Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్. సెమీఫైనల్ సమరం. మట్టికోర్టు దిగ్గజం రఫెల్ నాదల్ ఓ వైపు, జర్మనీ యువ కెరటం అలెగ్జాండర్ మరోవైపు. తొలి పాయింట్, తొలి గేమ్, తొలి సెట్.. ఇలా ప్రతి పాయింట్ కోసం స్పెయిన్ బుల్ చెమటోడ్చాడు. పారిస్‌లో 13 సార్లు చాంపియన్ నాదల్కు చెమటలు పట్టించిన జ్వెరెవ్.. రెండో సెట్ టైబ్రేకర్ ముంగిట చీలమండ గాయానికి గురయ్యాడు. నొప్పితో విలవిల్లాడిన జ్వెరెవ్ వాకోవర్‌తో సెమీస్ పోరు నుంచి తప్పుకున్నాడు.
14వ ఫ్రెంచ్ టైటిల్ వేటకు స్పెయిన్ బుల్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
- గాయంతో తప్పుకున్న జ్వెరెవ్
- రెండు సెట్లలో బుల్‌కు గట్టి పోటీ
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022
నవతెలంగాణ-పారిస్
ఊహించిన ఫలితమే. కానీ ఈ విధంగా కాదు!. ఫ్రెంచ్ ఓపెన్ మొనగాడు, 13 సార్లు పారిస్‌లో గ్రాండ్ చాంపియన్ రఫెల్ నాదల్ మరోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై గెలుపొంది టైటిల్ పోరుకు చేరుకున్నాడు. 3 గంటల 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ సమరంలో 7-6(10-8), 6-6తో స్పెయిన్ బుల్ ముందంజలో నిలిచాడు. రెండో సెట్ చివర్లో మూడో సీడ్ జ్వెరెవ్ చీలమండ గాయం బారిన పడ్డాడు. మ్యాచ్ ఆడలేని పరిస్థితుల్లో జ్వెరెవ్ పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఐదో సీడ్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోరులో ఓటమెరుగని రఫెల్ నాదల్.. ఆదివారం మెగా పోరులో రికార్డు 14వ టైటిల్ అందుకోవటం లాంఛనమే కాబోలు!.
సెమీస్ హోరాహోరీ! : పురుషుల సింగిల్స్ సర్క్యూట్లో క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్‌ను దాటేసిన స్పెయిన్ బుల్.. సెమీఫైనల్లో వరల్డ్ నం.3 అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఎలా ఎదుర్కొంటాడనే ఆసక్తి ఎక్కువగా కనిపించింది. భీకర ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడి ముందు నాదల్ నిలబడగలడా? అనే ప్రశ్నలు వినిపించాయి. సెమీఫైనల్లో నాదల్ విజయంపై అనుమానాలు వ్యక్తం చేసిన వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆడాడు అలెగ్జాండర్ జ్వెరెవ్. ఒక్క పాయింట్ కూడా నాదల్ చెమట చిందించకుండా సాధించలేకపోయాడు. ఆరంభం నుంచీ నాదల్కు జ్వెరెవ్ గట్టి పోటీ ఇచ్చాడు. నాదల్ మూడు ఏస్‌లు కొట్టగా.. జ్వెరెవ్ ఐదు ఏస్‌లతో విరుచుకుపడ్డాడు. నాదల్ ఐదు బ్రేక్ పాయింట్లు సాధించగా.. జ్వెరెవ్ సైతం ఐదు సార్లు స్పెయిన్ బుల్ సర్వ్‌ను బ్రేక్ చేశాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ 12 గేములు గెల్చుకోగా.. నాదల్ 13 గేములతో ముందంజలో నిలిచాడు. తొలి సెట్ కీలక టైబ్రేకర్‌లో పైచేయి సాధించిన నాదల్.. ఫైనల్లో అడుగుపెట్టేందుకు అర్హత నిరూపించుకున్నాడు. పాయింట్ల పరంగా 97-93తో జ్వెరెవ్‌పై నాదల్ స్వల్ప ఆధిక్యం సాధించాడు. నాదల్ 21 విన్నర్లు కొట్టగా.. జ్వెరెవ్ ఏకంగా 40 విన్నర్లు గెల్చుకున్నాడు. నాదల్ 26 అనవసర తప్పిదాలు చేయగా.. జ్వెరెవ్ 47 అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. నాదల్ ఓ డబుల్ ఫాల్ట్ చేయగా.. జ్వెరెవ్ ఎనిమిది సార్లు డబుల్ ఫాల్ట్ అయ్యాడు. గ్రౌండ్ షాట్లు, వ్యాలీ షాట్లు, ఓవర్‌హెడ్ షాట్లు, పాసింగ్ షాట్లు, అప్రోచ్ షాట్లలో జ్వెరెవ్ పైచేయి సాధించగా.. డ్రాప్ షాట్లు, లాబ్ షాట్లలో నాదల్ దుమ్మురేపాడు.
తొలి సెట్‌ను అలెగ్జాండర్ జ్వెరెవ్ గొప్పగా ఆరంభించాడు. నాదల్ అనవసర తప్పిదంతో తొలి సర్వ్‌ను కోల్పోయాడు. ఆరంభంలోనే బ్రేక్ పాయింట్ సాధించిన జ్వెరెవ్.. తన సర్వ్‌ను నిలుపుకుని 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. రెండో సర్వ్‌ను నిలుపుకున్న నాదల్ 1-2తో మ్యాచ్‌లోకి వచ్చాడు. వరుస సర్వ్‌లు నిలుపుకున్న జ్వెరెవ్ 4-3తో ఆధిక్యంలో కొనసాగాడు. కీలక సమయంలో జ్వెరెవ్‌ను బోల్తా కొట్టించిన నాదల్ బ్రేక్ పాయింట్‌తో స్కోరు 4-4తో సమం చేశాడు. ఇక్కడ్నుంచి ఇద్దరూ సర్వ్ నిలుపుకోవటంతో 6-6తో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో 10-8తో పైచేయి సాధించిన స్పెయిన్ బుల్ తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి సెట్ నెగ్గిన ఉత్సాహంలో రెండో సెట్లో బ్రేక్ పాయింట్‌తో బోణీ కొట్టాడు నాదల్. మరోసారి జ్వెరెవ్ సర్వ్‌ను బ్రేక్ చేసిన నాదల్ 2-1తో ముందంజ వేశాడు. కానీ ఆ తర్వాత వరుసగా నాదల్ రెండు బ్రేక్ పాయింట్లు కోల్పోయాడు. దీంతో ఆధిక్యం జ్వెరెవ్ పరమైంది. 5-3తో మ్యాచ్ పాయింట్ దిశగా సాగుతున్న జ్వెరెవ్‌ను నాదల్ నిలువరించాడు. ప్రత్యర్థి సర్వ్ బ్రేక్ చేసి, తన సర్వ్ నిలుపుకుని 5-5తో సమవుజ్జీగా నిలిచాడు. చివర్లో ఇద్దరూ సర్వ్‌లు నిలుపుకోవటంతో 6-6తో స్కోరు సమమైంది. రెండో సెట్ టైబ్రేకర్‌కు వెళ్లగా.. ఇంతలోనే అలెగ్జాండర్ జ్వెరెవ్ జారిపడి చీలమండ గాయానికి గురయ్యాడు. నొప్పితో విలవిల్లాడిన జ్వెరెవ్.. కొద్దిసేపటికే సెమీఫైనల్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రికార్డు స్థాయిలో కెరీర్ 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
మహిళల ఫైనల్ నేడు
2020 మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వైటెక్. 2018 గర్ల్స్ సింగిల్స్ విజేత కొకొ గాఫ్. అటు పొలాండ్ భామ, ఇటు అమెరికా అమ్మాయి ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మహిళల సింగిల్స్ 2022 టైటిల్ వేటలో నేడు ఇగా స్వైటెక్, కొకొ గాఫ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. నిజానికి ఫ్రెంచ్ ఓపెన్‌లో స్వైటెక్, గాఫ్ సమరం 2018లోనే జరగాల్సింది. 2018 గర్ల్స్ సింగిల్స్ సెమీఫైనల్లో తృటిలో మ్యాచ్ పాయింట్ కోల్పోయిన స్వైటెక్ ఫైనల్స్‌కు దూరమైంది. ఆ ఏడాది ఫైనల్స్‌కు చేరుకున్న కొకొ గాఫ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కొద్ది వారాల వ్యవధిలో ఇగా స్వైటెక్ వింబుల్డన్ జూనియర్ విజేతగా నిలిచింది. ఈ మూడేండ్లలో స్వైటెక్, గాఫ్ కెరీర్లో ఎన్నో మార్పులు. ఇగా స్వైటెక్ వరల్డ్ నం.1గా అవతరించగా.. కొకొ గాఫ్ సత్తా ఉన్న క్రీడాకారిణిగా వరల్డ్ నం.23గా కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌కు ఫైనల్స్‌కు ఇగా స్వైటెక్ హాట్ ఫామ్‌తో వచ్చింది. 34 మ్యాచుల్లో అజేయంగా దూసుకెళ్తోన్న స్వైటెక్.. 2007-08 తర్వాత వరుసగా ఆరు టైటిళ్లు గెల్చుకున్న జస్టిన్ హెనిన్ సరసన నిలిచేందుకు స్వైటెక్ రంగం సిద్ధం చేసుకుంది!. 2001లో కిమ్ క్లిస్టర్స్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించిన పిన్న వయస్కురాలిగా నిలిచిన 18 ఏండ్ల గాఫ్.. టైటిల్ రేసులో ఏమాత్రం వెనుకంజలో లేదు. అయితే, గత టోర్నీల్లో, మ్యాచుల్లో ఇగా స్వైటెక్ గణాంకాలు మరీ అద్భుతంగా ఉన్నాయి. నేడు స్వైటెక్‌ను కాదని గాఫ్ టైటిల్ ఎగరేసుకుపోతే మహిళల సింగిల్స్‌లో కొకొకు ఉన్న అండర్డాగ్ ట్యాగ్‌కు శాశ్వతంగా తెరపడినట్టే!.