Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ లీగ్ మరింత ధనికమైంది. ప్రతి మ్యాచ్‌కు వంద కోట్లకు పైగా రికార్డు ధరతో ప్రపంచంలోనే రెండో ధనిక స్పోర్ట్స్లీగ్గా నిలిచింది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో బీసీసీఐకి కాసుల పంట పండింది. రానున్న ఐదేండ్ల గాకు ఏకంగా రూ.48,390 కోట్లకు ఐపీఎల్ మీడియా హక్కులు అమ్ముడయ్యాయి. డిస్నీస్టార్ టెలివిజన్ ప్రసార హక్కులను నిలుపుకోగా.. డిజిటల్ ప్రసారాలు రిలయన్స్ వయాకామ్ 18 సంస్థ సొంతం చేసుకుంది. టైమ్స్ ఇంటర్నెట్ సంస్థకు మిడిల్ఈస్ట్, యుఎస్ఏ రీజియన్ల టెలివిజన్, డిజిటల్ హక్కులు లభించాయి.
- ఐపీఎల్ మీడియా హక్కులకు రికార్డు ధర
- రూ.23575 కోట్లకు టెలివిజన్ ప్రసార హక్కులు
- రూ.20,500 కోట్లకు డిజిటల్ ప్రసార హక్కులు
- హక్కులు డిస్నీస్టార్, రిలయన్స్, టైమ్స్ ఇంటర్నెట్ సొంతం
నవతెలంగాణ-ముంబయి
రూ.48,390 కోట్లు. ప్రపంచంలో పరిమిత దేశాల్లోనే ఆడే క్రికెట్ గేమ్‌లో, ఓ టీ20 లీగ్‌కు ఓ ఐదేండ్ల కాలానికి మీడియా హక్కుల రూపంలో వచ్చిన మొత్తం ఇది. 15 ఏండ్ల స్పోర్ట్స్ లీగ్‌కు ఈ స్థాయి ధరను ఎవరైనా ఊహించారా?!. శతకోటి జనాభా కలిగిన భారత్‌లో రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ వీక్షకుల సంఖ్యతో ఇది సాధ్యపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే రెండో ధనిక స్పోర్ట్స్ లీగ్‌గా అవతరించింది. ముంబయిలో మూడు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మీడియా హక్కుల ఈ వేలం మంగళవారంతో ముగిసింది. ఇన్నాండ్లూ డిస్నీస్టార్ ఏకఛత్రాధిపత్యం నడిచిన ప్రసార హక్కుల సెక్టార్లో కొత్త భాగస్వాములు వచ్చారు. భారత్‌లో టెలివిజన్ ప్రసార హక్కులను నిలుపుకున్న డిస్నీస్టార్.. డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ వయాకామ్18కు కోల్పోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. బ్రిటన్, దక్షిణాఫ్రికా రీజినన్లలో మీడియా హక్కులను సైతం రిలయన్స్ వయాకామ్18 సొంతం చేసుకుంది. అమెరికా, మధ్యప్రాచ్య దేశాల్లో మీడియా హక్కులను టైమ్స్ ఇంటర్నెట్ సొంతం చేసుకుంది.
డిస్నీస్టార్కే టెలివిజన్ : గత ఐదేండ్ల పాటు ఐపీఎల్ మీడియా హక్కులపై గుత్తాధిపత్యం చెలాయించిన డిస్నీస్టార్ సంస్థ.. రానున్న ఐదేండ్లకు పట్టు విడిచింది. టెలివిజన్ ప్రసార హక్కులను నిలుపుకున్న డిస్నీస్టార్.. డిజిటల్ ప్రసార హక్కులను వదిలేసుకుంది. టెలివిజన్ ప్రసార హక్కుల కనీస ధర రూ.49 కోట్లు. డిస్నీస్టార్ రూ.57.5 కోట్లకు ప్యాకేజీ-ఏ విజేతగా నిలిచింది. 2023 సీజన్లో 74 మ్యాచులు ఆడనుండగా.. ఆ తర్వాత వరుసగా నాలుగు సీజన్ల పాటు 84 మ్యాచులు ఉండనున్నాయి. దీంతో ఐదేండ్ల కాలంలో 410 మ్యాచులకు గాను డిస్నీ స్టార్ రూ.23,575 కోట్లను బీసీసీఐకి చెల్లించనుంది. టెలివిజన్ ప్రసార హక్కుల కోసం సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్, జీ ఎంటర్టైన్మైంట్స్ సహా రిలయన్స్ వయాకామ్18 గట్టి ప్రయత్నం చేశాయి. అయితే, డిస్నీస్టార్తో చివరి వరకు పోటీపడింది ఎవరనే వివరాలు తెలియలేదు.
డిజిటల్ జోరు : ఐపీఎల్ మీడియా హక్కుల ధర ఆకాశానికి చేరటంలో కీలక పాత్ర డిజిటల్ ప్రసార హక్కులు. భారత్‌లో డిజిటల్ ప్రసారాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సినిమాలు సైతం ఓటీటీ బాటలో నడుస్తున్న కాలంలో.. ఐపీఎల్ డిజిటల్ ప్రసారాలకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ వయాకామ్18 సంస్థ డిజిటల్ హక్కుల కోసం పట్టువిడువని బిడ్డింగ్ చేసింది. ఈ విభాగంలో ప్రతి మ్యాచ్‌కు కనీస ధర రూ.33 కోట్లు. ఈ వేలంలో డిజిటల్ హక్కుల ధర దూసుకుపోయింది. కనీస ధరతో పోల్చితే 51.5 శాతం అధిక ధరకు అమ్ముడుపోయింది. మ్యాచ్‌కు రూ.50 కోట్లకు రిలయన్స్‌కు చెందిన వయాకామ్ సంస్థ సొంతం చేసుకుంది. ఐదేండ్ల కాలానికి రూ.20,500 కోట్లకు డిజిటల్ హక్కులను రిలయన్స్ వయాకామ్ సొంతం చేసుకుంది. టెలివిజన్ ప్రసార హక్కులతో పోల్చితే డిజిటల్ ప్రసార హక్కులు సైతం దాదాపుగా సమాన ధరకు అమ్ముడుపోయావని చెప్పవచ్చు!.
ఐపీఎల్ మీడియా హక్కుల ఈ వేలంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనదగినది ప్యాకేజీ-సి. ఈ విభాగంలో నాన్ ఎక్స్‌క్లూజివ్ 18 మ్యాచులు ఉన్నాయి. ఇందులో సీజన్ ఆరంభ మ్యాచ్ సహా నాలుగు ప్లే ఆఫ్స్ (ఫైనల్స్‌తో సహా) ఉంటాయి. ఈ విభాగంలో మ్యాచ్‌కు కనీస ధర రూ.11 కోట్లు. ప్యాకేజీ-బి విజేత.. ప్యాకేజీ-సి మ్యాచులను ప్రసారం చేసుకునే హక్కు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్యాకేజీ-సిని ప్యాకేజీ-ఏ విజేత దక్కించుకుంటే.. ప్రకటనల మార్కెట్లో ప్యాకేజీ-బి విజేతను బలహీనపర్చవచ్చు. దీంతో ఈ విభాగం హక్కుల కోసం రిలయన్స్ గట్టిగా నిలిచింది. సుమారు మూడు రెట్లు అధిక ధర చెల్లించి ప్యాకేజీ-సిని సొంతం చేసుకుంది. మ్యాచ్‌కు రూ.33.24 కోట్ల ధరకు ఈ 18 మ్యాచులను రిలయన్స్ దక్కించుకుంది. రానున్న సీజన్లలో ఈ మ్యాచుల సంఖ్య 20-24కు పెరుగవచ్చు. ఇక వరల్డ్‌వైడ్ మీడియా హక్కులు సైతం రెండు సంస్థలు పంచుకున్నాయి. రూ.1058 కోట్లకు రిలయన్స్ వయాకామ్18, టైమ్స్ ఇంటర్నెట్లు దక్కించుకున్నాయి. టైమ్స్ ఇంటర్నెట్ సంస్థ అమెరికా, మధ్యప్రాచ్చ దేశాల్లో మీడియా హక్కులు సొంతం చేసుకోగా.. రిలయన్స్‌కు దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ దేశాల హక్కులు లభించాయి.
ప్రాంఛైజీలకు పండుగ! : 2022 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు బీసీసీఐ లీగ్‌ను పది జట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందుకోసం నిర్వహించిన వేలంలో బోర్డుకు రికార్డు ఆదాయం లభించింది. లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాంఛైజీలకు రూ.12715 కోట్లు వచ్చాయి. ఐపీఎల్ ప్రాంఛైజీల కోసం లక్నో ఏకంగా రూ.7 వేల కోట్లు వెచ్చించినట్టు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ జట్టు యజమానులు రానున్న మీడియా హక్కుల ధరను ముందే ఊహించారు. అందుకే, రికార్డు ధరకు వెనుకాడలేదు. తాజాగా ఐపీఎల్ మీడియా హక్కులు రూ.48390 కోట్ల విలువకు చేరుకుంది. దీంతో ప్రతి సీజన్లో ఐపీఎల్ ప్రాంఛైజీలకు అందే కేంద్ర వాటా గణనీయంగా పెరుగనుంది. ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి ప్రాంఛైజీ సీజన్‌కు రూ.500 కోట్లు బీసీసీఐ నుంచి అందుకోనుంది.
ఇక రెండున్నర మాసాల గడువు! : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రానున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎఫ్టీపీలో రెండున్నర నెలల సమయం ఉండనుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఐపీఎల్ మీడియా హక్కుల ఈ వేలం అనంతరం జై షా వరుస ట్వీట్లు చేశారు. ' భారత క్రికెట్లో ఇది ఎర్ర అక్షరాలతో లిఖించదగిన రోజు. ఐపీఎల్ ఆరంభం నుంచీ గొప్పగా వృద్ది చెందుతుంది. ఈ వేలంలో రూ.48390 కోట్లకు మీడియా హక్కులు అమ్ముడుపోవటంతో ప్రపంచంలోనే ఐపీఎల్ రెండో విలువైన స్పోర్ట్స్లీగ్గా నిలిచింది. ఈ ఆదాయంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో క్రికెట్ మౌళిక సదుపాయాల కల్పన, ప్రపంచ శ్రేణి సదుపాయాల కల్పనకు కృషి చేస్తాం. రాష్ట్ర క్రికెట్ సంఘాలు, ఐపీఎల్ ప్రాంఛైజీలు కలిసి పని చేయాల్సిన సమయం వచ్చింది. రానున్న ఐసీసీ ఎఫ్టీపీలో ఐపీఎల్‌కు రెండున్నర నెలల గడువు దక్కనుంది' అని జై షా వరుస ట్వీట్లలో పేర్కొన్నాడు.
ఐపీఎల్ మీడియా హక్కులు
2023-27 సీజన్లు : రూ.48390 కోట్లు
- ప్యాకేజీ-ఏ : రూ.23,575 కోట్లు
మ్యాచ్‌కు :రూ.57.5 కోట్లు (డిస్నీస్టార్)
- ప్యాకేజీ-బి : రూ.20,500 కోట్లు
మ్యాచ్‌కు :రూ.50 కోట్లు (రిలయన్స్)
- ప్యాకేజీ-సి : రూ.3,258 కోట్లు
మ్యాచ్‌కు:రూ.33.24 కోట్లు (రిలయన్స్)
- ప్యాకేజీ-డి : రూ.1057 కోట్లు
మ్యాచ్‌కు:2.6 కోట్లు (రిలయన్స్, టైమ్స్ ఇంటర్నెట్)