Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, పాక్ క్రికెట్‌పై మహ్మద్ రిజ్వాన్
కరాచీ : ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ ముఖాముఖి సమరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రెండు దేశాలు ఏ వేదికపై పోటీపడినా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కళ్లప్పగించి చూస్తారు. సరిహద్దు ఉద్రిక్తతలు, ఇతర కారణాలతో కొంతకాలంగా భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్‌కు తెరపడింది. ఐసీసీ రాజ్యాంగ సవరణకు మద్దతుగా నిలిచినందుకు ద్వైపాక్షిక సిరీస్‌లకు ఇచ్చిన హామీపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏకంగా న్యాయ పోరాటానికి సైతం దిగింది. అయినా, ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల్లో ఎటువంటి మార్పు లేదు. ఇరు దేశాల అభిమానులతో పాటు భారత్, పాకిస్థాన్ క్రికెటర్లు సైతం ద్వైపాక్షిక సమరం కోసం ఆసక్తిగా ఉన్నట్టు పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాతో కలిసి ససెక్స్‌కు ఆడిన మహ్మద్ రిజ్వాన్.. పుజారాతో జరిగిన సంభాషణలను పంచుకున్నాడు. 'ప్రతి ఒక్కరు భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ జరగాలని కోరుకుంటున్నారు. కానీ దేశ వ్యవహారాలు క్రికెటర్ల చేతుల్లో ఉండవు. ఇటు పాకిస్థాన్, అటు భారత్ నుంచి క్రికెటర్లు రెగ్యులర్ క్రికెట్ సంబంధాలను ఆశిస్తున్నారని నాకు అర్థమైంది. కానీ, ఆటగాళ్ల చేతుల్లో ఏమీ లేదు. పుజారా వంటి సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఆడటంతో చాలా నేర్చుకుంటాం. బ్యాటింగ్ ఫోకస్, ఏకాగ్రత పుజారా నుంచి మరింత తెలుసుకున్నాను' అని మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు. చతేశ్వర్ పుజారా, నేను భిన్న దేశాలకు చెందిన వారిమైనా.. అతి పెద్ద క్రికెట్ కుటుంబంలో భాగస్వాములమని రిజ్వాన్ అన్నాడు. 2012లో చివరగా భారత్, పాకిస్థాన్‌లు ద్వైపాక్షిక సిరీస్‌లో పోటీపడ్డాయి. టెస్టు ఫార్మాట్లో చివరగా 2007లో తలపడ్డాయి. ఆ తర్వాత నుంచి ఐసీసీ ఈవెంట్లలోనే ముఖాముఖి ఆడుతున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్‌లో గ్రూప్ దశలోనే భారత్, పాకిస్థాన్ ఢకొీట్టాల్సి ఉంది.