Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీరంలో అమీతుమీకి టీమ్ ఇండియా సిద్ధమైంది. సొంతగడ్డపై సిరీస్‌పై ఆశలు ఆవిరి చేసుకునే ప్రమాదంలో పడిన పంత్‌సేన.. నేడు వైజాగ్‌లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో నిలిచింది. కటక్‌లో ఖతర్నాక్ షోతో 2-0తో సిరీస్‌కు చేరువైన సఫారీలకు విశాఖలో చెక్ పెట్టేందుకు పంత్‌సేన సన్నద్ధమవుతోంది. భారత్, దక్షిణాఫ్రికాతో మూడో టీ20 పోరు నేడు.
- గెలిస్తేనే.. సిరీస్‌లో భారత్ నిలిచేది
- సిరీస్ విజయంపై సఫారీల గురి
- విశాఖలో నేడు మూడో టీ20 పోరు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-విశాఖపట్నం
పొట్టి పోరులో రెండు మ్యాచులు ముగిశాయి. ఆతిథ్య భారత్ సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడగా.. పర్యాటక దక్షిణాఫ్రికా సిరీస్ సొంతం చేసుకునేందుకు చేరువైంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా రేసులో నిలిచేందుకు, మిగతా మ్యాచులపై అభిమానులకు ఆసక్తి పెంచేందుకు నేడు విశాఖపట్నంలో రిషబ్ పంత్ విజయం అనివార్యం. సిరీస్ గమనాన్ని నిర్దేశించే మూడో టీ20 ఇరు జట్లకు కీలకమే. చివరి 14 టీ20ల్లో ఏకంగా 13 విజయాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికాను నిలువరించటం నేడు టీమ్ ఇండియా సవాల్‌గా మారనుంది.
మార్పులు అవసరం : తొలి రెండు టీ20ల్లో పరాజయం పాలైన భారత్.. కీలక మూడో మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో శ్రేయస్ అయ్యర్ అవసరమైన స్థాయిలో దూకుడు ప్రదర్శించటం లేదు. స్పిన్నర్లపై అతడి స్ట్రయిక్‌రేట్ 220 కాగా.. అదే పేసర్లపై 76.19కు పడిపోయింది. అయ్యర్ స్థానంలో మిడిల్ ఆర్డర్లో దీపక్ హుడాను చేర్చే అవకాశం ఉంది. దీపక్ హుడా ఆఫ్ స్పిన్‌తో సఫారీ ఎడం చేతి వాటం బ్యాటర్లకు సైతం చెక్ పెట్టవచ్చు!. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జూలు విదిల్చాల్సిన అవసరం ఉంది. వేగంగా పరుగులు సాధిస్తున్నప్పటికీ వికెట్ కాపాడుకోవటం లేదు. కెప్టెన్ రిషబ్ పంత్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, నయా ఫినిషర్ దినేశ్ కార్తీక్ నుంచి అభిమానులు ధనాధన్ షో ఆశిస్తున్నారు. ఇక బౌలింగ్ లైనప్‌లో భువనేశ్వర్ కుమార్ మినహా మరోకరు ప్రభావశీలంగా కనిపించటం లేదు. అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లలో ఒకరు అరంగేట్రం చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పవచ్చు. అవేశ్ ఖాన్ స్థానంలో ఒకరికి అవకాశం కల్పించే చాన్స్ ఉంది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజ్వెంద్ర చాహల్‌లు మాయ చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇక్కడ పట్టేయాలని..! : వైజాగ్ పిచ్ నెమ్మదిగా స్పందిస్తుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదైన రికార్డు లేదు. అయితే, టాస్ మరోసారి కీలక పాత్ర పోషించనుంది. తొలి రెండు మ్యాచుల్లో సఫారీలకు టాస్ కలిసొచ్చింది. వైజాగ్‌లోనూ టాస్ నెగ్గితే..ఆ జట్టు సిరీస్ పట్టినట్టే భావించాలి. ఛేదనలో గొప్ప విజయాలు సాధిస్తున్న దక్షిణాఫ్రికా.. లక్ష్యాలను కాపాడుకోవటంలోనూ సమర్థమైన జట్టు. తాజా సిరీస్‌లో సఫారీలు తొలుత బ్యాటింగ్ చేయలేదు. ఆ పరిస్థితి వస్తే.. భారత బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. క్వింటన్ డికాక్ గాయంతో, ఎడెన్ మార్కరం కోవిడ్‌తో వైజాగ్ బరిలో లేరు. ఇది భారత్‌కు కాస్త ఊరటే. కానీ దక్షిణాఫ్రికా కొంత కాలంగా ఒకరిద్దరి ప్రదర్శనలపై ఆధారపడటం లేదు. ఆ జట్టు విజయాల్లో ప్రతిసారి ఓ భిన్నమైన ఆటగాడు బాధ్యత తీసుకుంటున్నాడు. అదే జట్టును భారత్‌పై పైచేయి సాధించేలా చేస్తోంది. డెవిడ్ మిల్లర్, క్లాసెన్, బవుమా, హెండ్రిక్స్ సహా రబాడ, ప్రిటోరియస్‌లు సఫారీలకు కీలకం కానున్నారు. హెన్రిచ్ క్లాసెన్ భారత స్టార్ స్పిన్నర్ చాహల్‌పై మెరుపు గణాంకాలు నమోదు చేశాడు. చాహల్ బౌలింగ్‌లో 2018లో ఓ టీ20లో 12 బంతుల్లో 41 పరుగులు.. తాజాగా కటక్‌లో 13 బంతుల్లో 30 పరుగులు పిండుకున్నాడు. నేడు చాహల్‌ను భారత్ ఎలా ప్రయోగిస్తోందో చూడాలి.
పిచ్, వాతావరణం : వైజాగ్‌లో జరిగిన రెండు టీ20ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టునేవిజయం వరించింది. ఇక్కడ స్పిన్నర్లు, సీమర్ల వికెట్ల వేటలో విజయవంతం అయ్యారు. పరుగుల వేట కష్టంగా ఉండే పిచ్‌పై టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోనుంది. తీరంలో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌కు చిరుజల్లుల ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా/శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వెంద్ర చాహల్.
దక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, తెంబ బవుమా (కెప్టెన్), డుసెన్, డెవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డ్వేన్ ప్రిటోరియస్, వేనీ పార్నెల్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, నోకియా, షంషి.
భారత్‌పై దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. నేడు విశాఖ టీ20లో సఫారీలు విజయం సాధిస్తే.. భారత్‌లో ఆ జట్టు అజేయ ప్రస్థానం 12 ఏండ్లకు చేరనుంది. 2010 నుంచి భారత్‌లో దక్షిణాఫ్రికా వైట్‌బాల్ సిరీస్ ఓటమి చెందలేదు. అప్పట్నుంచి ఓ వన్డే, ఓ టీ20 సిరీస్ నెగ్గగా.. మరో టీ20 సిరీస్‌ను డ్రా చేసుకుంది.