Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టికోర్టు మొనగాడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన క్వార్టర్ఫైనల్లో జయకేతనం ఎగురవేశాడు. వరల్డ్ నం.1, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్‌పై ఐదో సీడ్ రఫెల్ నాదల్ మెరుపు విజయం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రికార్డు 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు.
- క్వార్టర్స్‌లో జకోవిచ్‌పై జయకేతనం
- సెమీస్‌లో కసట్కియ, స్వైటెక్
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
నవతెలంగాణ-పారిస్
ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్. సహజంగా, మట్టికోర్టులోనే కాదు ఏ గ్రాండ్స్లామ్లోనైనా సెమీస్, ఫైనల్లోనే అభిమానులను ఉర్రూతలూగించే సమరాలు చోటుచేసుకుంటాయి!. ఎందుకంటే, టోర్నీలో అత్యుత్తమ క్రీడాకారులు తలపడే మ్యాచ్ అప్పుడే ఉంటుంది!. పారిస్‌లో మహా సమరం కాస్త ముందుగానే వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ రారాజు, 13 సార్లు విజేత రఫెల్ నాదల్‌తో వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ముఖాముఖి ఢకొీట్టిన క్వార్టర్‌ఫైనల్ ఇది. దీంతో పారిస్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. మట్టికోర్టు మొనగాడి దూకుడు ముందు వరల్డ్ నం.1 జకోవిచ్ నిలువలేదు. నాలుగు సెట్లు, నాలుగు గంటల పాటు ఉత్కంఠగా సాగిన క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ బుల్ విజయ దుంధుబి మోగించాడు. జకోవిచ్‌ను 6-2, 4-6, 6-2, 7-6(7-4)తో మట్టికరిపించి ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 16 ఏండ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్లోనే మొదలైన రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్ పోటీ తాజాగా క్వార్టర్ఫైనల్స్తోనే ఇక్కడి ముగిసినట్టే భావించవచ్చు!. మరోవైపు మహిళల సింగిల్స్‌లో రష్యా భామ దరియ కసట్కినా, పొలాండ్ భామ ఇగా స్వైటెక్లు సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
స్పెయిన్ బుల్దే పైచేయి : టెన్నిస్ ఓపెన్ శకంలో నాదల్, జకోవిచ్ 59 మ్యాచుల్లో పోటీపడ్డారు. ఫ్రెంచ్ ఓపెన్లోనే ఈ దిగ్గజ ప్రత్యర్థులు పదోసారి తలపడ్డారు. దీంతో క్వార్టర్ఫైనల్స్కు ముంగిట ప్రత్యర్థి ఆటపై మరోకరికి ఎటువంటి సందేహాలు లేవు. ఒకరి ఆట గురించి మరొకరికి స్పష్టమైన అవగాహన. మట్టికోర్టులో రఫెల్ నాదల్ మరోసారి తన ఆధిపత్యం నిరూపించుకున్నాడు. నాలుగు గంటల 20 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో రఫెల్ నాదల్ 6-2, 4-6, 6-2, 7-6(7-4)తో గెలుపొందాడు. నాదల్, జకోవిచ్ తలపడిన గత 58 మ్యాచుల్లో తొలి సెట్‌ను నెగ్గిన వారినే విజయం వరించింది. తాజాగా, ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోనూ అదే ఫలితం పునరావృతం అయ్యింది. తొలి సెట్‌ను సులువుగా సాధించిన నాదల్.. రెండో సెట్‌ను కోల్పోయాడు. కీలక మూడో సెట్లో నాదల్ గర్జించాడు. జకోవిచ్‌ను వెనక్కి నెట్టాడు. నాల్గో సెట్లో అసలు సిసలు పోరు. టైబ్రేకర్‌కు దారితీసిన సెట్‌ను నాదల్ సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లోకి ప్రవేశించి.. 14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు మరింత చేరువయ్యాడు. మ్యాచ్‌లో నాదల్ 58 విన్నర్లు సాధించగా, జకోవిచ్ 48 విన్నర్లే సాధించాడు. నాదల్ 43 అనవసర తప్పిదాలు చేయగా.. జకోవిచ్ 53 అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. జకోవిచ్ సర్వ్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన నాదల్.. మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. పాయింట్ల పరంగా 148-130తో నాదల్ పైచేయి సాధించాడు. జకోవిచ్ 16 గేములు గెల్చుకోగా.. నాదల్ 23 గేములు సాధించాడు. క్వార్టర్స్‌లో వరల్డ్ నం.1 జకోవిచ్‌ను ఓడించిన స్పెయిన్ బుల్‌కు సెమీఫైనల్లోనూ కఠిన సవాల్ ఎదురు కానుంది. జర్మనీ ఆటగాడు, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో నాదల్ సెమీఫైనల్లో తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్, ఫైనల్లో ఓటమెరుగని అద్వితీయ రికార్డున్న రఫెల్ నాదల్కు జ్వెరెవ్ ఏ మేరకు పోటీనిస్తాడో చూడాలి.
స్వైటెక్, కసట్కినా జోరు : మహిళల సింగిల్స్‌లో రష్యా క్రీడాకారిణి దరియ కసట్కినా చరిత్ర సృష్టించింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ఫైనల్లో రష్యాకే చెందిన వెరోనిక కుడర్మెటోవపై కసట్కినా వరుస సెట్లలో విజయం సాధించింది. 6-4, 7-6(7-5)తో వెరోనికను చిత్తు చేసింది. వెరోనిక మూడు ఏస్‌లు సంధించగా.. ఒక్క ఏస్ అవసరం లేకుండానే కసట్కినా సెమీఫైనల్లోకి చేరుకుంది. దరియ సర్వ్‌ను వెరోనిక నాలుగు సార్లు బ్రేక్ చేయగా.. వెరోనిక సర్వ్‌ను కసట్కినా ఐదు సార్లు బ్రేక్ చేసి ముందంజ వేసింది. టైబ్రేకర్‌కు దారితీసిన రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్న కసట్కినా వరుస సెట్ల విజయంతో సెమీస్‌లోకి అడుగుపెట్టింది. పాయింట్ల పరంగా 86-79తో వెసట్కినా పైచేయి సాధించింది. దరియ 13 గేములు గెలుపొందగా.. వెరోనిక 10 గేములతోనే సరిపెట్టుకుంది. గొప్పగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్‌ను క్వార్టర్ఫైనల్లోనే ముగించింది!. మరో క్వార్టర్ఫైనల్లో టాప్ సీడ్ ఇగా స్వైటెక్ (పొలాండ్) సెమీస్‌కు చేరుకుంది. 11వ సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై స్వైటెక్ వరుస సెట్లలో విజయం సాధించింది. 6-3, 6-2తో స్వైటెక్ గెలుపొందింది. నాలుగు ఏస్‌లు కొట్టిన స్వైటెక్.. ఐదు సార్లు జెస్సికా సర్వ్‌ను బ్రేక్ చేసింది. పాయింట్ల పరంగా 74-55తో జెస్సికాపై ఆధిపత్యం చెలాయించింది. రెండు సెట్లలోనూ స్వైటెక్‌కు దీటైన ప్రతిఘటన ఇవ్వటంలో జెస్సికా పెగులా విఫలమైంది. వరుస సెట్ల ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది.