Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమణ
- గొప్ప కెరీర్‌ను ముగించిన హైదరాబాదీ
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికింది. 39 ఏండ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్టు ఎంపికకు ముందు మిథాలీరాజ్ వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్‌కు 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లు ఆడిన మిథాలీరాజ్.. పది వేలకు పరుగులు సాధించింది. 2005, 2017 ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్‌కు సారథ్యం వహించిన మిథాలీరాజ్.. ఈ ఘనత వహించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.
పరుగుల యంత్రం ఆగింది! : మహిళల క్రికెట్లో ఓ శకం ముగిసింది. పరుగుల యంత్రం ఆగింది. 1999లో ఐర్లాండ్‌పై భారత్‌కు అరంగేట్రం చేసిన మిథాలీరాజ్ అద్భుత శతకం సాధించింది. 16 ఏండ్ల వయసులో శతకం సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డు నెలకొల్పింది. వన్డే ఫార్మాట్లో ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 232 వన్డేలు ఆడిన మిథాలీరాజ్ 50.68 బ్యాటింగ్ సగటుతో 7805 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 125. ఇందులో 7 శతకాలు, 64 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో అత్యధిక అర్థ సెంచరీల రికార్డు మిథాలీరాజ్ పేరిటే ఉంది. 12 టెస్టుల్లో 43.68 సగటుతో 699 పరుగులు చేసింది. ఓ సెంచరీ, నాలుగు అర్థ శతకాలు బాదింది. టీ20 ఫార్మాట్లో 89 మ్యాచుల్లో ఆడిన మిథాలీరాజ్ 37.52 సగటుతో 2364 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. సుదీర్ఘ కెరీర్లో నిలకడగా పరుగులు పిండుకున్న మిథాలీరాజ్ భారత్‌లో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి. భారత క్రికెట్లో ఓ దశలో సుమారు పదేండ్ల పాటు బ్యాటింగ్ బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది మిథాలీ రాజ్. ఉజ్వల కెరీర్లో మిథాలీరాజ్ దాదాపుగా కెప్టెన్‌గానే కొనసాగింది. ఆడిన 12 టెస్టుల్లో 8 టెస్టుల్లో కెప్టెన్సీ వహించింది. 155 వన్డేల్లో 89 విజయాలు అందించింది. 32 టీ20ల్లో 17 విజయాలు సాధించిపెట్టింది.
ఐసీసీ ప్రపంచకప్ సాధించాలనే స్వప్నం నెరవేరకుండానే మిథాలీ ఆట ముగించింది. 2005లో ఏకపక్ష ఫైనల్లో ఆసీస్ చేతిలో 98 పరుగులు ఓడగా.. 2017 ఫైనల్లో ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ ఫైనల్లో 9 పరుగుల తేడాతో కప్పును చేజార్చుకుంది. మిథాలీరాజ్ కెరీర్లో వివాదాలకు సైతం స్థానం ఉంది!. అందులో ముఖ్యమైనది 2018 ఐసీసీ టీ20 ప్రపంచకప్. గ్రూప్ దశలో అర్థ సెంచరీలు బాదినా.. స్ట్రయిక్‌రేట్ కారణంగా ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్స్‌కు మిథాలీ రాజ్‌ను తుది జట్టు నుంచి తప్పించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సహా చీఫ్ కోచ్ రమేశ్ ఫొవార్తో మిథాలీ రాజ్‌కు తీవ్ర విభేదాలు పొడచూపాయి. ఆ తర్వాత కాలంలో రమేశ్ పొవార్ కోచ్‌గా దిగిపోయినా.. ఆ మంటలు ఆరలేదు!. ఆ అవమానంతోనే మిథాలీరాజ్ అర్థాంతరంగా టీ20 కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించింది. 2022 ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో విజయంతో వీడ్కోలు పలకాలని ఆశించిన మిథాలీకి నిరాశే ఎదురైంది. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచే ఆమెకు చివరిదైంది. ఆ మ్యాచ్‌లో మిథాలీ 64 పరుగులతో అర్థ సెంచరీ చేసింది. బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో రైల్వేస్ జట్టులో నిలిచినా ఆడలేదు. మహిళల చాలెంజర్ ట్రోఫీలో వెలాసిటీ సారథ్యం నుంచి తప్పుకుంది. దీంతో మిథాలీ రాజ్ ఆటకు గుడ్‌బై చెబుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్టు ఎంపికకు ముందు మిథాలీ రాజ్ వీడ్కోలు వార్త చెప్పింది. ఊహించినట్టుగా వన్డే జట్టు పగ్గాలు హర్మన్‌ప్రీత్ కౌర్‌కు దక్కాయి.
భారత జట్టు భవిష్యత్ ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణుల చేతుల్లో ఉంది. నా కెరీర్‌ను ముగించేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి భారత్‌కు విజయం అందించాలనే సంకల్పంతోనే ఆడాను. త్రివర్ణ జెండాకు ప్రాతినిథ్యం వహించేందుకు ఎప్పుడూ సంతోషిస్తాను. కొన్నేండ్లుగా భారత్‌కు నాయకత్వం వహించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇది నన్ను గొప్ప వ్యక్త్తిత్వం ఉన్న మనిషిగానే కాకుండా, భారత క్రికెట్‌ను సైతం మార్చివేసిందని నమ్ముతున్నాను. ఓ ప్రయాణం ముగిసింది. కానీ ఆటతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. మహిళల క్రికెట్ భారత్‌లో, ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ది చెందేందుకు నా వంతు బాధ్యత నిర్వర్తిస్తాను' - మిథాలీ రాజ్