Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోశ్ బట్లర్ (106 నాటౌట్) సెంచరీ మోత మోగించాడు. సీజన్లో నాలుగో శతకంతో విరాట్ కోహ్లి రికార్డు సమం చేశాడు. 158 పరుగుల ఊరించే ఛేదనలో బట్లర్ రాజస్థాన్‌కు ఏకపక్ష విజయం అందించాడు. బెంగళూర్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌తో సమరానికి సై అనేసింది. ప్రసిద్ కృష్ణ (3/22), ఒబెడ్ మెక్కారు (3/23) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగటంతో తొలుత బెంగళూర్ స్వల్ప స్కోరుకు పరిమితమైంది. బెంగళూర్ టైటిల్ వేటకు క్వాలిఫయర్2 ఓటమితో తెరపడింది.
- టైటాన్స్‌తో తుది పోరుకు సై
- ఛేదనలో బట్లర్ శతక జోరు
- రాణించిన ప్రసిద్, మెక్కారు
- ముగిసిన బెంగళూర్ కథ
నవతెలంగాణ-అహ్మదాబాద్
రాజస్థాన్ రాయల్స్ అడుగు పడింది. ఐపీఎల్ 15 ఫైనల్లోకి రాయల్స్ ప్రవేశించింది. జోశ్ బట్లర్ (106 నాటౌట్, 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ శతక విన్యాసంతో క్వాలిఫయర్2లో రాజస్థాన్ రాయల్స్ అలవోక విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆదివారం మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో అంతిమ సమరానికి రంగం సిద్ధం చేసుకుంది. 158 పరుగుల స్వల్ప ఛేదనను రాజస్థాన్ 18.1 ఓవర్లలోనే ఊదేసింది. యశస్వి జైస్వాల్ (21, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), సంజు శాంసన్ (23, 21 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రాజస్థాన్ పేసర్లు ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెక్కారులు మూడేసి వికెట్లతో మెరువటంతో బెంగళూర్ స్వల్ప స్కోరుతో సరిపెట్టుకుంది. రజిత్ పటిదార్ (58, 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో బెంగళూర్‌ను ఆదుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7) నిరాశపరిచాడు. కెప్టెన్ డుప్లెసిస్ (25, 27 బంతుల్లో 3 ఫోర్లు) విఫలమయ్యారు. ఛేదనలో శతకబాదిన జోశ్ బట్లర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
బట్లర్ విశ్వరూపం : లక్ష్యం 158. బ్యాటింగ్ లైనప్‌లో అందరూ ఫామ్‌లో ఉన్నారు. రాయల్స్ అలవోకగానే టార్గెట్‌ను ఛేదించింది. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ 16 పరుగులు పిండుకోగా.. నెమ్మదిగా జోరందుకున్న జోశ్ బట్లర్ సైతం బౌలర్లను వెంటాడాడు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన యశస్వి నిష్క్రమించినా.. కెప్టెన్ సంజు శాంసన్ (23)తో కలిసి బట్లర్ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన బట్లర్.. పది ఫోర్లు, ఐదు సిక్సర్లతో వంద మైలురాయి అందుకున్నాడు. సీజన్లో నాల్గో శతకం బాదిన బట్లర్ 2016లో కోహ్లి నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. ఛేదనలో బట్లర్ వన్‌మ్యాన్ షోతో బెంగళూర్ బౌలర్లు చేతులెత్తేశారు. పడిక్కల్ (9) నిష్క్రమించినా.. హెట్మయర్ (2 నాటౌట్)తో కలిసి లాంఛనం ముగించాడు. బెంగళూర్ బౌలర్లలో హజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
మళ్లీ అతడొక్కడే! : కీలక టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సిక్సర్ కొట్టిన విరాట్ కోహ్లి (7)ని ప్రసిద్ కృష్ణ అంతే వేగంగా వెనక్కి పంపించాడు. కెప్టెన్ డుప్లెసిస్ (25) తడబడ్డాడు. రజత్ పటిదార్ (58) ఎలిమినేటర్ ఫామ్‌ను కొనసాగించాడు. మాక్స్వెల్ (24)తో కలిసి విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉన్న సమయంలో బెంగళూర్ భారీ స్కోరు దిశగా పయనించింది. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన పటిదార్.. అశ్విన్ ఓవర్లో వరుసగా రెండో సిక్సర్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు. దినేశ్ కార్తీక్ (6) వికెట్‌తో బెంగళూర్ డీలా పడింది. చివరి ఐదు ఓవర్లలో 34 పరుగులే చేసిన బెంగళూర్ 5 వికెట్లు కోల్పోయింది.
స్కోరు వివరాలు :
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : కోహ్లి (సి) శాంసన్ (బి) ప్రసిద్ 7, డుప్లెసిస్ (సి) అశ్విన్ (బి) మెక్కారు 25, పటిదార్ (సి) బట్లర్ (బి) అశ్విన్ 58, మాక్స్వెల్ (సి) మెక్కారు (బి)బౌల్ట్ 24, మహిపాల్ (సి) అశ్విన్ (బి) మెక్కారు 8,కార్తీక్ (సి) పరాగ్ (బి) ప్రసిద్ 6, షాబాజ్ నాటౌట్ 12, హసరంగ (బి) ప్రసిద్ 0, హర్షల్ (బి) మెక్కారు 1, హజిల్‌వుడ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం :(20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-9, 2-79, 3-111, 4-130, 5-141, 6-146, 7-146, 8-154.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-28-1, ప్రసిద్ కృష్ణ 4-0-22-3, ఒబెడ్ మెక్కారు 4-0-23-3, రవిచంద్రన్ అశ్విన్ 4-0-31-1, యుజెంద్ర చాహల్ 4-0-45-0.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్ (సి) కోహ్లి (బి) హజిల్‌వుడ్ 21, జోశ్ బట్లర్ నాటౌట్ 106, సంజు శాంసన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) డిసిల్వ 23, పడిక్కల్ (సి) కార్తీక్ (బి) హజిల్‌వుడ్ 9, హెట్మయర్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు :0, మొత్తం :(18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 161.
వికెట్ల పతనం : 1-61, 2-113, 3-148.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 2-0-31-0, హజిల్‌వుడ్ 4-0-23-2, మాక్స్వెల్ 3-0-17-0, షాబాజ్ 2-0-35-0, హర్షల్ 3.1-0-29-0, డిసిల్వ 4-0-26-1.