Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురకు ప్లేయర్ కమ్ మెంటార్
కోల్‌కత : భారత క్రికెట్ ప్రణాళికల నుంచి తప్పించబడిన వెటరన్ వికెట్ కీపర్, బ్యాటర్ వృద్దిమాన్ సాహా సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో మెంటార్, క్రికెటర్ రూపంలో ద్విపాత్రాభినయం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ మేరకు త్రిపుర రాష్ట్ర క్రికెట్ సంఘంతో వృద్దిమాన్ సాహా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. శ్రీలంకతో టెస్టులకు భారత జట్టులో కోల్పోయిన వృద్దిమాన్ సాహా.. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున నాకౌట్లో బరిలోకి దిగేందుకు నిరాకరించాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధికారి వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన సాహా.. మళ్లీ బెంగాల్‌కు ఆడబోనని ప్రకటించాడు. రానున్న దేశవాళీ సీజన్లో త్రిపుర తరఫున మూడు ఫార్మాట్లలో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఐపీఎల్లో కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించిన సాహా..టైటాన్స్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'త్రిపుర జట్టుకు క్రికెటర్ కమ్ మెంటార్ పాత్ర పోషించాలని అనుకుంటున్నాడు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో సాహా చర్చలు జరుపుతున్నాడు. తొలుత సాహా బెంగాల్, బీసీసీఐ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. అప్పుడే సాహాతో చర్చలు ముందుకెళ్తాయి' అని ఓ అధికారి తెలిపారు.