Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పులు చెరిగిన హర్షల్ పటేల్
- విశాఖ టీ20లో భారత్ విజయం
- భారత్ 179/5, దక్షిణాఫ్రికా 131/10
నవతెలంగాణ-విశాఖపట్నం : మాయగాడు ఎట్టకేలకు మాయజాలం ప్రదర్శించాడు. విశాఖపట్నంలో యుజ్వెంద్ర చాహల్ (3/20) మాయజాలంతో దక్షిణాఫ్రికాపై భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో.. భారత బౌలర్లు రాణించారు. పేసర్ హర్షల్ పటేల్ (4/25) సైతం మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. దీంతో 180 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 131 పరుగులకే చేతులెత్తేసింది. హెన్రిచ్ క్లాసెన్ (29, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డ్వేన్ ప్రిటోరియస్ (20, 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రీజా హెండ్రిక్స్ (23, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు మెరిసినా... భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు కూల్చి దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టారు. విధ్వంసక బ్యాటర్ డెవిడ్ మిల్లర్ (3) వికెట్‌తో భారత్ గెలుపు లాంఛనమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57, 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (54, 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. హార్దిక్ పాండ్య (31 నాటౌట్, 21 బంతుల్లో 4 ఫోర్లు) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్‌లో నాల్గో టీ20 శుక్రవారం రాజ్‌కోట్‌లో జరుగనుంది.
ఓపెనర్ల మెరుపులు : టాస్ ఓడి మళ్లీ తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ ధనాధన్ ఆరంభం అందుకుంది. ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. స్వల్ప స్కోర్ల విశాఖలో భారీ స్కోర్లకు పునాది వేశారు. రుతురాజ్ 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా, కిషన్ 31 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. ఓపెనర్ల దూకుడుతో పది ఓవర్లలో భారత్ 97 పరుగులు జోడించింది. చివరి పది ఓవర్లలో పరుగుల వరదకు మార్గం వేశారు. కానీ మిడిల్ ఆర్డర్ అంచనాలను అందుకోలేదు. శ్రేయస్ అయ్యర్ (14), రిషబ్ పంత్ (6) సహా దినేశ్ కార్తీక్ (6) విఫలమయ్యారు. హార్దిక్ పాండ్య (31) నిలువటంతో చివర్లో భారత్ 179 పరుగులు చేయగల్గింది.
మ్యాజిక్ : జోరుమీదున్న సఫారీ ముందు 180 పరుగుల లక్ష్యం. కాపాడుకోవటం కష్టమే అనిపించింది. కానీ కీలక మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా పోరాడారు. సఫారీ బ్యాటర్లకు విశాఖలో ముకుతాడు వేశారు. క్రమం తప్పకుండా వికెట్లు కూల్చి దక్షిణాఫ్రికా జోరుకు అడ్డుకట్ట వేశారు. కెప్టెన్ బవుమా (8) వికెట్‌తో మొదలైన సఫారీ పతనం.. ఎక్కడా ఆగలేదు. మిడిల్ ఆర్డర్లో ప్రిటోరియస్ (20), డుసెన్ (1), కాస్లన్ (29)లను చాహల్ వెనక్కి పంపించగా.. హెండ్రిక్స్ (23), డెవిడ్ మిల్లర్ (3), రబాడ (9), షంషి (0)లను హర్షల్ పటేల్ సాగనంపాడు. ఓ ఎండ్‌లో వేనీ పార్నెల్ (22 నాటౌట్, 18 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచినా.. మరో ఎండ్‌లో వికెట్ల పతనం ఆగలేదు. 19.1 ఓవర్లలో 131 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : 179/5 (రుతురాజ్ 57, కిషన్ 54, పాండ్య 31, ప్రిటోరియస్ 2/29)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : 131/10 (క్లాసెన్ 29, హెండ్రిక్స్ 23, పార్నెల్ 22, హర్షల్ 4/25)