Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో డుసెన్ తోడుగా దండయాత్ర
- తొలి టీ20లో భారత్ పరాజయం
- రాణించిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య
దక్షిణాఫ్రికా మరోసారి పంచ్ ఇచ్చింది!. పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియాపై పైచేయి సాధించింది. ఈ ఫార్మాట్లో రికార్డు 13వ వరుస విజయంపై కన్నేసిన టీమ్ ఇండియాకు తొలి టీ20లో పరాభవం ఎదురైంది. 212 పరుగుల భారీ ఛేదనలో డెవిడ్ మిల్లర్, వాన్‌డర్ డుసెన్ అజేయ అర్థ సెంచరీలతో చెలరేగారు. ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
లక్ష్యం 212 పరుగులు. పది ఓవర్లలో ఆ జట్టు స్కోరు 86/3. చివరి 60 బంతుల్లో 126 పరుగులు చేయాలి. సాధించాల్సిన రన్‌రేట్ 13కు చేరువగా ఉంది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ జట్టుకు విజయంపై ఆశలు ఉండనే ఉండవు!. కానీ ఆధునిక క్రికెట్లో సమీకరణాలు పూర్తి భిన్నం. డెవిడ్ మిల్లర్ (64 నాటౌట్, 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), వాన్‌డర్ డుసెన్ (75 నాటౌట్, 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఛేదనలో అజేయ అర్థ సెంచరీలతో చెలరేగారు. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. మిల్లర్, డుసెన్ దండయాత్రతో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లతో తేడాతో తొలి టీ20లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (76, 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా.. శ్రేయస్ అయ్యర్ (36), రిషబ్ పంత్ (29), హార్దిక్ పాండ్య (31 నాటౌట్) రాణించారు. సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం కటక్‌లో జరుగనుంది.
దంచికొట్టారు : 212 పరుగుల భారీ ఛేదనలో డెవిడ్ మిల్లర్ (64 నాటౌట్), డుసెన్ (75) దంచికొట్టారు. తొలి పది ఓవర్లలో డికాక్ (22), బవుమా (10), ప్రిటోరియస్ (29)లను పెవిలియన్‌కు చేర్చిన భారత్.. సఫారీలను 86/3తో ఒత్తిడిలోకి నెట్టింది. ఐపీఎల్ ఫామ్ కొనసాగించిన డెవిడ్ మిల్లర్ తొలుత స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత పేసర్లకూ చుక్కలు చూపించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన డుసెన్.. 29 పరుగుల వద్ద శ్రేయస్ క్యాచ్ వదిలేయటంతో బతికిపోయాడు. మిల్లర్ అండతో క్రీజులో కుదురుకున్నాక ధనాధన్ మొదలుపెట్టాడు. ఈ జోడీ 10.3 ఓవర్లలో నాల్గో వికెట్‌కు అజేయంగా 131 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికాకు తొలి టీ20లో మెరుపు విజయాన్ని కట్టబెట్టారు.
రాణించిన కిషన్ : ఓపెనర్ ఇషాన్ కిషన్ (76, 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ (23, 15 బంతుల్లో 3 సిక్స్‌లు)తో కలిసి పవర్‌ప్లేలో దూకుడుగా ఆడాడు. కిషన్, గైక్వాడ్ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం జోడించారు. రుతురాజ్ గైక్వాడ్ మూడు సిక్సర్లతో మరో ఎండ్‌లో కిషన్ పని సులువు చేశాడు. పవర్‌ప్లే అనంతరం రుతురాజ్ వికెట్ కోల్పోగా..శ్రేయస్ అయ్యర్ (36, 27 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) తోడుగా కిషన్ చెలరేగాడు. నిలకడగా మెరిసిన ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించాడు. అర్థ సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన ఇషాన్ కిషన్.. సఫారీ బౌలర్లపై పైచేయి సాధించాడు. శ్రేయస్ అయ్యర్ సైతం మూడు సిక్సర్లు బాదినా.. అతడు వేగంగా పరుగులు చేయటంలో తడబడ్డాడు!. కెప్టెన్ రిషబ్ పంత్ (29, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (31 నాటౌట్, 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) డెత్ ఓవర్లలో ధనాధన్ జోరు చూపించారు. హార్దిక్ పాండ్య మూడు బుల్లెట్ సిక్సర్లు సంధించగా.. పంత్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో దండెత్తాడు. దీంతో భారత్ 211 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : కిషన్ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 76, గైక్వాడ్ (సి) బవుమా (బి) పార్నెల్ 23, శ్రేయస్ (బి) ప్రిటోరియస్ 36, పంత్ (సి) డుసెన్ (బి) నోకియా 29, హార్దిక్ నాటౌట్ 31,కార్తీక్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం :(10 ఓవర్లలో 4 వికెట్లకు) 211.
వికెట్ల పతనం : 1-57, 2-137, 3-156, 4-202.
బౌలింగ్ : మహరాజ్ 3-0-43-1, రబాడ 4-0-35-0, నోకియా 4-0-36-1, పార్నెల్ 4-0-32-1, షంషి 2-0-27-0, ప్రిటోరియస్ 3-0-35-1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : డికాక్ (సి) కిషన్ (బి) అక్షర్ 22, బవుమా (సి) పంత్ (బి) భువనేశ్వర్ 10, ప్రిటోరియస్ (బి) హర్షల్ 29, డుసెన్ నాటౌట్ 75, మిల్లర్ నాటౌట్ 64, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం :(19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 212.
వికెట్ల పతనం : 1-22, 2-61, 3-81.
బౌలింగ్ : భువనేశ్వర్ 4-0-43-1, అవేశ్ 4-0-35-0, చాహల్ 2.1-26-0, హార్దిక్ 1-0-18-0, హర్షల్ 4-0-43-1, అక్షర్ 4-0-40-1.