Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ట్రయల్స్‌లో ఎదురులేని విజయం
న్యూఢిల్లీ : మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్, భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైంది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు భారత బాక్సింగ్ జట్టును ఎంపిక చేసేందుకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రెండు రోజుల పాటు జాతీయ ట్రయల్స్ నిర్వహించారు. రెండు వారాల ముంగిట, ఇస్తాంబుల్‌లో ఇరగదీసే పంచ్‌లతో పసిడి సాధించిన నిఖత్ జరీన్ మహిళల 50 కేజీల విభాగంలో కామన్వెల్త్ బెర్త్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ట్రయల్స్ ఫైనల్లో హర్యానా బాక్సర్ మీనాక్షిపై నిఖత్ జరీన్ ఏకపక్ష విజయం సాధించింది. 7-0తో మూడు రౌండ్లలో తిరుగులేని ఆధిపత్యం చూపించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ సైతం కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. మహిళల 70 కేజీల విభాగంలో రైల్వేస్ బాక్సర్ పూజపై పైచేయి సాధించిన లవ్లీనా భారత జట్టులో చోటు సాధించింది. నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) సైతం కామన్వెల్త్ క్రీడలకు భారత జట్టులో చోటు సాధించారు. ఇదిలాఉండగా, ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు భారత బాక్సింగ్ జట్టులో చోటు సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర క్రీడా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, కోచ్‌లు, క్రీడాకారులు అభినందలు తెలిపారు.