Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాకీ ఇండియా తిరుగులేని విజయం
- నాకౌట్ దశకు చేరుకున్న భారత్
- హాకీ ఆసియా కప్ 2022
జకర్తా : డిఫెండింగ్ చాంపియన్ హాకీ ఇండియా ముంగిట కొండంత లక్ష్యం!. ఆసియా కప్ గ్రూప్ దశను దాటి నాకౌట్‌కు చేరుకునేందుకు చివరి లీగ్ మ్యాచ్‌లో కనీసం 15-0 తేడాతో విజయం సాధించాలి. ప్రత్యర్థిపై గోల్స్ వర్షం కురిపిస్తే గానీ గ్రూప్ దశను దాటలేదు. ఈ పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు అద్వితీయ ప్రదర్శన చేశారు. తీవ్ర ఒత్తిడిలో తడబాటుకు తావులేకుండా.. తడాఖా చూపించారు. ఇండోనేషియాపై 16-0తో ఎదురులేని విజయం నమోదు చేశారు. ఈ విజయంతో టీమ్ ఇండియా నాకౌట్‌లోకి ప్రవేశించగా.. పాకిస్థాన్ గ్రూప్ దశ నుంచి నిష్క్రమించింది. ఇండోనేషియాపై భారత్ 16-0 విజయంతో ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించటంతో పాటు ప్రపంచకప్‌లో ఆ జట్టు చోటు గల్లంతు చేసింది. ఆసియా కప్‌లో టాప్-3లో నిలిచిన జట్లకు మాత్రమే ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత లభిస్తుంది. ఈసారి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ నేరుగా మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్ రానున్న వరల్డ్‌కప్‌కు సైతం దూరమైంది!. ఇదే సమయంలో జపాన్ చేతిలో పాకిస్థాన్ 2-3తో పరాజయం పాలైంది. గోల్స్ వ్యత్యాసం పరంగా భారత్ (1) మెరుగ్గా నిలిచి గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరుకుంది. చివరి క్వార్టర్‌లో ఏకంగా ఆరు గోల్స్ కొట్టిన భారత్ అద్భుతం ఆవిష్కరించింది. భారత ఆటగాళ్లలో దిప్సన్ టర్కీ (5 గోల్స్), సుదేవ్ బెల్లిమగ్గ (3 గోల్స్) సత్తా చాటారు. 15 పెనాల్టీ కార్నర్‌లలో భారత్ 12 పీసీలను గోల్స్‌గా మలిచింది. ఎస్‌వీ సునీల్, పవన్ రాజ్‌బర్, కార్తీ సెల్వం, ఉత్తం సింగ్, నీలం సంజీప్‌లు సైతం భారత్‌కు విలువైన గోల్స్ కొట్టారు.