Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో టీ20లో దక్షిణాఫ్రికా గెలుపు
- భువనేశ్వర్ మెరిసినా.. తప్పని నిరాశ
నవతెలంగాణ-కటక్ : హెన్రిచ్ క్లాసెన్ (81, 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ప్రత్యేక ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా స్పెషల్ విజయం ఖాతాలో వేసుకుంది. కటక్‌లోనూ ఆతిథ్య భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో రెండో టీ20లో గెలుపొందింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0తో మంచి ఆధిక్యం సొంతం చేసుకుంది. 149 పరుగుల ఊరించే లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఓ దశలో 29/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ (4/13) విజృంభించటంతో సఫారీ టాప్ ఆర్డర్ కకావికలమైంది. ఈ సమయంలో క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల వేట కష్టమైన పిచ్‌పై సులువుగా వేట సాగించాడు. 18.2 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా గెలుపు తీరాలకు చేరేలా చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు సాధించింది. శ్రేయస్ అయ్యర్ (40, 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (30 నాటౌట్, 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
క్లాసెన్ ధనాధన్ షో : కటక్ పిచ్‌పై పరుగులు రావటం లేదు. పేస్, స్వింగ్‌కు బ్యాటర్లు ఇరకాటంలో పడుతున్నారు. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ పవర్‌ప్లేలో కండ్లుచెదిరే ప్రదర్శన చేశాడు. మూడు ఓవర్లలో మూడు వికెట్లు కూల్చి.. దక్షిణాఫ్రికాతో పీకల్లోతు ఒత్తిడిలోకి నెట్టాడు. రీజా హెండ్రిక్స్ (4), డ్వేన్ ప్రిటోరియస్ (4), డుసెన్ (1)లు భువనేశ్వర్ బంతులకు వికెట్ కోల్పోయారు. లక్ష్యం చిన్నదైనా.. పరిస్థితులు కఠినం కావటంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. ఈ సమయంలో హెన్రిచ్ క్లాసెన్ (81) వీరోచిత ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ తెంబ బవుమా (35, 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచిత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నాల్గో వికెట్‌కు బవుమాతో కలిసి క్లాసెన్ విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. ఈ జోడీ క్రీజులో నిలువటంతో మ్యాచ్ సఫారీ చేతుల్లోకి వెళ్లింది. మరోసారి ద్వితీయార్థంలో బౌలర్లను వినియోగించటంలో పంత్ వైఫల్యం..సఫారీలకు కలిసొచ్చింది. చివర్లో డెవిడ్ మిల్లర్ (20 నాటౌట్, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) అదిరే ముగింపు ఇచ్చాడు. పది బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
బ్యాటర్ల వైఫల్యం : మరోసారి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ నిరాశపరిచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ (34, 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (40, 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆశించిన వేగంగా పరుగులు సాధించలేదు. ఈ ఇద్దరు మంచి పునాది వేసినా.. సఫారీ బౌలర్లు అప్పటికే మానసికంగా పైచేయి సాధించారు. కెప్టెన్ రిషబ్ పంత్ (5), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (9) నిష్క్రమణతో భారత్ ఒత్తిడిలో పడింది. చివర్లో దినేశ్ కార్తీక్ (30) మెరుపులతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో నోకియా (2/36) రాణించాడు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : 148/6 (శ్రేయస్ అయ్యర్ 40, ఇషాన్ కిషన్ 34, దినేశ్ కార్తీక్ 30, ఎన్రిచ్ నోకియా 2/36)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : 149/6 (హెన్రిచ్ క్లాసెన్ 81, తెంబ బవుమా 35, డెవిడ్ మిల్లర్ 20, భువనేశ్వర్ 4/13)