Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్లాక్‌బస్టర్ ఐపీఎల్ సీజన్ అనంతరం.. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌కు ఇంతకుమించిన ఆకర్షణ ఉండదు కాబోలు!. 2-2తో సిరీస్ సమం. ఈ సిరీస్‌లోనే దక్షిణాఫ్రికా అత్యధిక, అత్యల్ప టీ20 స్కోర్లు చేసింది. సఫారీలపై భారత్ అతిపెద్ద విజయం నమోదు చేసింది. ఆరుగురు క్రికెటర్లు కెరీర్ అత్యుత్తమ ఈ సిరీస్‌లోనే రాబట్టారు. 2006లో భారత తొలి టీ20లో భాగమైన ఓ వెటరన్ బ్యాటర్.. తాజాగా ఈ సిరీస్‌లో కెరీర్ తొలి అర్థ సెంచరీ సాధించాడు. కండ్లుచెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, అద్భుత బౌలింగ్ ప్రదర్శనలు వెరసి పొట్టి సిరీస్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. పొట్టి సిరీస్ అందుకునేందుకు భారత్, దక్షిణాఫ్రికా నేడు చివరి టీ20లో తలపడనున్నాయి.
- నిర్ణయాత్మక ఐదో టీ20 నేడు
- ఉత్సాహంలో టీమ్ ఇండియా
- చిన్నస్వామికి నేడు వర్షం ముప్పు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-బెంగళూర్
చిన్నస్వామిలో సిరీస్ పొరాటం. టీ20 ట్రోఫీ కోసం భారత్, దక్షిణాఫ్రికా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం. ఆరంభంలో వరుస మ్యాచుల్లో విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా.. ఆతిథ్య జట్టు అత్యధిక వరుస విజయాల రికార్డుతో పాటు సిరీస్‌ను ప్రమాదంలో పడేసింది. ఒత్తిడిలో పుంజుకున్న టీమ్ ఇండియా వరుస మ్యాచుల్లో సఫారీలను చిత్తు చేసి సిరీస్‌లో సమవుజ్జీగా నిలిచింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠభరితంగా నిలిపింది. నేడు చిన్నస్వామిలో నిర్ణయాత్మక ఐదో టీ20 పోరు. హ్యాట్రిక్ విజయంతో సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ తపిస్తుండగా.. భారత గడ్డపై వైట్‌బాల్ సిరీస్‌లో అజేయ రికార్డు నిలుపుకునేందుకు సఫారీలు ప్రయత్నిస్తున్నారు. చిన్నస్వామిలో నేడు కీలక సిరీస్ నిర్ణయాత్మక సమరం.
ఆ జోరు.. ఇంకోసారి! : 0-2 వెనుకంజలో నిలిచినా.. అద్వితీయ ప్రదర్శనలతో టీమ్ ఇండియా సిరీస్ వేటలో నిలిచింది. ఐపీఎల్లో డెత్ ఓవర్లలో ఊచకోత కోసిన దినేశ్ కార్తీక్ రాజ్‌కోట్‌లో కెరీర్ తొలి అర్థ సెంచరీ నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో నిలువటమే లక్ష్యంగా సాగుతున్న దినేశ్ కార్తీక్ నేడు సొంత మైదానంలో ఏం చేస్తాడో చూడాలి. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్‌లో గొప్పగా రాణించాడు. నాలుగు మ్యాచుల్లో పవర్‌ప్లేలో 54 బంతులు వేసిన భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టి.. 3.55 ఎకానమీతో కేవలం 32 పరుగులు ఇచ్చాడు. సఫారీలపై భారత్ పైచేయి సాధించటంలో భువనేశ్వర్ పాత్ర కీలకం. బ్యాటింగ్‌లో కార్తీక్, బౌలింగ్‌లో భువనేశ్వర్ జోరు మరోసారి కొనసాగితే సిరీస్ దక్కటం లాంఛనమే. చిన్న బౌండరీల మైదానంలో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ సహా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య ధనాధన్ ఇన్నింగ్స్‌లపై కన్నేశారు. అక్షర్ పటేల్, యుజ్వెంద్ర చాహల్‌లు మరో కీలక పరీక్ష ఎదుర్కొవాల్సి ఉంది. సఫారీ విధ్వంసకారుడు డెవిడ్ మిల్లర్‌ను పడగొట్టేందుకు హర్షల్ పటేల్ మరోసారి కీలకం కానున్నాడు.
పుంజుకోగలరా..? : ఒకరిద్దరి ప్రదర్శనలపై ఆధారపడకుండా ఎదురులేని విజయాలు సాధిస్తున్న దక్షిణాఫ్రికా..అనే కితాబు అందుకునేలోపే ఆ జట్టు పరిస్థితి తలకిందులైంది. డెవిడ్ మిల్లర్ అసమాన బ్యాటింగ్ మెరుపులు ఆరంభంలో దక్షిణాఫ్రికాను ముందంజలో నిలిపాయి. మిల్లర్, క్లాసెన్‌లు వరుసగా సఫారీకి విజయాలు కట్టబెట్టారు. ఎవరో ఒకరు జట్టును ఒడ్డుకు చేర్చే బాధ్యత తీసుకోవటంతో దక్షిణాఫ్రికా మెరుగైన జట్టుగా కనిపించింది. కానీ ఒకరిద్దరు బ్యాటర్లు విఫలమైతే.. జట్టు దారుణంగా విఫలమవుతుందని తర్వాతి మ్యాచుల్లో తేలింది. డెవిడ్ మిల్లర్, క్లాసెన్ జోరుకు భారత్ ముకుతాడు వేయటంతో.. ఆ జట్టులో పరుగుల వేటలో నిలిచే వారే లేరు. క్వింటన్ డికాక్ వరుసగా నిరాశపరుస్తున్నాడు. పవర్‌ప్లేలో అతడి సహచర బ్యాటర్లు బవుమా, హెండ్రిక్స్‌లు బౌండరీలను వదిలేసి స్ట్రయిక్రొటేషన్పై దృష్టి పెడుతున్నారు. దీంతో స్కోరు వేగం పెంచే బాధ్యతలో డికాక్‌పై మరింత ఒత్తిడి పడుతోంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో డికాక్ నుంచి దక్షిణాఫ్రికా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. తెంబ బవుమా గత మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేకుంటే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ నాయకత్వ పగ్గాలు అందుకోనున్నాడు. హెండ్రిక్స్ ఓపెనర్‌గా బవుమా స్థానం భర్తీ చేయనున్నాడు.
పిచ్, వాతావరణం : చిన్నస్వామి స్టేడియంలో కరోనా మహమ్మారి అనంతరం వన్డే, టీ20 జరుగలేదు. చిన్నస్వామి చిన్నబౌండరీలతో ఇక్కడ పరుగుల వరద ఉంటుంది. స్పిన్నర్లకు ఇక్కడ కఠిన పరీక్ష. నేడు నిర్ణయాత్మక పోరుకు వర్షం బెడద సైతం ఉంది. ఇక్కడి అధునాతన డ్రైనేజీ వ్యవస్థ 10 నిమిషాల్లోనే మ్యాచ్‌కు పిచ్‌ను సిద్ధం చేయగలదు. నేడు మ్యాచ్‌కు 70 శాతం వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. చివరగా చిన్నస్వామిలో భారత్, దక్షిణాఫ్రికా (2019) తలపడిన మ్యాచ్‌లో సఫారీలు ఛేదనలో అలవోక విజయం సాధించారు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వెంద్ర చాహల్.
దక్షిణాఫ్రికా : తెంబ బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్/రీజా హెండ్రిక్స్, డుసెన్, డెవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డ్వేన్ ప్రిటోరియస్, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోకియా, లుంగి ఎంగిడి.