Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీడ్‌స్టర్ అరంగేట్రంపై వెంగ్‌సర్కార్
ముంబయి : భారత యువ ఫాస్ట్ బౌలర్, నిలకడగా గంటకు 150 కిమిలకు పైగా వేగంతో బంతులు సంధిస్తున్న జమ్మూ కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడని భారత మాజీ క్రికెటర్ వెంగ్‌సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2022లో నిలకడగా రాణించి బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు సాధించాడు. ఉమ్రాన్ మాలిక్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని, అంతర్జాతీయ అరంగేట్రానికి కాస్త ఎదురు చూడాలని భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యల నేపథ్యంలో వెంగ్‌సర్కార్ మాటలు ఆసక్తి సంతరించుకున్నాయి. 'ఆటపై ఒక్కొక్కరికి ఒక్కో విధమైన దృక్కోణం ఉంటుంది. ఐపీఎల్లో నిలకడగా రాణించినందుకు భారత జట్టులో ఆడేందుకు ఉమ్రాన్ మాలిక్ అర్హుడని నా అభిప్రాయం. సిరీస్ స్వదేశంలో జరుగుతుంది. అరంగేట్రానికి ఇది మరింత శుభ సమయం. మాలిక్ ఫిట్‌గా ఉన్నాడు. గత పదేండ్లలో నేను చూసిన అత్యంత ఆసక్తికరమైన పేసర్ మాలిక్. అతడి బౌలింగ్‌లో పేస్, కచ్చితత్వం ఉన్నాయి. భారత్‌కు సుదీర్ఘ కాలం ఆడగలడని నా నమ్మకం' అని దిలిప్ వెంగ్‌సర్కార్ అన్నాడు.