Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ (పొలాండ్) మట్టికోర్టులో మరోసారి మెరిసింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికా యువ కెరటం కొకొ గాఫ్‌ను చిత్తు చేసిన స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది. 2020లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడిన ఇగా స్వైటెక్.. ఏడాది విరామం అనంతరం మళ్లీ టైటిల్‌ను హత్తుకుంది. రొలాండ్ గారోస్ టైటిల్‌తో పాటు వరుసగా 35వ విజయంతో వీనస్ విలియమ్స్ రికార్డును సమం చేసింది.
- ఫైనల్లో గాఫ్‌పై ఘన విజయం
- పొలాండ్ భామకు రెండో టైటిల్
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022
నవతెలంగాణ-పారిస్
వరల్డ్ నం.1, టాప్ సీడ్ ఇగా స్వైటెక్ ఇరగదీసింది. పొలాండ్ స్టార్ చాంపియన్ ఆట ముందు అమెరికా యువ కెరటం చిన్నబోయింది. టైటిల్ పోరులో 6-1, 6-3తో వరుస సెట్లలో అలవోక విజయం సాధించిన ఇగా స్వైటెక్ మూడేండ్లలో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. 2007-08లో జస్టిన్ హెనిన్ ( ఆరు టైటిళ్లు) అనంతరం వరుసగా తొమ్మిది ఫైనల్స్‌లో విజయాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా ఇగా స్వైటెక్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 21 ఏండ్ల ఇగా స్వైటెక్ ఫిబ్రవరి నుంచి ఎదురులేని ప్రదర్శనలు చేస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఏకపక్ష విజయంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు మహిళల సింగిల్స్ సర్క్యూట్లో వరుసగా 35వ విజయం సాధించిన వీనస్ విలియమ్స్ రికార్డును సమం చేసింది. ఓపెన్ శకంలో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న పదో క్రీడాకారిణిగా ఇగా స్వైటెక్ నిలిచింది.
స్వైటెక్‌కు ఎదురేది?! : మహిళల సింగిల్స్ టైటిల్ సమరం అంచనాలకు భిన్నంగా సాగింది. 2018 గర్ల్స్ చాంపియన్, 2020 మహిళల సింగిల్స్ విజేతకు నడుమ జరుగుతున్న పోరు కావటంతో మూడు సెట్ల సమరం ఖాయమనే అనిపించింది. 18 ఏండ్ల అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్ గొప్పగా ఆడుతుంది. మరో ఎండ్‌లో ఇగా స్వైటెక్ సూపర్ ఫామ్‌లో ఉంది. ఇద్దరు ఉత్తమ క్రీడాకారిణీలు టైటిల్ పోరుకు చేరుకోవటంతో అంతిమ సమరం అదుర్స్ అనుకున్నారు. కానీ వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ ప్రణాళికలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. 68 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను హృదయానికి హత్తుకుంది. 6-1, 6-3తో అలవోక విజయం సాధించింది. ఇగా స్వైటెక్ ఓ ఏస్ సంధించగా.. కొకొ గాఫ్ రెండు ఏస్‌లు కొట్టింది. మూడు సార్లు డబుల్ ఫాల్ట్ అయిన కొకొ గాఫ్.. స్వైటెక్ సర్వ్ బ్రేక్ చేయటంలో తేలిపోయింది. కొకొ గాఫ్ సర్వ్‌ను స్వైటెక్ ఏకంగా ఐదరు సార్లు బ్రేక్ చేయగా.. గాఫ్ మాత్రం ఒక్క బ్రేక్ పాయింట్‌తోనే సరిపెట్టుకుంది. పాయింట్ల పరంగా 62-39తో స్వైటెక్ దూకుడు చాటింది. ఇగా స్వైటెక్ 12 గేముల్లో గెలుపొందగా.. కొకొ గాఫ్ నాలుగు గేముల్లోనే పైచేయి సాధించింది. స్వైటెక్ 18 విన్నర్లు కొట్టగా.. గాఫ్ 14 విన్నర్లు సాధించింది. స్వైటెక్ 16 అనవసర తప్పిదాలు చేయగా.. గాఫ్ 23 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించింది.
స్వైటెక్ 171 గ్రౌండ్ స్ట్రోక్ షాట్లు కొట్టగా.. గాఫ్ 162 కొట్టింది. వాలీ షాట్లు, అప్రోచ్ షాట్లు, ఓవర్‌హెడ్ షాట్లలో స్వైటెక్ మెరువగా.. డ్రాప్ షాట్లు, లాబ్ షాట్లు, పాసింగ్ షాట్లలో కొకొ గాఫ్ సత్తా చాటింది. తొలి సెట్లో ఓ గేమ్‌తో సరిపెట్టుకున్న కొకొ గాఫ్.. రెండో సెట్లో కాస్త పోటీనిచ్చింది. మూడు గేములు గెల్చుకుని స్వైటెక్ కాస్త చెమటోడ్చేలా చేసింది. వరుస సెట్లలో ఫైనల్స్‌ను సొంతం చేసుకున్న ఇగా స్వైటెక్ చాంపియన్ ఆటతో చాంపియన్‌గా అవతరించింది.