Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా
న్యూఢిల్లీ : టీమ్ ఇండియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండు రోజులుగా కసరత్తులు చేస్తోంది. ఐపీఎల్15లో ఆడిన ఆటగాళ్లు విరామంలో ఉండగా.. నేరుగా జొహనెస్‌బర్గ్ నుంచి వచ్చిన సఫారీ క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చుతున్నారు. జూన్ 9 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా మీడియా సమావేశంలో మాట్లాడాడు. రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలం పెంచుకోవటమే ఈ సిరీస్‌లో మా లక్ష్యమని బవుమా అన్నాడు. 'టీ20 ప్రపంచకప్ వేదిక ఆస్ట్రేలియా పరిస్థితులు, భారత్‌లో పరిస్థితులకు పోలిక లేదు. అయినా, ఈ సిరీస్‌లో ఆడటం దక్షిణాఫ్రికాకు ఉపయోగమే. ఏ తరహా పోటీతత్వ క్రికెటైనా మాకు మేలు చేస్తుంది. ప్రపంచకప్‌లో ప్రణాళికల కోసం ఈ సిరీస్‌ను వాడుకుంటాం. ఆటగాళ్లకు జట్టులో తమ పాత్రపై అవగాహన, డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం కోసం ఈ సిరీస్ కీలకం. జట్టులో ఒకరిద్దరు కొత్త ఆటగాళ్లు ఉన్నారు. తుది జట్టులోకి వారికి అవకాశం కల్పించి, ఏ మేరకు రాణించగలరో చూస్తాం. భారత జట్టు కొత్తగా కనిపిస్తోంది. ఐపీఎల్లో రాణించిన క్రికెటర్లకు అవకాశాలు కల్పించారు. అలాగని, భారత జట్టును మేము చూసే కోణంలో ఎటువంటి మార్పు లేదు. భారత్-బి జట్టుగా మేము చూడటం లేదు. టీ20 ప్రపంచకప్‌కు ముందు మా బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేసుకోవాలి. బ్యాటింగ్ విభాగంలో ఎవరి పాత్ర ఏమిటీనే స్పష్టత రావాలి. అందుకోసం ఈ సిరీస్ గొప్పగా ఉపయోగపడనుంది' అని బవుమా తెలిపాడు. భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు న్యూఢిల్లీ, కటక్, వైజాగ్, రాజ్‌కోట్, బెంగళూర్లు వేదిక కానున్నాయి.