Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టికోర్టు మొనగాడు మరోసారి గర్జించాడు. రికార్డు స్థాయిలో మెన్స్ సింగిల్స్ సర్క్యూట్లో 22వ గ్రాండ్‌స్లామ్ విజయాన్ని అందుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ చాంపియన్‌గా అవతరించి.. గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే ఓ టైటిల్‌ను అత్యధిక సార్లు గెల్చుకున్న అరుదైన రికార్డును నెలకొల్పాడు. అయితే, ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ 14వ టైటిల్ విజయానికి ఓ ప్రత్యేకత ఉంది. 36 ఏండ్ల వయసులో నవ యువకుడు, శిష్యుడు కాస్పర్ రూడ్‌పై దండయాత్ర చేసిన నాదల్.. ఫైనల్లో అత్యంత ఏకపక్ష విజయం నమోదు చేశాడు. రఫెల్ నాదల్ కెరీర్ 22వ గ్రాండ్‌స్లామ్ విజయంతో ఆల్ టైమ్ గ్రేట్ ఎవరనే చర్చను మరోసారి కదిపాడు!!!.
- ఫ్రెంచ్ ప్రేయసికి 14వ ముద్దు
- కెరీర్ రికార్డు 22వ గ్రాండ్‌స్లామ్
- చరిత్ర సృష్టించిన రఫెల్ నాదల్
- ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై గెలుపు
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022
నవతెలంగాణ-పారిస్
ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ చరిత్ర సృష్టించాడు. మట్టికోర్టు మొనగాడు రికార్డులు బద్దలుకొట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రికార్డు స్థాయిలో 14వ గ్రాండ్‌స్లామ్ విజయం అందుకున్న రఫెల్ నాదల్ (స్పెయిన్)..పురుషుల సింగిల్స్ సర్క్యూట్లో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో అత్యధిక ట్రోఫీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఓ ఏడాది తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్న రఫెల్ నాదల్.. లేటు వయసులో ఘాటు రికార్డులు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌పై వరుస సెట్లలో గెలుపొందిన నాదల్.. మట్టికోర్టు మహారాజుగా నిలిచాడు. 6-3, 6-3, 6-0తో రఫెల్ నాదల్ ఏకపక్ష విజయం నమోదు చేశాడు. కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరుకున్న కాస్పర్ రూడ్.. తొలి మెగా టైటిల్ వేటలో ఆరాధ్య ఆటగాడు, గురువు రఫెల్ నాదల్కు టైటిల్‌ను కోల్పోయాడు.
బుల్ దండయాత్ర : 15 ఏండ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్‌లో దివంగత స్పెయిన్ ఆటగాడు ఆండ్రీస్ గిమెనో చాంపియన్‌గా నిలిచి 34 ఏండ్ల వయసులో టైటిల్ కొట్టిన రికార్డును నెలకొల్పాడు. తాజాగా స్పెయిన్ దిగ్గజం రికార్డును స్పెయిన్ బుల్ బద్దలు కొట్టాడు. 36 ఏండ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. తాజా విజయంతో కెరీర్ 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకున్న స్పెయిన్ బుల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రేసులో నొవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్ల కంటే రెండు టైటిళ్ల ముందంజలో కొనసాగుతున్నాడు. ఆదివారం నాటి ఫైనల్లో అద్వితీయ విజయంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలుపోటముల రికార్డును 112-3తో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. రఫెల్ నాదల్ రికార్డు టైటిల్ వేట పోరును స్పెయిన్ రాజు ఫెలిపె, నార్వే యువరాజు హాకాన్లు స్టేడియంలో పక్కపక్కన కూర్చుని వీక్షించారు.
ఆదివారం నాటి ఫైనల్‌కు హాట్ ఫేవరేట్‌గా బరిలో నిలిచిన స్పెయిన్ బుల్ అందుకు తగినట్టుగానే రాణించాడు. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీషైనల్లో తన ఓటమిని జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చిన ఆ నాటి బాలుడు, ఆ తర్వాతి శిష్యుడు, తాజా ఫైనల్ ప్రత్యర్థి కాస్పర్ రూడ్ (నార్వే)ను నాదల్ చిత్తుగా ఓడించాడు. ఆరంభంలో సర్వ్‌లో ఇబ్బంది పడిన రఫెల్ నాదల్.. వేగంగా పుంజుకున్నాడు. 4-1తో ముందంజ వేశాడు. 48 నిమిషాల్లో ముగిసిన తొలి సెట్‌ను నాదల్ 6-3తో సొంతం చేసుకున్నాడు. తొలి సర్వ్‌లో కేవలం రెండు పాయింట్లే కోల్పోయిన కాస్పర్ రూడ్..శీతల పరిస్థితుల్లో తడబడ్డాడు. రెండో సెట్ సమయానికి కాస్త ఎండ కాయటంతో.. కాస్సర్ రూడ్ మ్యాచ్ రేసులోకి వచ్చాడు. తొలి సర్వ్‌ను నిలుపుకున్న కాస్పర్ రూడ్.. రఫెల్ నాదల్ సర్వ్‌ను బ్రేక్ చేశాడు. కీలక బ్రేక్ పాయింట్‌తో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఇక్కడ నుంచి అసలు సమరం మొదలైందనే అనిపించింది. కానీ స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరింత దూకుడుగా దూసుకొచ్చాడు. వరుసగా కాస్పర్ రూడ్ సర్వ్‌ను బ్రేక్ చేసిన రఫెల్ నాదల్.. కాస్పర్ రూడ్‌కు ఒక్క గేమ్ గెల్చుకునే అవకాశం ఇవ్వలేదు. ర్యాలీలు, ఓవర్ హెడ్ షాట్లు, సర్వ్‌లు, ఏస్‌లు, నెట్ గేమ్‌లో కాస్పర్ రూడ్‌ను చిత్తు చేశాడు. 6-3తో రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మూడో సెట్లో కాస్పర్ రూడ్ పూర్తిగా చేతులెత్తేశాడు. స్పెయిన్ బుల్ దూకుడు ముందు ఏమాత్రం నిలువలేకపోయాడు. మూడో సెట్లో కాస్సర్ రూడ్ ప్రతి సర్వ్‌ను బ్రేక్ చేసిన రఫెల్ నాదల్.. స్వీయ సర్వీస్‌లో అదరగొట్టాడు. 6-0తో మూడో సెట్‌ను, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.
ఫైనల్లో గణాంకాల పరంగానూ రఫెల్ నాదల్కు ఎదురులేదు. కాస్పర్ రూడ్ ఒక్క ఏస్‌ను కొట్టలేదు. మరోవైపు రఫెల్ నాదల్ ఏకఛత్రాధిపత్యం నడిచిన అంతిమ సమరంలో ఓ ఏస్‌తో మెరిశాడు. రఫెల్ నాదల్ మూడుసార్లు డబుల్ ఫాల్ట్‌కు పాల్పడగా.. కాస్పర్ రూడ్ డబుల్ ఫాల్ట్‌కు తావివ్వలేదు. కాస్పర్ రెండు తొలి రెండు సెట్లలో కలిసి రెండు సార్లు రఫెల్ నాదల్ సర్వ్‌ను బ్రేక్ చేయగా.. రఫెల్ నాదల్ ఏకంగా ఎనిమిది బ్రేక్ పాయింట్లతో కదం తొక్కాడు. పాయింట్ల పరంగా 86-55తో రఫెల్ నాదల్ పైచేయి సాధించాడు. రఫెల్ నాదల్ 18 గేములు గెల్చుకోగా.. కాస్పర్ రూడ్ 6 గేములతోనే సరిపెట్టుకున్నాడు. సొంత సర్వ్‌లో పది గేములు గెల్చుకున్న రఫెల్ నాదల్.. మిగతా గేముల కోసం కాస్పర్ రూడ్ సర్వ్‌ను చిత్తు చేశాడు. రెండో సెట్లో 1-3తో వెనుకంజలో నిలిచిన రఫెల్ నాదల్.. అక్కడ్నుంచి కాస్పర్ రూడ్‌కు ఒక్క గేమ్‌ను సైతం కోల్పోలేదు. వరుసగా 11 గేములు గెలుపొందిన రఫెల్ నాదల్ రెండో సెట్‌ను 6-3తో, మూడో గేమ్‌ను 6-0తో కైవసం చేసుకున్నాడు. కాస్పర్ రూడ్ 26 అనవసర తప్పిదాలు చేయగా.. రఫెల్ నాదల్ 18 అనవసర తప్పిదాలతో సరిపెట్టాడు. రఫెల్ నాదల్ 21 ఫోర్స్డ్ తప్పిదాలు చేయగా.. కాస్పర్ రూడ్ ఇక్కడ 23 చేశాడు. రఫెల్ నాదల్ 37 విన్నర్లతో చెలరేగగా.. కాస్పర్ రూడ్ 16 విన్నర్లు మాత్రమే కొట్టాడు. గ్రౌండ్ షాట్లలో 326-321తో, ఓవర్‌హెడ్ షాట్లలో 3-2తో, పాసింగ్ షాట్లలో 13-8తో, లాబ్ షాట్లలో 10-4తో రఫెల్ నాదల్ ఆధిపత్యం చూపించాడు. వ్యాలీ షాట్లలో 10-8, అప్రోచ్ షాట్లలో 5-4తో, డ్రాప్ షాట్లలో 15-12తో గురువు రఫెల్ నాదల్‌పై శిష్యుడు కాస్పర్ రూడ్ ఆధిక్యం ప్రదర్శించాడు.
'కాస్పర్ రూడ్.. నీతో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తలపడటం నిజంగా గొప్ప అనుభూతి. నువ్వు చాలా గొప్ప ఆటగాడివి. అమోఘమైన భవిష్యత్ ఉన్న నీకు అభినందనలు. ఈ రెండు వారాలు ఎంతో ప్రత్యేకం. కెరీర్లో ముందంజ వేసేందుకు ఈ అడుగు ఎంతో కీలకం. నీ పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్‌లో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇక 36 ఏండ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తలపడి.. విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఇదో గొప్ప అనుభూతి. నిజానికి నాకు ఇది నమ్మశక్యం కాని విజయం. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నేను పోరాడుతూనే ఉంటాను' అని టైటిల్ పోరులో శిష్యుడు కాస్పర్ రూడ్‌పై విజయానంతరం స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ భావోద్వేగంగా మాట్లాడాడు.