Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాప్నిల్, చోక్సీ జోడీకి స్వర్ణం
- ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ : బాకు షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ మంచి ప్రదర్శన చేసింది. రెండు స్వర్ణాలు, మూడు రజతాలు కొల్లగొట్టి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. షూటింగ్ ప్రపంచకప్ చివరి రోజు పోటీల్లో భారత జోడీ పసిడి పతకం గురి పెట్టింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (3పీ) మిక్స్డ్ విభాగంలో స్వాప్నిల్ కుశాల్, ఆశి చోక్సిలు పసిడి పతకం సాధించారు. శనివారం జరిగిన పసిడి పోటీలో ఉక్రెయిన్ షూటింగ్ జంట కులిశ్, దరియలపై 16-12తో పైచేయి సాధించిన మన షూటర్లు బంగారు పతకం సొంతం చేసుకున్నారు. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల జట్టు విభాగంలో భారత్‌కు ఎలవేనిల్, శ్రేయ అగర్వాల్, రమిత త్రయం పసిడి పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే. రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో వ్యక్తిగత, మెన్స్ జట్టు విభాగంలో సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్న స్వాప్నిల్ కుశాల్‌కు బాకు ప్రపంచకప్‌లో ఇదే తొలి పసిడి పతకం. అర్హత దశలో స్వాప్నిల్, ఆశి చోక్సిలు 900 పాయింట్లకు 881 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచి ముందంజ వేశారు. ఉక్రెయిన్ జోడీ రెండో స్థానంలో నిలిచి ముందంజ వేసింది. రెండో దశలో స్వాప్నిల్, ఆశి చోక్సి 600 పాయింట్లకు 583 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తుది దశలో ఉక్రెయిన్ జోడీ 6-2 ఆధిక్యంతో పసిడి దిశగా దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత వరుస రౌండ్లలో గురి తప్పని షూటింగ్‌తో 14-10తో భారత జోడీ ఆధిక్యంలోకి వచ్చింది.