Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరల్డ్ నం.2, టైటిల్ ఫేవరేట్ రష్యా క్రీడాకారుడు ఖంగుతిన్నాడు. నల్లేరు మీద నడకే అనుకున్న ప్రీ క్వార్టర్ఫైనల్లో అనూహ్య పరాజయం చవిచూశాడు.33 ఏండ్ల మారిన్ సిలిచ్ (క్రోయేషియా) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. రష్యన్ స్టార్‌పై మెరుపు విజయం నమోదు చేసిన మారిన్ సిలిచ్ 2008 తర్వాత తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు.
- ప్రీ క్వార్టర్స్‌లో ఖంగుతిన్న రష్యన్ స్టార్
- క్వార్టర్స్‌లో మారిన్ సిలిచ్ అడుగు
- సెమీఫైనల్లో మార్టినా, కోకో గాఫ్
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
నవతెలంగాణ-పారిస్
యుఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ల నడుమ సమరంలో వరల్డ్ నం.2 డానిల్ మెద్వదేవ్‌పై వరల్డ్ నం.20 మారిన్ సిలిచ్ పైచేయి సాధించాడు. 33 ఏండ్ల మారిన్ సిలిచ్ (క్రోయేషియా) 6-2, 6-3, 6-2తో రెండో సీడ్ ఆటగాడిపై ఎదురులేని విజయం నమోదు చేశాడు. గత నాలుగేండ్లలో మారిన్ సిలిచ్ కెరీర్లో ఇదే అతిపెద్ద విజయం కావటం విశేషం. మరో ప్రీ క్వార్టర్ఫైనల్లో గ్రీసు కుర్రాడు స్టెఫానోస్ సిట్సిపాస్‌కు సైతం చుక్కెదురైంది. నాల్గో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ 5-7, 6-3, 3-6, 4-6తో డెన్మార్క్ ఆటగాడు హౌల్గర్ రునె చేతిలో మట్టికరిచాడు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు అమెరికన్ల మధ్య పోరులో 18వ సీడ్, యువ క్రీడాకారిణి కోకో గాఫ్ 7-5, 6-2తో యుఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్టోనె స్టెఫానెపై గెలుపొందింది. ఇటలీ అమ్మాయి మార్టినా ట్రెవిసన్ 6-2, 6-7(3-7), 6-3తో లీలా అనీ ఫెర్నాండేజ్ (కెనాడా)పై గెలుపొందింది. గాఫ్, మార్టినాలు ఇద్దరూ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
సూపర్ సిలిచ్ : యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచినా.. మారిన్ సిలిచ్ కెరీర్లో పెద్దగా చెప్పుకోదగిన విజయాలు లేవు!. నిలకడలేని ఫామ్‌తో సిలిచ్ టైటిల్ ఫేవరేట్లలో నిలిచిన సందర్భాలు చాలా తక్కువ. రష్యన్ స్టార్ డానిల్ మెద్వదేవ్‌తో ముఖాముఖి రికార్డు మరీ పేలవం. మారిన్ సిలిచ్‌తో ఆడిన మూడు మ్యాచుల్లో మెద్వదేవ్ అలవోక విజయాలు సాధించాడు. అయితే, మట్టికోర్టులో ముఖాముఖి తలపడటం సిలిచ్, మెద్వదేవ్‌కు ఇదే తొలిసారి. పారిస్‌లో తొలి వారం దుమ్మురేపిన మారిన్ సిలిచ్‌పై నిజానికి ప్రీ క్వార్టర్స్‌లో అంచనాలు లేవు. నిలకడగా ప్రపంచ శ్రేణి టెన్నిస్ ఆడుతున్న డానిల్ మెద్వదేవ్ గెలుపు లాంఛనమే అనుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇప్పటి వరకు ఒకే ఒక్క సెట్ ఓడిపోయిన మారిన్ సిలిచ్.. ప్రీ క్వార్టర్ఫైనల్లో తన ప్రతాపం చూపించాడు. తొలి సెట్‌ను 6-2తో గెల్చుకున్న సిలిచ్.. వరుసగా రెండు సెట్లను సైతం సులువుగానే సాధించాడు. ఏ ఒక్క సెట్లోనూ మారిన్ సిలిచ్‌కు మెద్వదేవ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకాలేదు. ఐదు ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో కదం తొక్కిన సిలిచ్.. మెద్వదేవ్‌ను నిశ్చేష్టుడిని చేశాడు. నాలుగు ఏస్‌లు కొట్టిన మెద్వదేవ్.. ఒక్క బ్రేక్ పాయింట్ కూడా సాధించలేదు. పాయింట్ల పరంగానూ 85-60తో మారిన్ సిలిచ్ ఆధిక్యం నిలుపుకున్నాడు. మారిన్ సిలిచ్ 18 గేములు సొంతం చేసుకోగా.. మెద్వదేవ్ 7 గేములతోనే సరిపెట్టుకున్నాడు. సొంత సర్వ్‌లో 13 గేములు నిలుపుకున్న మారిన్ సిలిచ్.. మెద్వదేవ్ సర్వ్‌ను ఐదు సార్లు బ్రేక్ చేశాడు. 15 విన్నర్లు, 18 అనవసర తప్పిదాలు మెద్వదేవ్ చేయగా.. మారిన్ సిలిచ్ 33 విన్నర్లు గెలుచుకోగా, 22 అనవసర తప్పిదాలు చేశాడు. మారిన్ సిలిచ్ నెగ్గిన 85 పాయింట్లతో ఏకంగా 43 పాయింట్లు కేవలం 0-4 షాట్లలోనే రావటం గమనార్హం. ఈ గణాంకాలు మారిన్ సిలిచ్ ఆధిపత్యానికి నిదర్శనం. ' మ్యాచ్ ఆరంభం నుంచీ ముగింపు వరకు నా కెరీర్లో అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఇదొకటి' అని మారిన్ సిలిచ్ ప్రీ క్వార్టర్స్ విజయానంతరం అన్నాడు.
మరో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో నాల్గో సీడ్ సిట్సిపాస్‌కు రునె షాకిచ్చాడు. విజయంపై దీమాతో కోర్టులోకి అడుగుపెట్టిన సిట్సిపాస్‌కు డెన్మార్క్ చిన్నోడు చుక్కలు చూపించాడు. తొలి సెట్‌ను 7-5తో గెల్చుకున్న రునె.. తర్వాతి సెట్‌ను 3-6తో కోల్పోయాడు. ఈ సమయంలో సిట్సిపాస్‌కు మరింత ఆధిక్యం ఇవ్వకుండా చెలరేగాడు. వరుసగా రెండు సెట్లను సొంతం చేసుకుని క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు కొట్టగా, హౌల్గర్ రునె నాలుగు ఏస్‌లు సంధించాడు. ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడిన సిట్సిపాస్.. మూడు బ్రేక్ పాయింట్లే సాధించాడు. ఐదు బ్రేక్ పాయింట్లు సాధించిన రునె తనకంటే మెరుగైన ప్రత్యర్థిని సులువుగానే చిత్తు చేశాడు. పాయింట్ల పరంగా 129-123తో పైచేయి సాధించిన రునె.. గేముల పరంగా 22-18తో వ్యత్యాసం చూపించాడు.
గాఫ్, మార్టినా ముందంజ : మహిళల సింగిల్స్‌లో 18వ సీడ్ అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్, అన్‌సీడెడ్ ఇటలీ చిన్నది మార్టినా ట్రెవిసన్లు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మూడు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన క్వార్టర్ఫైనల్లో అన్‌సీడెడ్ మార్టినా ట్రెవిసన్ అద్భుత విజయం నమోదు చేసింది. సర్వ్‌పై గొప్ప నియంత్రణ సాధించిన మార్టినా.. కెనడా క్రీడాకారిణి లీలా అనీ ఫెర్నాండేజ్‌కు షాక్ ఇచ్చింది. 109-91తో పాయింట్ల పరంగా స్పష్టమైన పైచేయి సాధించింది మార్టినా. ఫెర్నాండేజ్ 12 గేములు నెగ్గగా.. మార్టినా 18 గేములు గెల్చుకుంది. రెండో సెట్లో కీలక టైబ్రేకర్‌లో విజయం సాధించిన ఫెర్నాండేజ్ నిర్ణయాత్మక సెట్లో వెనుకంజ వేసింది. ఇద్దరు అమెరికన్లు తలపడిన మరో క్వార్టర్ఫైనల్లో యువ క్రీడాకారిణి కొకొ గాఫ్ పైచేయి సాధించింది. 7-5, 6-2తో వరుస సెట్లలో యుఎస్ ఓపెన్ మాజీ చాంపియన్‌పై విజయం సాధించింది. మూడు ఏస్‌లు కొట్టిన గాఫ్, ఆరు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడింది. ఆరు సార్లు స్టిఫెన్స్ సర్వ్‌ను బ్రేక్ చేసి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో బెర్త్ కోసం కొకొ గాఫ్‌తో మార్టినా ట్రెవిసన్లు పోటీపడనున్నారు.