Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం. వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు తరహాలో లక్ష మందికి పైగా అభిమానులతో నిండనున్న స్టేడియం. ఓ వైపు తొలి ప్రయత్నంలోనే టైటిల్ పోరుకు చేరుకున్న గుజరాత్ టైటాన్స్. మరో వైపు తొలి సీజన్లో టైటిల్‌ను ముద్దాడిన అనంతరం తొలిసారి ట్రోఫీ వేటలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ టైటిల్ కోసం మహా వేటకు సిద్ధమయ్యాయి. నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15 టైటిల్ పోరు.
- రాజస్థాన్, గుజరాత్ టైటిల్ వేట
- ఐపీఎల్ 15 మెగా ఫైనల్ నేడు
- రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...
నవతెలంగాణ-అహ్మదాబాద్
మహా సమరానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ టైటిల్ ముద్దాడేందుకు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటున్నాయి. సొంత అభిమానుల నడుమ, సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. గతంలో మోతెరా రాజస్థాన్ రాయల్స్‌కు సైతం సొంత మైదానం. గ్రూప్ దశలో, క్వాలిఫయర్1లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్.. రాయల్స్‌పై హ్యాట్రిక్‌తో కప్పు కొట్టాలని చూస్తోంది. గత రెండు పరాజయాలకు మెగా మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ రాయల్స్ తయారుగా ఉంది. ఇరు జట్లలో మ్యాచ్ విన్నర్లు, మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులకు కొదవ లేదు. నేడు ఐపీఎల్ 15 మెగా ఫైనల్లో ఎవరు నెగ్గినా.. సమవుజ్జీల సమరం అభిమానులకు మరిచిపోలేని అనుభూతి ఇవ్వగలదు అనటంలో అతిశయోక్తి లేదు.
భావోద్వేగంతో..! : రాయల్స్ తొలి కెప్టెన్, ఐపీఎల్ తొలి విజేత షేన్ వార్న్‌కు నివాళి అర్పించేందుకు రాయల్స్ నేడు టైటిల్ అందుకోవాలని తపిస్తోంది. వార్న్ భావోద్వేగం రాయల్స్ శిబిరంలో కనిపిస్తోంది. రాయల్స్ విజయాల్లో ముఖ్య భూమిక వహిస్తున్న జోశ్ బట్లర్‌పైనే మరోసారి ఫోకస్ ఉండనుంది. క్వాలిఫయర్2లో అజేయ శతకం సాధించిన బట్లర్..నేడు టైటాన్స్‌పై విరుచుకుపడాలని చూస్తున్నాడు. బట్లర్‌పై రషీద్ ఖాన్ అస్త్రం ప్రయోగించేందుకు టైటాన్స్ సిద్ధపడగా.. అందుకు బట్లర్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాడు. సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మయర్ రూపంలో హిట్టర్లు రాయల్స్ సొంతం. అయితే పవర్ ప్లే, డెత్ ఓవర్లలో టైటాన్స్ బౌలింగ్ పటిష్టం. ఈ రెండు దశల్లో రాయల్స్ బ్యాటింగ్ ప్రదర్శన ఆ జట్టు అవకాశాలను తేల్చనుంది. చాహల్, అశ్విన్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో గొప్ప నియంత్రణ సాధించగలరు. కానీ స్పిన్‌పై విరుచుకు పడుతున్న డెవిడ్ మిల్లర్‌ను ఎలా ఎదుర్కొంటానేది ఆసక్తికరం.
ఆత్మవిశ్వాసంతో..! : సీజన్ ఆరంభ నుంచీ గుజరాత్ టైటాన్స్ అమోఘమైన ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది. ఓటమి పట్ల భయం టైటాన్స్ మైదానంలో ఒత్తిడి లేకుండా ఆడుతోంది. నేడు ఫైనల్లోనూ టైటాన్స్ అదే ధోరణి కనబరిస్తే టైటిల్‌కు ఎంతో దూరం ఉండదు. టైటాన్స్ బ్యాటింగ్ బలం మిడిల్ ఆర్డర్. టాప్ ఆర్డర్లో సాహా దూకుడుగా ఆడినా.. నిలకడ లేదు. గిల్ నిలకడ చూపినా దూకుడు లేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్య నాయకత్వ బాధ్యతలతో ధనాధన్‌తో పాటు సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. డెవిడ్ మిల్లర్ విధ్వంసాలకు అడ్డు లేదు. రాహుల్ తెవాటియ, రషీద్ ఖాన్ రూపంలో లోతైన బ్యాటింగ్ లైనప్ టైటాన్స్ సొంతం. ఎక్స్ ఫ్యాక్టర్‌గా మాథ్యూ వేడ్ ఉండనే ఉన్నాడు. లాకీ ఫెర్గుసన్, మహ్మద్ షమి, ఆర్. సాయికిశోర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లు కాచుకోవటం రాయల్స్‌కు కఠిన సవాల్‌గా మారనుంది. ప్రణాళికల పరంగా ఇప్పటివరకు గొప్పగా ఆడిన గుజరాత్ టైటాన్స్ అంతిమ సమరంలో ఏం చేస్తుందో చూడాలి.
పిచ్, వాతావరణం : ఐపీఎల్ 15 ఫైనల్‌కు వాతావరణం ఆహ్లాదకరంగానే ఉండనుంది. గత ఏడాది ఐపీఎల్ నుంచి ఇక్కడ స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. క్వాలిఫయర్2 ఇక్కడే ఆడిన రాజస్థాన్ రాయల్స్‌కు పరిస్థితులపై కాస్త మెరుగైన అవగాహన ఆ జట్టుకు ఉపయుక్తం. టైటిల్ పోరులో టాస్ నెగ్గిన జట్టు లక్ష్యాన్ని ఛేదించేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోశ్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్కారు, యుజ్వెంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ.
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డెవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియ, రషీద్ ఖాన్, ఆర్. సాయి కిశోర్, యశ్ దయాల్, లాకీ ఫెర్గుసన్, మహ్మద్ షమి.
- ఈ సీజన్ పర్పుల్ క్యాప్ అందుకునేందుకు యుజ్వెంద్ర చాహల్ వికెట్ దూరంలో ఉన్నాడు. 26 వికెట్లతో వానిందు హసరంగ ముందంజలో నిలిచాడు.
- నం.3 బ్యాటింగ్ పొజిషన్ కంటే దిగువన వచ్చిన బ్యాటర్లలో డెవిడ్ మిల్లర్ చేసిన 449 పరుగులే అత్యధికం. 142 స్ట్రయిక్‌రేట్‌తో మిల్లర్ దంచికొట్టాడు.
- ఈ సీజన్ పవర్‌ప్లేలో మహ్మద్ షమి తీసిన వికెట్లు 11. పవర్‌ప్లేలో షమి వికెట్ తీసిన 12 మ్యాచుల్లో 11 సార్లు టైటాన్స్ గెలిచింది. షమి వికెట్ పడగొట్టని మూడు మ్యాచ్‌లో గుజరాత్ పరాజయం పాలైంది.
- డెవిడ్ వార్నర్ 848 పరుగుల మైలురాయి దాటేందుకు బట్లర్ మరో 25 పరుగుల దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి 973 పరుగుల రికార్డు ఈ సీజన్లోనూ పదిలంగానే ఉండేలా ఉంది. వార్నర్, కోహ్లిలు 2016 సీజన్లోనే పరుగుల వరద పారించారు.