Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రకు గెలుపు దూరంలో భారత్
- నేడు దక్షిణాఫ్రికాతో తొలి టీ20 పోరు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
నవతెలంగాణ-న్యూఢిల్లీ
టీమ్ ఇండియా చరిత్రను వేటాడుతోంది!. టీ20 ఫార్మాట్లో వరుసగా అత్యధిక మ్యాచుల్లో విజయాలు సాధించిన జట్టుగా నిలిచేందుకు భారత్ ఒక్క విజయం దూరంలో నిలిచింది. నేడు దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో టీమ్ ఇండియా నెగ్గితే వరుసగా 13వ విజయంతో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించనుంది. రికార్డులు పక్కనపెడితే, ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికా కౌంట్‌డౌన్ మొదలుపెట్టాయి. తాజా సిరీస్‌తోనే వరల్డ్‌కప్ సన్నాహకం పూరించనున్నాయి.
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌తో క్రికెట్ తిరిగి పాత ప్రపంచంలోకి అడుగుపెడుతోంది!. ఐపీఎల్15 ఫైనల్స్‌కు 100000 మంది అభిమానులు హాజరు కాగా.. పొట్టి సిరీస్‌కు సైతం ప్రేక్షకులు పోటెత్తనున్నారు. కోవిడ్-19 నిబంధనలు, రెగ్యులర్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ బుడగ ప్రపంచం నుంచి ఆంక్షలు లేని క్రికెట్ వరల్డ్‌లోకి ఈ సిరీస్ తిరిగి తీసుకెళ్లనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు 130 రోజులే ఉండగా దక్షిణాఫ్రికా సిరీస్‌ను చాలా సిరీయస్‌గా తీసుకుంది. ఐపీఎల్ అనంతరం జరుగుతున్న సిరీస్‌కు కీలక ఆటగాళ్లకు భారత్ విశ్రాంతి కల్పించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రాలు ఈ సిరీస్‌లో ఆడటం లేదు. గజ్జల్లో గాయంతో కెప్టెన్ కెఎల్ రాహుల్, చేతి గాయంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం సఫారీతో సిరీస్‌కు దూరమయ్యారు. ఐపీఎల్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా నేడు రికార్డు విజయంపై కన్నేసి బరిలోకి దిగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 పోరు నేడు.
పంత్ సారథ్యంలో..! : యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సఫారీతో సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మంచి మార్కులు కొట్టేసిన పంత్.. ఐదు మ్యాచుల సిరీస్‌కు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్15లో 14 మ్యాచుల్లో 151.79 స్ట్రయిక్‌రేట్‌తో 340 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో పంత్ కీలకం కానున్నాడు. సఫారీ పేసర్ ఎన్రిచ్ నోకియా పేస్ సవాల్‌కు పంత్ ఏ విధంగా బదులిస్తాడో ఆసక్తికరం. ఐపీఎల్లో మిడిల్ ఆర్డర్లో మెరిసిన హార్దిక్ పాండ్య, లోయర్ ఆర్డర్లో దుమ్మురేపిన దినేశ్ కార్తీక్ పాత్రలు జాతీయ జట్టులో ఎలా ఉండనున్నాయో ఆసక్తి రేపుతోంది. నాల్గో స్థానంలో హార్దిక్ పాండ్య 44.27 సగటుతో పరుగులు పిండుకున్నాడు. మరోవైపు దినేశ్ కార్తీక్ ఫినిషర్ పాత్రకు కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు. హార్దిక్ పాండ్యను ఫినిషర్‌గానే చూస్తే.. దినేశ్ కార్తీన్‌ను టాప్-5లో నిలిపే అవకాశం ఉంది. ఫినిషర్‌గా సత్తా చాటిన కార్తీక్.. టాప్-5లో ఇమడగలడా? లేదా? అనేది చూడాలి. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు రాణించాలని చూస్తున్నారు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ ముందుండి నడిపించునండగా.. హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్లు జత కలువనున్నారు. యుజ్వెంద్ర చాహల్, అక్షర్ పటేల్‌లు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
సఫారీతో జాగ్రత్త! : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 రికార్డు గొప్పగా లేదు. చివరి ఐదు ముఖాముఖి మ్యాచుల్లో 2-2తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఐపీఎల్ అనుభంతో సఫారీ ఆటగాళ్లు భారత పిచ్‌లపై స్వేచ్ఛగా రాణిస్తున్నారు. తాజా సిరీస్ అందుకు భిన్నంగా ఉండబోదని చెప్పవచ్చు. క్వింటన్ డికాక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో 36.29 సగటు, 148.97 స్ట్రయిక్‌రేట్‌తో 508 పరుగులు సాధించాడు డికాక్. టాప్ ఆర్డర్లో డికాక్‌ను నిలువరించటం అంత సులువు కాదు. సఫారీ సారథి తెంబ బవుమాకు భారత్‌పై మంచి రికార్డుంది. ఈ ఇద్దరి కోసం భారత్ భువనేశ్వర్‌ను బరిలో నిలిపే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన డెవిడ్ మిల్లర్ భారత్‌కు సవాల్ విసరనున్నాడు. 68.71 సగటు, 142.73 స్ట్రయిక్‌రేట్‌తో 481 పరుగులు చేసిన డెవిడ్ మిల్లర్.. పొట్టి సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు ఎక్స్‌ఫ్యాక్టర్ కానున్నాడు. స్పిన్నర్లపై విరుచుకుపడుతున్న డెవిడ్ మిల్లర్ కోసం భారత్ నయా పేస్ అస్త్రాన్ని సంధిస్తుందేమో చూడాలి. కగిసో రబాడ, ఎన్రిచ్ నోకియా, మార్కో జాన్సెన్లతో కూడిన సఫారీ బౌలింగ్ బృందం బలంగా కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం : అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల)లో జరిగిన ఆరు టీ20ల్లో టాస్ నెగ్గిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. మ్యాచ్ ఫలితంలో టాస్ పాత్ర ఉందని ఏ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించలేదు. మూడు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించగా.. మూడు మ్యాచుల్లో తొలుత బౌలింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 156. ఇక్కడ కాస్త బౌన్స్ లభిస్తుంది, కానీ ఆశించిన టర్న్ ఉండకపోవవచ్చు. వాతావరణం పరంగా గత నెల రోజులుగా ఎండ దంచి కొడుతున్నాయి!. నేటి మ్యాచ్‌లో సైతం అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, యుజ్వెంద్ర చాహల్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, తెంబ బవుమా (కెప్టెన్), ఎడెన్ మార్కరం, రస్సీ వాన్‌డర్ డసెన్, డెవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోకియా, మార్కో జాన్సెన్, తంబ్రి షంషి.
: టీ20 ఫార్మాట్లో భారత్ వరుసగా 12 విజయాలు సాధించింది. అఫ్గనిస్థాన్, రోమానియా సైతం వరుసగా 12 మ్యాచుల్లో గెలుపొం దింది. చివరగా ఆడిన పది టీ20 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్ ఒక్క సిరీస్‌లోనే తడబడింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఈ ఫార్మాట్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమ్ ఇండియా రికార్డు సృష్టించనుంది.
రాహుల్, కుల్దీప్ ఔట్ : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ. రోహిత్, కోహ్లి, బుమ్రా లేకుండా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయంతో దూరమయ్యాడు. రాహుల్ గజ్జల్లో గాయంతో బాధపడుతుండగా.. కుల్దీప్ యాదవ్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ చేతి గాయానికి గురయ్యాడు. రాహుల్, కుల్దీప్ ఫిట్నెస్ కోసం ఎన్సీఏ బెంగళూర్‌కు వెళ్లనున్నారు. ఈ ఇద్దరి స్థానంలో సెలక్షన్ కమిటీ ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. కెప్టెన్సీ పగ్గాలు రిషబ్ పంత్‌కు దక్కగా.. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఎంపికయ్యాడు.