Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్టి ఫార్మాట్లో ఎవరికీ దక్కని రికార్డుపై కన్నేసి తొలి టీ20లో బరిలో నిలిచిన భారత్‌కు దక్షిణాఫ్రికా గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్‌లో అధిక భాగం టీమ్ ఇండియా పట్టు బిగించినా.. చివరి పది ఓవర్లలో సఫారీలు మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. రికార్డు పోయినా.. సిరీస్ దక్కించుకునేందుకు టీమ్ ఇండియా చూస్తోంది. సఫారీ ఆధిక్యం దిశగా వెళ్లకముందే.. సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. ఓటమి నుంచి పుంజుకుని నేడు పంత్‌సేన పంజా విసిరేనా?!. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 పోరు నేడు.
- భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 నేడు
- రాత్రి 7 గంటలకు స్టార్‌స్పోర్ట్స్‌లో...
- సమంపై పంత్, ఆధిక్యంపై బవుమా గురి
నవతెలంగాణ-కటక్
టీ20 ఫార్మాట్లో సపారీలపై మెరుగైన రికార్డు లేని టీమ్ ఇండియా.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆ జట్టుపై అత్యధిక స్కోరు (211) నమోదు చేసింది. బదులుగా, దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరును విజయవంతంగా ఛేదించిన రికార్డును సొంతం చేసుకుంది. ఆతిథ్య భారత్ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఐపీఎల్లో తమ జట్లకు కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున ఆడుతున్నారు. సిరీస్ ఆరంభంలో దక్షిణాఫ్రికా మెరుపు విజయంతో బోణీ కొట్టినా.. కటక్‌లో గట్టిగా పుంజుకునేందుకు రిషబ్‌పంత్ సేన ఎదురుచూస్తోంది. దక్షిణాఫ్రికా 2-0 ఆధక్యంపై కన్నేయగా.. భారత్ 1-1తో సమం చేయాలని చూస్తోంది.
బౌలింగ్ ఆందోళనకరం! : తొలి టీ20లో భారత బ్యాటర్లు అంచనాల మేరకు రాణించారు. కానీ బౌలింగ్ విభాగం ప్రణాళికలు అమలు చేయలేదు. చివరి 10.1 ఓవర్లలో ఏకంగా 131 పరుగులు సమర్పించుకున్నారు. ఏ జట్టుకైనా ఇది మరీ పేలవ ప్రదర్శన. మ్యాచ్ తొలి అర్థభాగంలో హర్షల్ పటేల్ గొప్ప నియంత్రణతో కనిపించాడు. పేస్ లేకుండా, స్లో బాల్స్‌తో బ్యాటర్లను తికమక పెట్టాడు. కానీ డెత్ ఓవర్లలో అతడూ పరుగుల వరద బాధితుడయ్యాడు. నేటి మ్యాచ్‌లో హర్షల్ పటేల్ మరింత కీలకం కానున్నాడు. వైవిధ్యంతో కూడిన బంతులతో సఫారీలకు సవాల్ విసరాల్సి ఉంది. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్ల నుంచి జట్టు మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లకు మరికొంత సమయం ఎదురుచూడాల్సి రావచ్చు. ఇక స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, యుజ్వెంద్ర చాహల్‌లు చేతులెత్తేశారు. డెవిడ్ మిల్లర్ దాడిలో కొట్టుకుపోయారు. సవాళ్లను స్వీకరించే చాహల్ నేడు కటక్‌లో మిల్లర్‌కు విరుగుడుతో వస్తాడేమో చూడాలి. అక్షర్ పటేల్ స్థానంలో రవి బిష్ణోరుని తీసుకొచ్చే ఆలోచనను కొట్టిపారేయలేం. బ్యాటింగ్ లైనప్‌లో అందరూ ఫామ్‌లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ వేగంగా పరుగులు చేయాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. నేడు అతడు బ్యాటింగ్‌పై ఫోకస్ ఉండనుంది.
బవుమాపైనే ఫోకస్ : జట్టుగా రాణించినా.. నాయకుడు తేలిపోతున్నాడు!. తెంబ బవుమా టీ20 రికార్డులు ఏమంత బాగాలేవు. 22 మ్యాచుల్లో అతడి స్ట్రయిక్‌రేట్ 123.13. కెప్టెన్‌గా ఆడిన 14 మ్యాచుల్లో స్ట్రయిక్‌రేట్ 114.91కు దిగజారింది. టాప్ ఆర్డర్లో క్వింటన్ డికాక్‌తో కలిసి ఆడే బవుమా.. యాంకర్ పాత్రకు పరిమితం. కానీ వరల్డ్‌కప్ ముంగిట దక్షిణాఫ్రికా ఎటాకింగ్ స్టయిల్‌కు అలవాటు పడాల్సిన తరుణంలో తెంబ బవుమా పాత్ర ప్రశ్నార్థకం అవుతుంది. కోవిడ్-19 పాజిటివ్‌తో మార్కరం దూరమైనా.. సఫారీలకు వచ్చిన నష్టమేమీ లేదు. బ్యాటింగ్ లైనప్ మంచి జోష్ మీదుంది. బౌలింగ్ విభాగంలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం : బారబతి స్టేడియంలో ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ టీ20లు జరిగాయి. అందులో ఓ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 92 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో శ్రీలంక 87 పరుగులకే చేతులెత్తేసింది. నేటి మ్యాచ్‌కు పిచ్ పచ్చికతో కళకళలాడుతోంది!. పేసర్లకు స్వింగ్ లభించనుంది. ఇరు జట్లు గత మ్యాచుల గణాంకాలను గమనంలో ఉంచుకుని బరిలోకి దిగనున్నాయి. ఉష్ణోగ్రతలు ఢిల్లీతో పోల్చితే కాస్త ఉపశమన స్థాయిలో ఉండనున్నాయి. టీ20 మ్యాచ్‌కు ఎటువంటి వర్ష సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపవచ్చు!.
తుది జట్లు (అంచనా) :
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వెంద్ర చాహల్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), తెంబ బవుమా (కెప్టెన్), రస్సీ వాన్‌డర్ డుసెన్, డెవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వేన్ ప్రిటోరియస్, వేనీ పార్నెల్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, ఎన్రిచ్ నోకియా, కేశవ్ మహరాజ్.