Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. రష్యా భామ దరియ కసట్కినాపై ఏకపక్ష విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడేండ్లలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకోవటం స్వైటెక్‌కు ఇది రెండోసారి. సెమీఫైనల్లో ఎదురులేని ప్రదర్శన చేసిన పొలాండ్ భామ టైటిల్‌కు ముద్దాడేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. అమెరికా నయా సంచలనం కొకొ గాఫ్‌తో తుది పోరుకు స్వైటెక్‌కు సై అనేసింది.
- సెమీస్‌లో కసట్కినా, మార్టినా ఓటమి
- మెన్స్ డబుల్స్‌లో బోపన్న పరాజయం
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022
నవతెలంగాణ-పారిస్
పొలాండ్ భామ పొలికేక పెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరుకు రంగం సిద్ధం చేసుకుంది. తొలి రౌండ్ నుంచీ అద్వితీయ విజయాలతో దూసుకొచ్చిన రష్యన్ టెన్నిస్ సంచలనం, 20వ సీడ్ దరియ కసట్కినాను చిత్తు చేసిన వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ (పొలాండ్) ఫైనల్లోకి ప్రవేశించింది. 64 నిమిషాల్లో ముగిసిన సెమీఫైనల్ సమరంలో టాప్ సీడ్ తిరుగులేని ప్రదర్శన చేసింది. 6-2, 6-1తో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో 18వ సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) ఘన విజయం సాధించింది. 6-3, 6-1తో ఇటలీ అమ్మాయి మార్టినా ట్రెవిసన్ను చిత్తు చేసింది. మెన్స్ సింగిల్స్ చివరి క్వార్టర్ఫైనల్లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ విజయం సాధించాడు. డెన్మార్క్ ఆటగాడు హోల్గర్ రునెపై 6-1, 4-6, 7-6(7-2), 6-2తో కాస్పర్ రూడ్ గెలుపొందాడు. యుఎస్ ఓపెన్ మాజీ విజేత మారిన్ సిలిచ్ (క్రోయేషియా)తో సెమీఫైనల్లో రూడ్ తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ 2022 తొలి చాంపియన్లు వచ్చేశారు!. మిక్స్డ్ డబుల్స్ విభాగం నుంచి తొలి చాంపియన్లు అవతరించారు. ఉత్కంఠ సాగిన ఫైనల్లో ఎనా షిబహర, వెస్లీ కూల్‌హాఫ్ జోడీ 7-6(7-5), 6-2తో జోరాన్, ఎకెరి జోడీపై వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
స్వైటెక్ సూపర్ : వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్‌కు సెమీఫైనల్లో చెమట చిందించాల్సిన అవసరం రాలేదు. క్వార్టర్ఫైనల్లో అమోఘంగా రాణించిన దరియ కసట్కినా అనూహ్యంగా సెమీ సమరంలో చేతులెత్తేసింది. 6-2, 6-1తో స్వైటెక్ ఏకపక్ష విజయం సాధించింది. రెండు ఏస్‌లు కొట్టిన కసట్కినా, రెండు డబుల్ ఫాల్ట్స్ చేసింది. స్వైటెక్ ఏకంగా ఐదుసార్లు కసట్కినా సర్వ్‌ను బ్రేక్ చేసి.. ఫైనల్లోకి సులువుగా చేరుకుంది. పాయింట్ల పరంగా 59-29తో స్వైటెక్ ఆధిపత్యం నిరూపించుకుంది. రెండో సెట్లో వరుసగా ఐదు గేములు గెల్చుకున్న స్వైటెక్ 22 విన్నర్లు సాధించింది. స్వైటెక్ 13 అనవసర తప్పిదాలు చేయగా.. కసట్కినా 24 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. రెండో సెమీఫైనల్ సైతం ఏకపక్షంగానే సాగింది. వరుస సెట్లలోనే కొకొ గాఫ్ గెలుపొందింది. ఇటలీ అమ్మాయి మార్టినా ట్రెవిసన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆరు బ్రేక్ పాయింట్లు సాధించిన గాఫ్.. మార్టినాకు రెండు సార్లు మాత్రమే సర్వ్‌ను కోల్పోయింది. పాయింట్ల పరంగా 69-43, గేముల పరంగా 12-4తో కొకొ గాఫ్ చాంపియన్ ప్రదర్శన చేసింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో ఇగా స్వైటెక్, కొకొ గాఫ్‌లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు.
మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ఎనిమిదో సీడ్ కాస్పర్ రుడ్ (నార్వే) ఉత్కంఠ మ్యాచ్‌లో డెన్మార్క్ ఆటగాడు హోల్గర్ రునెపై విజయం సాధించాడు. నాలుగు సెట్ల సమరంలో 6-1, 4-6, 7-6(7-2), 6-3తో రుడ్ పైచేయి సాధించాడు. తొలి సెట్‌ను సులువుగా నెగ్గిన రుడ్.. రెండో సెట్‌ను కోల్పోయాడు. కీలక మూడో సెట్ టైబ్రేకర్‌కు దారితీయగా.. రుడ్ టైబ్రేకర్‌ను సొంతం చేసుకున్నాడు. నాల్గో సెట్లో రుడ్ దూకుడు ముందు రునె తేలిపోయాడు. 13 ఏస్‌లు సంధించిన రుడ్ ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. పాయింట్ల పరంగా 144-117తో రునెను చిత్తు చేశాడు. రుడ్ 23 గేములు గెల్చుకోగా, రునె 16 గేముల్లో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాడు రోహన్ బోపన్న పోరాటానికి తెరపడింది. సెమీఫైనల్లో 6-4, 3-6, 6-7(8-10)తో రోహన్ బోపన్న, మిడెల్కూప్ జోడీ పరాజయం పాలైంది. జీన్ జులియన్ రోజర్, మార్సెలో అరెవలో జంట నిర్ణయాత్మక మూడో సెట్ సూపర్టైబ్రేకర్ను గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది.
నేడు సెమీ సమరం : పురుషుల సింగిల్స్ టైటిల్ రేసు తుది అంకానికి చేరుకుంది. జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్, నార్వే సంచలనం కాస్పర్ రుడ్, క్రోయేషియా స్టార్ మారిన్ సిలిచ్లతో పాటు ఫ్రెంచ్ ఓపెన్ రారాజు, 13 సార్లు రొలాండ్ గారోస్ విజేత రఫెల్ నాదల్ సైతం సెమీఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. నేడు తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్‌తో స్పెయిన్ బుల్ నాదల్ తలపడనున్నాడు. క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్‌ను చిత్తు చేసిన నాదల్ నేడు సెమీస్‌లో జ్వెరెవ్కూ అదే ఫలితం రుచి చూపించేందుకు రెఢగాీ ఉన్నాడు. చాన్నాండ్ల తర్వాత టాప్ ఫామ్‌లోకి వచ్చిన క్రోయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్. క్వార్టర్స్‌లో రెండో సీడ్ డానిల్ మెద్వదేవ్‌ను అలవోకగా ఓడించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న సిలిచ్‌ను ఎదుర్కొవటం నార్వే కుర్రాడు రుడ్‌కు అంత సులువు కాబోదు!.