Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్‌రౌండర్‌పై కిరణ్ మోరె ప్రశంస
న్యూఢిల్లీ : ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను టైటిల్ విజయం దిశగా నడిపించిన హార్దిక్ పాండ్యపై భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె ప్రశంసలు జల్లు కురిపించాడు. స్టార్ ఆల్‌రౌండర్ ఇక నుంచి 4డి క్రికెటర్ అని మోరె అన్నాడు. ఐపీఎల్ 2022 ఆటగాళ్ల వేలానికి ముందే హార్దిక్ పాండ్యను గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లతో తీసుకుంది. ముంబయి ఇండియన్స్ వదిలేసిన హార్దిక్ పాండ్య ఫిట్నెస్, బౌలింగ్ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలపై ఎన్నో అనుమానాలు ఉండేవి. నాయకుడిగా తిరుగులేని విజయాలు సాధించిన హార్దిక్ పాండ్య విమర్శకులకు టైటిల్‌తోనే సమాధానం ఇచ్చాడు. ' ఐపీఎల్15లో అత్యుత్తమ సందర్భం అంటే.. గుజరాత్ టైటాన్స్ క్రికెట్ ఆడిన తీరు. అది అమోఘం. హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా మారి, టైటిల్‌ను అందుకోవటం ప్రత్యేకం. హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన సైతం అద్భుతం. ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు మారటం.. కొత్త జట్టుకు నాయకత్వం వహించి చాంపియన్‌గా నిలుపటం అంత సులువు కాదు. హార్దిక్ పాండ్య ఇప్పుడు 4 డైమెన్షనల్ క్రికెటర్ అని భావిస్తున్నాను. గతంలో అతడు 3డి ఆటగాడు. ఇప్పుడు పాండ్యకు నాయకత్వం సైతం తోడైంది. జాతీయ జట్టులో ఇంతటి ప్రతిభావంతుడు ఉండటం పట్ల మనం గర్వపడాలి' అని కిరణ్ మోరె అన్నాడు.