Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వాలిఫయర్1లో రాయల్స్‌పై గెలుపు
- ఛేదనలో చెలరేగిన మిల్లర్, హార్దిక్
గుజరాత్ టైటాన్స్ అడుగు పడింది. ఐపీఎల్ టైటిల్ దిశగా తొలి ప్రయత్నంలోనే తుది సమరానికి చేరుకుంది. క్వాలిఫయర్1లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్15 ఫైనల్లోకి అడుగుపెట్టింది. 189 పరుగుల ఛేదనలో డెవిడ్ మిల్లర్ (68 నాటౌట్), హార్దిక్ పాండ్య (40 నాటౌట్) 106 పరుగుల శతక భాగస్వామ్యంతో చెలరేగటంతో మరో మూడు బంతులు ఉండగానే టైటాన్స్ విజయం సాధించింది.
నవతెలంగాణ-కోల్‌కత
ఛేదనలో తిరుగులేదని గుజరాత్ టైటాన్స్ మరోసారి నిరూపించింది. 189 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసింది. లీగ్ దశలో ఛేదనలో ఎదురులేని ప్రదర్శనలు చేసిన టైటాన్స్ కీలక క్వాలిఫయర్1లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (40 నాటౌట్, 27 బంతుల్లో 5 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరువగా.. డెవిడ్ మిల్లర్ (68 నాటౌట్, 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో గుజరాత్ టైటాన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. నాల్గో వికెట్‌కు 106 పరుగులు జోడించిన డెవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్య జోడీ 19.3 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్15 ఫైనల్లోకి ప్రవేశించింది. చివరి ఓవర్లో టైటాన్స్‌కు 16 పరుగులు అవసరం కాగా.. ప్రసిద్ కృష్ణ వేసిన తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన డెవిడ్ మిల్లర్ కనీవినీ ఎరుగని విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 188/6 పరుగులు చేసింది. ఓపెనర్ జోశ్ బట్లర్ (89, 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. కెప్టెన్ సంజు శాంసన్ (47, 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఫైనల్లో ప్రవేశానికి..ఎలిమినేటర్ విజేతతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్2లో తలపడనుంది.
బట్లర్ మెరిసినా..: టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (3) పవర్‌ప్లేలో ఎదురుదాడికి ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నంలో యశ్ దయాల్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. మరో ఎండ్‌లో జోశ్ బట్లర్ సైతం పరుగుల వేటలో ఇబ్బంది పడ్డాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (47, 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌కు కాస్త ఊపు తీసుకొచ్చాడు. మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో దూకుడుగా ఆడాడు. అర్థ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా శాంసన్ వికెట్ కోల్పోయాడు. దీంతో రాయల్స్ ఇన్నింగ్స్ మరోసారి నెమ్మదించింది. ఏడు ఫోర్లతో 42 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జోశ్ బట్లర్.. దండెత్తేందుకు చివరి వరకు ఎదురుచూశాడు. దేవదత్ పడిక్కల్ (28, 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బట్లర్‌కు చక్కటి సహకారం అందించాడు. అర్థ సెంచరీ అనంతరం జోరందుకున్న జోశ్ బట్లర్.. మరో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. బట్లర్ జోరుతో రాయల్స్ స్కోరు వేగంగా ముందుకు సాగింది. షిమ్రోన్ హెట్మయర్ (4), రియాన్ పరాగ్ (3), అశ్విన్ (2 నాటౌట్) ఇలా.. కొత్త బ్యాటర్ ఎవరు క్రీజులోకి వచ్చినా భారీ షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బంది పడ్డారు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 188/6 ( జోశ్ బట్లర్ 89, సంజు శాంసన్ 47, హార్దిక్ పాండ్య 1/14, రషీద్ ఖాన్ 0/15)
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 191/3 (డెవిడ్ మిల్లర్ 68, హార్దిక్ పాండ్య 40, గిల్ 35, వేడ్ 35, ట్రెంట్ బౌల్ట్ 1/38)