర్‌కింగ్స్ తాజా మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా గాయంతో లీగ్ దశలో చివరి మ్యాచులకు దూరమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం ముంబయి ఇండియన్స్ డ్రెస్సింగ్‌రూమ్‌కు గాయం కారణంగానే దూరమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో సిరీస్‌లో ఆడిన మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్‌లకు సైతం జట్టులో చోటు దక్కలేదు. విరాట్ కోహ్లి నాయకత్వ పగ్గాలు వదిలేసిన అనంతరం కేవలం రెండు టీ20ల్లోనే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తాజా ఐపీఎల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఇద్దరూ పేలవంగా ఆడుతున్నారు. 14 ఇన్నింగ్స్‌ల్లో 19.14 సగటుతో 268 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. మరోవైపు విరాట్ కోహ్లి ఫామ్ ఇంతకంటే దారుణంగా ఉంది. లీగ్ దశలో చివరి గ్రూప్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 54 బంతుల్లో 73 పరుగుల అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌తో కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. ఈ సీజన్లో కోహ్లి 14 ఇన్నింగ్స్‌ల్లో 23.76 సగటుతో 309 పరుగులు చేశాడు. స్ట్రయిక్‌రేట్ 117.93.
ఆ ముగ్గురికి ఛాన్స్! : ఐపీఎల్ 15లో అదిరే ప్రదర్శనతో ముగ్గురు క్రికెటర్లు నేరుగా జాతీయ జట్టులోకి వచ్చేశారు. సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ 2019 తర్వాత తొలిసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో విధ్వంసక బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న దినేశ్ కార్తీక్ సఫారీతో సిరీస్‌కు జట్టులో చోటు సాధించాడు. 191.33 స్ట్రయిక్‌రేట్‌తో 287 పరుగులు కొట్టాడు దినేశ్ కార్తీక్. లీగ్ దశలో డెత్ ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత బ్యాటర్‌గా కార్తీక్ నిలిచాడు. డెత్ ఓవర్లలో దినేశ్ కార్తీక్ స్ట్రయిక్‌రేట్ 226.37. నిలకడగా 150 కిమి/గంట వేగంగా బంతులు సంధించిన ఉమ్రాన్ మాలిక్ ఊహించినట్టుగానే టీ20 జట్టులోకి వచ్చాడు. 21 వికెట్లు కూల్చిన ఉమ్రాన్ మాలిక్.. ఎకానమీ విషయంలో కొన్నిసార్లు నిరాశపరిచినా సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేశారు. పంజాబ్ కింగ్స్ తరఫున డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శన చేసిన అర్షదీప్ సింగ్ సైతం జట్టులోకి వచ్చాడు. వికెట్ల వేటలో అర్షదీప్ సింగ్ వెనుకంజలో నిలిచినా..సీజన్లో అతడి ఎకానమీ 7.82 మాత్రమే. డెత్ ఓవర్లలో అతడి ఎకనామీ 7.31 మరింత మెరుగ్గా ఉంది.
రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోరు, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్లు జట్టుతో చోటు నిలుపుకున్నారు. రాహుల్ త్రిపాఠి, మోషిన్ ఖాన్ల పేర్లు సైతం సెలక్షన్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చినా.. జట్టులోకి ఎంపిక కాలేకపోయారు.
భారత టీ20 జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, వెంకటేశ్ అయ్యర్, యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోరు, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.