Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఐపీఎల్ మీడియా హక్కుల ఈ వేలం
- రేసులో డిస్నీస్టార్, రిలయన్స్, జీ ఎంటర్టైన్మెంట్
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల వేలానికి రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేలం పాట సమయం వచ్చేసింది. 2023-27 ఐపీఎల్ సీజన్లకు నేడు బీసీసీఐ ఈ వేలం నిర్వహించనుంది. అమెరికా రిటైల్, టెక్ దిగ్గజాలు అమెజాన్, అల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ)లు రేసు నుంచి నిష్క్రమించగా.. ఐపీఎల్ మీడియా హక్కుల బరిలో రిలయన్స్ ముందంజలో కనిపిస్తోంది!. సాంకేతిక బిడ్ల దాఖలు గడువు జూన్ 10తో ముగియగా.. నేడు ఉదయం 11 గంటల నుంచి ముంబయిలో ఈ వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే సంస్థలు తమ కార్యాలయాల నుంచే ఈ బిడ్లను దాఖలు చేయనున్నాయి. బీసీసీఐ మీడియా హక్కుల కనీస ధర సుమారు రూ.36 వేల కోట్లుగా ఉండగా.. తాజా వేలంలో రూ.50 వేల కోట్ల ఆదాయం ఆర్జించేందుకు బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అమెజాన్, గూగుల్ బరిలో నిలిచిఉంటే ఆదాయం రూ.60 వేల కోట్ల మార్క్ దాటేదని బోర్డు వర్గాలు అంచనా వేశాయి.
ఐపీఎల్ మీడియా హక్కుల ప్రస్తుత హక్కుదారు డిస్నీ స్టార్ సహా రిలయన్స్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ వయకామ్18 సహా టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ ఏసియాలు మీడియా హక్కుల రేసులో నిలిచాయి. మీడియా హక్కులను నాలుగు విభాగాలు చేసి అందులో నాన్ ఎక్స్క్లూజివ్ విభాగం చేర్చటంతోనే అమెజాన్, గూగుల్ సంస్థలు రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రాథమిక సమాచారం. తొలి విభాగంలో భారత ఉపఖండంలో టెలివిజన్ హక్కులు ఉండగా, రెండో విభాగంలో భారత ఉపఖండంలో డిజిటల్ మీడియా హక్కులు ఉన్నాయి. గ్రూప్-ఏ మ్యాచులకు కనీస ధర రూ. 49 కోట్లుగా నిర్ణయించారు. ఈ విభాగంలో డిస్నీ స్టార్ సహా రిలయన్స్, జీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్లు పోటీపడనున్నాయి. గ్రూప్-బి (డిజిటల్)లో మ్యాచ్కు కనీస ధర రూ.33 కోట్లుగా తేల్చారు. ప్రస్తుత హక్కుదారు హాట్స్టార్ ఐపీఎల్ డిజిటల్ హక్కులపై ఆసక్తిగా లేదనే వార్తలు వస్తున్నాయి. నాన్ ఎక్స్క్లూజివ్ డిజిటల్ విభాగం (గ్రూప్-సి)లో కనీస ధర రూ.16 కోట్లు. ఇది కాకుండా, రెస్ట్ ఆఫ్ డి వరల్డ్ విభాగంలో మ్యాచ్ కనీస ధర రూ.3 కోట్లు. టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ ఏసియాలు నాల్గో విభాగం హక్కుల కోసం పోటీపడనున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఐపీఎల్ సీజన్లో 74 మ్యాచులకు రూ.32,890 కోట్లు కనీస ధరగా నిర్ణయించారు. గత ఐదేండ్ల కాలానికి డిస్నీస్టార్ సంస్థ రూ.16347.5 కోట్లు చెల్లించింది. కనీస ధర విలువతోనే బీసీసీఐ రెట్టింపు ఆదాయం ఆర్జించనుంది. అమెజాన్, గూగుల్ తప్పుకున్నా.. నేడు వేలంలో కనీసం రూ.50 వేల కోట్ల ఆదాయం బీసీసీఐ సొంతం చేసుకోనుంది.