న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్ష పదవికి నరీందర్ బత్రా రాజీనామా చేశాడు. ఐఓఏ అధ్యక్షునిగా మరోసారి కొనసాగేందుకు ఇష్టపడడం లేదని, అందువల్ల ముందుగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా బుధవారం మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షునిగానూ ఉన్న బత్రా.. 2017లో తొలిసారి ఐఓఏ అధ్యక్షునికి ఎన్నికయ్యారు. ప్రపంచ క్రీడల్లో హాకీ గొప్పగా పుంజుకుంటోందని, ఆ క్రీడలో సమూల మార్పులకు తెరలేపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోదఫా ఐఓఏ అధ్యక్షునిగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, తన రాజీనామా వెంటనే అమల్లోకి రానున్నట్లు ఆ ప్రకటనలో బత్రా తెలిపారు. తను ఐఓఏ అధ్యక్షునిగా ఉన్న కాలంలో భారత హాకీ జట్టు అద్భుత విజయాలను సొంతం చేసుకుందని, ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కూడా సాధించడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు.