Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెయిన్ బుల్ 300వ గ్రాండ్‌స్లామ్ విక్టరీ
- ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్లో ప్రవేశం
పారిస్ : స్పెయిన్ బుల్, మట్టికోర్టు మొనగాడు రఫెల్ నాదల్ (స్పెయిన్) మరో అరుదైన ఘనత సాధించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300వ విజయం నమోదు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లోకల్ క్రీడాకారుడు కొరెంటిన్ మౌటెట్‌పై వరుస సెట్లలో గెలుపొందిన రఫెల్ నాదల్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. 6-3, 6-1, 6-4తో నాదల్ అలవోక విజయం సాధించాడు. చెమట చిందించకుండా మూడో రౌండ్‌కు చేరిన నాదల్ తర్వాతి రౌండ్‌లో డచ్ ఆటగాడు, 26వ సీడ్ బోటిక్‌తో తలపడనున్నాడు. ' నా ఫిట్‌నెస్ గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందితే టోర్నీలో చివరి వరకు వెళ్లలేను. ఈ వయసులో నాకు ఏమైనా అయితే నేను దాన్ని అంగీకరిస్తాను. అంతేకానీ ఇప్పుడే ఆందోళన చెందను. ప్రస్తుతం నా ఆటను ఆస్వాదిస్తున్నాను. గాయాలపై బెంగ లేదు' అని నాదల్ తెలిపాడు. మారిన్ సిలిచ్ 4-6, 6-4, 6-2, 6-3తో, గోఫిన్ 3-6, 7-6(7-1), 6-2, 6-4తో, డానిల్ మెద్వదేవ్ 6-3, 6-4, 6-3తో, రెండో రౌండ్లో విజయాలు సాధించారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కరొలినా ప్లిస్కోవా 2-6, 2-6తో పరాజయం పాలైంది. పెగులా 6-1, 5-7, 6-4తో కిలినినపై గెలుపొందగా..6-4, 7-6(7-3)తో కరొలినా గార్సియాపై మడిసన్ కీస్ విజయం సాధించింది.