Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీట్రోఫీ సెమీఫైనల్స్
బెంగళూరు: రంజీట్రోఫీ సెమీఫైనల్లో ముంబయి, మధ్యప్రదేశ్ జట్లు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను సంపాదించాయి. ముంబయి జట్టు ఉత్తరప్రదేశ్‌పై 213పరుగుల భారీ ఆధిక్యతను సంపాదించగా.. మధ్యప్రదేశ్ జట్టు 68పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను బెంగాల్‌పై సాధించింది. గురువారం మూడోరోజు ఆటను కొనసాగించిన యుపి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబయి జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 133 పరుగులు చేసింది. కెప్టెన్ పృథ్వీ షా(64) అర్ధసెంచరీకి తోడు యశస్వి జైస్వాల్(35), ఆర్మాన్ జాఫర్(32) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో ముంబయి జట్టు ఇప్పటికే 346పరుగుల ఆధిక్యతను సంపాదించింది.
భారీ ఆధిక్యత దిశగా మధ్యప్రదేశ్
మరో సెమీస్‌లో మధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 273పరుగులకే బెంగాల్‌ను ఆలౌట్ ఆలౌట్ చేయడంతో 68 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 5వికెట్ల నష్టానికి 197 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన బెంగాల్‌ను సీనియర్ ఆటగాడు, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి(102), ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్(116) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చి బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటవ్వడంతో బెంగాల్జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ను.. రజత్ పటిదార్ (63నాటౌట్), కెప్టెన్ ఆధిత్య శ్రీవత్సవ (34నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఎంపి జట్టు 2వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి 231 పరుగుల ఓవరాల్ ఆధిక్యాన్ని సాధించింది.