Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో రూట్ అజేయ శతకం
లార్డ్స్ : కొత్త కెప్టెన్, కొత్త కోచ్ మంత్ర ఫలించింది. తొలి ఇన్నింగ్స్‌లో 12/4తో ఉన్న ఓ జట్టు టెస్టు మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని ఎవరు ఊహించగలరు?. తాజా మాజీ కెప్టెన్ జో రూట్ (115 నాటౌట్, 170 బంతుల్లో 12 ఫోర్లు) అజేయ శతకంతో కొత్త కెప్టెన్ ప్రయాణం విజయంతో ఆరంభమయ్యేలా చూశాడు. తొలి టెస్టులో న్యూజిలాండ్‌కు ఊహించని షాక్‌ను ఇచ్చాడు. 277 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ ఓ దశలో రెండో ఇన్నింగ్స్‌లో 69/4తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బెన్ స్టోక్స్ (54, 110 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. జో రూట్‌తో కలిసి ఐదో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. బెన్ స్టోక్స్ నిష్క్రమించినా.. బెన్ ఫోక్స్ (32 నాటౌట్, 92 బంతుల్లో 3 ఫోర్లు) అండతో జో రూట్ రెచ్చిపోయాడు. ఛేదనలో అజేయ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. జో రూట్, బెన్ ఫోక్స్ జోడీ ఆరో వికెట్‌కు అజేయంగా 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ (4/79) పోరాటం వృథా అయ్యింది. టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ముందంజ వేసింది. జో రూట్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.