Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న ఐపీఎల్ ఈ వేలం
- ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం
నవతెలంగాణ-ముంబయి
ఉత్కంఠ వీడలేదు. వేలం పాట కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల వేలం తొలి రోజు ఉత్కంఠ రేపింది. తొలి రోజు ఈ వేలంలో ఎవరు ఎంతకు పాడారనే వివరాలను బీసీసీఐ పంచుకోలేదు. అయితే, తొలి రోజు వేలం ముగిసే సమయానికి ఐదేండ్ల కాలానికి ధర రూ.40 వేల కోట్ల దాటి ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి!. ఐపీఎల్ మీడియా హక్కుల ఈ వేలం ప్రక్రియకు బీసీసీఐ నిర్దిష్ట కాల పరిమితి విధించలేదు. ఇది నేడు ముగియవచ్చు లేదంటే సోమవారం సైతం కొనసాగవచ్చు!. అత్యధిక బిడ్ దాఖలు అయ్యేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. విభాగం-1, 2లలో డిస్నీస్టార్, సోనీ, రిలయన్స్, జీ ఎంటర్టైన్మైంట్స్ సంస్థలు పోటీలో ఉన్నాయి. విభాగం-3, 4లలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ ఏసియాలు రేసులో ఉన్నాయి. ఐదేండ్ల క్రితం డిస్నీస్టార్కు ప్రసార హక్కులు కోల్పోయిన సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సారి రేసులో గట్టి పోటీదారుగా ఉంది. ఐదేండ్ల క్రితం 158 శాతం అధిక ధరతో ఐపీఎల్ మీడియా హక్కులు డిస్నీస్టార్ సొంతం చేసిన ఆ సంస్థ మాజీ సీఈవో ఉదరు శంకర్.. ప్రస్తుతం రిలయన్స్ వయాకామ్18 తరఫున బరిలో నిలువటంతో అందరి చూపులు రిలయన్స్ వైపే ఉన్నాయి. డిస్నీస్టార్, సోనీలను వెనక్కి నెట్టి రిలయన్స్ వయాకామ్18 ఐపీఎల్ మీడియా హక్కులను ఎగరేసుకుపోయినా.. ఎటువంటి ఆశ్చర్యం లేదు!.
పోటాపోటీగా..! : ఐపీఎల్ మీడియా హక్కుల కోసం మూడు సంస్థలు గట్టిగా పోటీపడుతున్నాయి. విభాగం-1 (భారత్‌లో టెలివిజన్ ప్రసార హక్కులు), విభాగం-2 (భారత్‌లో డిజిటల్ ప్రసార హక్కులు)లకు ప్రస్తుత హక్కుదారు డిస్నీస్టార్ సహా రిలయన్స్, సోనీలు రేసులో ఉన్నాయి. తొలి రోజు ఈ రెండు విభాగాల్లో హక్కుల కోసం మూడు సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ.40 వేల కోట్ల మార్క్ దాటేసిందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. నేడు కొనసాగుతున్న ఈ వేలంలో ఈ విలువ మరింత పెరుగనుంది. విభాగం-1లో ప్రతి మ్యాచ్‌కు కనీస ధర రూ.49 కోట్లు. ఈ విభాగంలో బిడ్ దాఖలు చేసేందుకు అదనంగా కనీసం రూ.50 లక్షలు జత చేయాల్సి ఉంటుంది. వేలం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో బీసీసీఐ ఈ విలువను పెంచేందుకు అవకాశం ఉంది. విభాగం-2లో మ్యాచ్ కనీస ధర రూ.33 కోట్లు కాగా.. ప్రతి బిడ్ దాఖలుకు రూ.30 లక్షలు అదనంగా పెంచాల్సి ఉంటుంది. ఈ వేలం సమయంలో ఎవరు ఎంత బిడ్ దాఖలు చేశారనే వివరాలు ఎవరికీ తెలియవు. అత్యధిక బిడ్ అనంతరం బీసీసీఐ అన్ని వివరాలు వెల్లడించనుంది. అత్యధిక మొత్తం సాధించటం, పారదర్శకత పాటించటం కోసమే బోర్డు ఈ వేలం ప్రక్రియను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
రికార్డుకు చేరువలో..! : ప్రసార హక్కుల రూపంలో అత్యధిక ఆదాయం ఆర్జించనున్న ప్రపంచ క్రీడా లీగ్‌లో జాబితాలో ఐపీఎల్ టాప్-2 పొజిషన్‌కు చేరుకోనుంది. ఐపీఎల్ 2023-27 సీజన్ మ్యాచులకు బీసీసీఐ కనీస ధర రూ.101 కోట్లుగా నిర్దారించింది. నాలుగు విభాగాల్లో కలిపి బీసీసీఐ ప్రతి మ్యాచ్‌కు ఈ మేరకు పొందనుంది. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో ప్రతి మ్యాచ్‌కు 17 మిలియన్ అమెరికన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్లో ప్రస్తుతం కనీస ధర 12 మిలియన్ అమెరికన్ డాలర్లు. వేలం ప్రక్రియ ముగిసిన అనంతరం ఇది గణనీయంగా పెరుగనుంది. దీంతో ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్‌గా ఐపీఎల్ అవతరించనుంది.