Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్ ఓటమి
- ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్
జకర్తా (ఇండోనేషియా) : ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో భారత షట్లర్ల టైటిల్ వేటకు తెరపడింది. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు వరుస గేముల్లో పరాజయం పాలవగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ మూడు గేముల్లో పోరాడి ఓడాడు. ఏడో సీడ్ లక్ష్యసేన్ మరోసారి చైనీస్ తైపీ షట్లర్‌కు తలొంచాడు. మూడో సీడ్ చో థిన్ చెన్ 21-16, 12-21, 21-14తో లక్ష్యసేన్‌పై గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించాడు. తొలి గేమ్‌లో గట్టి పోటీ నిచ్చిన లక్ష్యసేన్.. రెండో గేమ్‌ను సులువుగా సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ మళ్లీ తడబాటుకు గురయ్యాడు. సెమీఫైనల్ బెర్త్‌ను చైనీస్ తైపీ షట్లర్‌కు కోల్పోయాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో నాల్గో సీడ్ పి.వి సింధు పరాజయం పాలైంది. ఐదో సీడ్ రచనోక్ ఇంటనాన్ (థారులాండ్) చేతిలో వరుస గేముల్లో ఓటమి చెందింది. 12-21, 10-21తో 33 నిమిషాల్లోనే పి.వి సింధు చేతులెత్తేసింది. సింధు, లక్ష్యసేన్ ఓటమితో ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత టైటిల్ ఆశలకు తెరపడింది.