Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పి.వి సింధు ముందంజ
- ఇండోనేషియా మాస్టర్స్
జకర్తా (ఇండోనేషియా) : భారత స్టార్ షట్లర్లు ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ముందంజ వేశారు. థామస్ కప్ హీరో, అగ్రశ్రేణి క్రీడాకారుడు లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. మరోవైపు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, నాల్గో సీడ్ పి.వి సింధు సైతం మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ఫైనల్లోకి చేరుకుంది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌లో అటు లక్ష్యసేన్, ఇటు పి.వి సింధు సాధికారిక విజయాలు నమోదు చేశారు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత పోరాటానికి తెరపడింది. సుమిత్ రెడ్డి, అశ్విని పొన్నప్ప జంట ప్రీ క్వార్టర్స్‌లో చేతులెత్తేశారు.
లక్ష్య దూకుడు : 54 నిమిషాల ప్రీ క్వార్టర్‌ఫైనల్ పోరులో యువ షట్లర్ లక్ష్యసేన్ దుమ్మురేపాడు. డెన్మార్క్ షట్లర్ రాస్మస్ గెమ్కేపై వరుస గేముల్లో గెలుపొందాడు. 21-18, 21-15తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో విరామ సమయానికి 10-11తో వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్.. ద్వితీయార్థంలో పుంజుకున్నాడు. 12-12తో స్కోరు సమం చేసి.. 16-12తో ఆధిక్యంలో నిలిచాడు. రాస్మస్ వెంబడించటంతో స్కోరు 17-17తో సమమైంది. ఈ సమయంలో గొప్పగా ఆడిన లక్ష్యసేన్ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. 21-18తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో సైతం ప్రథమార్థంలో డెన్మార్క్ షట్లర్ బాగా ఆడాడు. 11-10తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచాడు. కానీ విరామ అనంతరం లక్ష్యసేన్ దూకుడు ముందు నిలువలేకపోయాడు. 13-13తో స్కోరు సమం చేసిన లక్ష్యసేన్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లతో దూసుకెళ్లాడు. 21-15తో రెండో గేమ్‌ను, క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్, అశ్విని జంట 18-21, 13-21తో రెండో సీడ్ చైనా జోడీ చేతిలో పోరాడి ఓడింది.
మరోవైపు మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు ప్రీ క్వార్టర్స్‌లో చెమటోడ్చింది. 71 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్ గ్రెగోరియ మరిస్కతో మూడు గేముల్లో గెలుపొందింది. 23-21, 20-22, 21-11తో సింధు విజయం సాధించింది. తొలి రెండు గేముల్లో ఇండోనేషియా షట్లర్ నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్ టైబ్రేకర్‌లో సింధు పైచేయి సాధించగా.. రెండో గేమ్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి గెలుపొందింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు చాంపియన్ ఆట రుచి చూపించింది. ఏకపక్షంగా సాగిన మూడో గేమ్‌లో సింధు 21-11తో ఇండోనేషియా అమ్మాయిని చిత్తు చేసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు జరిగే క్వార్టర్‌ఫైనల్ పోరులో ఐదో సీడ్ థారులాండ్ షట్లర్ రచనోక్ ఇంటనాన్‌తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో చైనీస్ తైపీ షట్లర్ చో థిన్ చెన్‌తో లక్ష్యసేన్ పోటీపడనున్నాడు.