Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదరగొట్టిన ఆ ఐదుగురు భారత క్రికెటర్లు వీరే!
ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15 ఆదివారంతో ముగిసింది. 10జట్ల మధ్య రెండు నెలలకు పైగా సాగిన మెగా సంగ్రామంలో గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. అరంగేట్రం ఐపిఎల్‌లోనే కొత్త ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జట్టు హార్ధిక్ పాండ్యా సారథ్యంలోను టైటిల్ కొట్టింది. ఈ సీజన్ ఐపిఎల్‌తో ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన ఐదుగురు భారత క్రికెటర్ల ప్రదర్శన గురించి ఓసారి పరిశీలిద్దాం.
స్పోర్ట్స్ డెస్క్:
మొహిసిన్ఖాన్ (లక్నో)..
23ఏండ్ల ఎడమచేతి వాటం పేసర్ మొహిసిన్ ఖాన్. ఈ సీజన్ ఐపిఎల్‌లో లక్నో తరఫున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లో గుజరాత్‌పై వికెట్లేమీ తీయకపోయినా 18 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత ముంబయిపై 27పరుగులిచ్చి ఒక వికెట్ కూల్చాడు. పంజాబ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 24పరుగుల్చి మూడు వికెట్లు కూల్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. జట్టు కష్టాల్లో దశలో వికెట్లు తీసే ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. 9మ్యాచ్‌ల్లో 5.96సగటుతో 14వికెట్లను కూల్చాడు. ఐపిఎల్‌లో బ్యాటర్స్ హవా నడిస్తే.. అరంగేట్రం ఐపిఎల్‌లోనే ఇంత పొదుపుగా బౌలింగ్ చేసి మొహిసిన్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
తిలక్‌వర్మ (ముంబయి)..
ఈ సీజన్ ఐపిఎల్‌లో నిరాశపర్చిన జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. ఐదుసార్లు టైటిల్ విజేత ముంబయి జట్టు ఈసారి చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టు తరఫున అరంగేట్రం చేసిన తిలక్ వర్మ బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు. రాజస్తాన్‌పై 33 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అశ్విన్, చాహల్ వంటి స్టార్ స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఆ మ్యాచ్‌లో జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 145పయిగులు చేయడానికి దోహదపడ్డాడు. చెన్నైపై 43బంతుల్లో 51పరుగులు, మరోసారి 32 బంతుల్లో 34పరుగులు కొట్టాడు. చెన్నైతో ముంబయి జట్టు 33పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి జట్టు గౌరవప్రద స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. మొత్తమ్మీద 14మ్యాచులు ఆడిన తిలక్ వర్మ 131.02సగటుతో మొత్తం 397పరుగులు చేశాడు.
ముఖేశ్ చౌదరి (చెన్నై)...
సీజన్-15 ఐపిఎల్‌లో నిరాశపర్చిన జట్లలో చెన్నై సూపర్‌కింగ్ జట్టు మరొకటి. కుడిచేతి వాటం మీడియం పేసర్ అయిన ముఖేశ్ చౌదరి పవర్-ప్లే ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. పవర్‌ప్లే ఓవర్లలో బౌలింగ్ చేస్తూ.. 8.53 ఎకానమీతో 16వికెట్లు తీసాడు. రాజస్తాన్‌పై 11పరుగులిచిచ మూడు వికెట్లు తీసాడు. ఇక చెన్నై తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముఖేశ్ చౌదరి మాత్రమే. ముంబయిపై 19పరుగులిచ్చి రోహిత్, ఇషాన్, బ్రెవీస్ వంటి స్టార్ క్రికెటర్ల వికెట్లను తీసాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 23పరుగులిచ్చి 3వికెట్లు తీసాడు.
జితేశ్ శర్మ (పంజాబ్)..
తొలి అర్ధభాగం మ్యాచుల్లో అద్భుతంగా ఆడిన పంజాబ్ జట్టు రెండో అర్ధభాగం మ్యాచుల్లో చతికిలపడింది. ఈ సీజన్ ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన జితేశ్ శర్మ ప్రధాన బ్యాటర్‌గా రాణించాడు. 12మ్యాచుల్లో 163.64సగటుతో 234పరుగులు చేసాడు. చెన్నైపై అరంగేట్రం మ్యాచ్‌లో 17బంతుల్లో 26పరుగులు కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తొలి అర్ధసెంచరీని కొట్టాడు. 55పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో అర్ధసెంచరీతో రాణించి 160 పరుగుల గౌరవప్రద స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. మరోసారి ఢిల్లీపై పంజాబ్ జట్టు 115పరుగులకే కుప్పకూలితే జితేశ్ మాత్రం 23బంతుల్లో 32పరుగులు చేసి టాప్ స్కోర్‌గా నిలిచాడు.
యశ్ దయాల్(గుజరాత్)..
ఈ సీజన్ టైటిల్ నెగ్గిన గుజరాత్ తరఫున అరంగేట్రం చేసిన మరో ఆటగాడు 24ఏళ్ల యశ్ దయాల్.. పేసర్ అయిన దయాల్ అరంగేట్రం మ్యాచ్‌లో తొలి 2ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకొని నిరాశపరిచాడు. ఆ తర్వాత రాజస్తాన్‌పై 3వికెట్లు తీసినా 40పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాతి 2మ్యాచుల్లో 8ఓవర్లు వేసి 82పరుగులు సమర్పించు కున్నాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నా.. గుజరాత్ కెప్టెన్ అతనిపై నమ్మకంతో తుదిజట్టులో చోటు కల్పిస్తూ వచ్చాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 24పరుగులిచ్చి ఒక వికెట్ తీసాడు. మొత్తమ్మీద 9.25సగటుతో 11 వికెట్లు తీసి నిరాశపరిచాడు. ఇదే క్రమంలో ఫైనల్లో రాజస్తాన్‌పై 3ఓవర్లు బౌల్ చేసి 18పరుగులిచ్చి ఒక వికెట్ తీసాడు. మొత్తమ్మీద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆ ఫ్రాంచైజీ టైటిల్ నెగ్గిన జట్టులో చోటు దక్కించుకొని అందరి మన్ననలు పొందాడు.