Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కాసుల వర్షంలో మునిగితేలుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐకి) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్లో రానున్న ఐదు సీజన్లకు గాను నిర్వహించనున్న మీడియా హక్కుల వేలం రేసు నుంచి రిటైల్, టెక్ దిగ్గజ సంస్థలు అమెజాన్, గూగుల్ తప్పుకున్నాయి. రికార్డు స్థాయిలో రూ.50-60 వేల కోట్ల ధర అంచనాలతో సాగుతున్న ఐపీఎల్ మీడియా హక్కులు.. ఈ రెండు సంస్థల నిష్క్రమణతో రూ.50 వేల కోట్ల లోపు సరిపెట్టుకునే పరిస్థితి రావచ్చు!.
- ఐపీఎల్ మీడియా హక్కుల వేలానికి దూరం
- వేలానికి ముందు బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ!
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల వేలం రేసు నుంచి అమెరికా రిటైల్, టెక్ దిగ్గజ కంపెనీలు తప్పుకున్నాయి. అమెజాన్, గూగుల్ సంస్థలు ఐపీఎల్ టెండర్లు దాఖలు ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. 2023-2027 కాలానికి మీడియా హక్కుల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు పెరుగుతున్న ఆదరణ, డిజిటల్ మీడియా గణనీయ వృద్ధితో రానున్న ఐదేండ్ల కాలానికి ఐపీఎల్ మీడియా హక్కుల ధర ఆకాశానికి చేరనుందనే అంచనాలు ఉన్నాయి. గత ఐదేండ్ల కాలానికి స్టార్ ఇండియా రూ.15 వేల కోట్లు వెచ్చించగా.. రానున్న ఐదేండ్లకు ఆ ధర రూ.50-60 వేల కోట్ల మధ్య ఉండనుందనే అంచనాలు ఉన్నాయి. అమెరికా, యూరోప్‌లో పలు లీగ్‌లకు ప్రసారదారు హక్కులు పొందిన అమెజాన్ రేసులో నిలువటంతో పోటీ రసవత్తరంగా ఉండనుందనే అనుకున్నారు. గూగుల్ సైతం ఇన్విటేషన్ టు టెండరు పత్రాలు తీసుకోవటంతో అందరి దృష్టి ఐపీఎల్ మీడియా హక్కులపైనే పడింది. తాజాగా ఐపీఎల్ మీడియా హక్కుల సాంకేతిక బిడ్ల దాఖలుకు ఈ రెండు సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో పోటీలో నిలిచిన ఇతర సంస్థలపై కాస్త ఒత్తిడి తగ్గినట్టుగా భావించవచ్చు!.
రేసులో ఉన్నదెవరు? : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులు ప్రస్తుతం స్టార్ ఇండియా సొంతం. ఆ ఒప్పందం ఐపీఎల్15 సీజన్‌తో ముగిసింది. రానున్న కాలానికి సైతం ఐపీఎల్ ప్రసార ఒరవడిపై బీసీసీఐకి స్టార్ ఇండియా రోడ్‌మ్యాప్ అందించింది. ఐపీఎల్ మీడియా హక్కులతో మార్కెట్‌ను విప్లవాత్మకంగా పెంచుకున్న స్టార్ ఇండియా.. ఐపీఎల్‌ను వదులుకునే ఆలోచనలో లేదు. టెలివిజన్, డిజిటల్ హక్కులకు కలిపి సుమారు రూ.50 వేల కోట్ల వరకు స్టార్ ఇండియానే వెచ్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మీడియా హక్కుల రేసులో నిలిచిన వారిలో డిస్నీ స్టార్ సైతం ఉంది. రిలయన్స్ వాయకామ్18, సోనీ నెట్వర్క్, టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఏసియాలు టెక్నికల్ టెండర్లు సమర్పించాయి. తొలి పదేండ్లకు ఐపీఎల్ ప్రసారదారుగా ఉన్న సోనీ నెట్వర్క్ ఆ తర్వాత హక్కులను కాస్త తేలిగ్గా తీసుకుంది. డిస్నీ స్టార్ ఐపీఎల్ మార్కెట్‌ను గొప్పగా చేసుకుంది. దీంతో సోనీ నెట్వర్క్ మరోసారి ఐపీఎల్ కోసం పోటీపడుతోంది. రిలయన్స్వయకామ్18 సైతం గట్టిగానే రేసులో నిలువనుంది. ఇప్పటికే భారత మార్కెట్లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన అమెజాన్.. ఇప్పుడు ఐపీఎల్లో మరో 5-7 బిలియన్ అమెరికన్ డాలర్లు వెచ్చించేందుకు సిద్ధంగా లేదని సమాచారం. అమెజాన్ అంతర్గత సమావేశంలో దీనిపై చర్చ జరుగగా.. ఐపీఎల్ వేలానికి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వేలం ఎప్పుడు?! : ఐపీఎల్ మీడియా హక్కుల వేలం తొలిసారి ఈ వేలంలో నిర్వహించనున్నారు. టెక్నికల్ బిడ్లను బీసీసీఐ లీగల్, టెక్నికల్ విభాగం క్షుణ్ణంగా పర్యవేక్షించనుంది. శుక్రవారం సాయంత్రానికే ఈ ప్రక్రియ ముగియనుంది. టెక్నికల్ బిడ్ల పరిశీలన అనంతరం ఆదివారం ఈ వేలం నిర్వహించనున్నారు. ముంబయిలో ఈ వేలం జరుగనుంది. మీడియా హక్కుల బిడ్డింగ్‌ను రేసులో నిలిచిన సంస్థలు తమ కార్యాలయాల నుంచే చేయనున్నాయి.
వేలంలో ఏమున్నాయి? : గతంలో మాదిరిగా కాకుండా మీడియా హక్కుల వేలం ఈ సారి విభాగాల వారీగా జరుగనుంది. పెరిగిన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అధికారులు మీడియా హక్కుల విభాగాలను నాలుగుగా తేల్చారు. గ్రూప్-ఏలో భారత ఉపఖండంలో టెలివిజన్ హక్కులు ఉన్నాయి. గ్రూప్-బిలో భారత ఉపఖండంలో డిజిటల్ మీడియా హక్కులు ఉంచారు. గ్రూప్-సిలో కొన్ని ప్రత్యేక మ్యాచులు, ప్లే ఆఫ్స్ మ్యాచులు ఉన్నాయి. ఇవి కూడా భారత ఉపఖండానికే పరిమితం. గ్రూప్-డిలో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌లో టెలివిజన్, డిజిటల్ మీడియా హక్కులు ఉన్నాయి.
ప్రతి విభాగానికి ప్రత్యేక కనీస ధర పొందుపరిచారు. విభాగాల వారిగా సంస్థలు బిడ్డింగ్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలో 74 మ్యాచులకు కనీస ధరతో గణించిన ధరతో బిడ్ చేయాలి. అన్ని విభాగాలకు కలిపి ఒకే సంస్థకు లేదా ఒక్కో విభాగానికి ఒక్కో సంస్థకు హక్కులు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది.