Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-3తో అర్జెంటీనా చేతిలో ఓటమి
- ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ హాకీ
న్యూఢిల్లీ : అమ్మాయిలు పోరాడారు. చివరి నిమిషం వరకు గోల్ కోసం సమిష్టిగా చెమటోడ్చారు. ఒలింపిక్ సిల్వర్‌మెడలిస్ట్ అర్జెంటీనాకు గట్టి పోటీనిచ్చిన హాకీ ఇండియా అమ్మాయిలు చివరకు 2-3తో పోరాడి ఓటమి చెందారు. నెదర్లాండ్స్‌లోని రొట్టెర్‌డామ్‌లో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ (డబుల్ హెడర్)లో అర్జెంటీనాతో భారత్ మిశ్రమ ఫలితాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాను భారత్ 2-1తో ఓడించింది. నాలుగు క్వార్టర్ల ఆట అనంతరం 3-3తో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలువగా.. షూటౌట్‌లో 2-1తో టీమ్ ఇండియా గెలుపొందింది. ఆ ఉత్సాహంతోనే ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. గోల్ కీపర్ సవిత సారథ్యంలోని డిఫెన్స్ అసమాన ప్రదర్శన చేసింది. అర్జెంటీనా ఎదురుదాడికి సమర్థవంతంగా సమాధానం ఇచ్చింది. తొలి క్వార్టర్‌లో గోల్స్ నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌లో భారత్ తొలి గోల్ నమోదు చేసింది. 23వ నిమిషంలో సలిమ కౌంటర్ అటాక్‌తో భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపింది. మూడో క్వార్టర్‌లో అర్జెంటీనా దూకుడు పెంచింది. వరుస దాడులను సవిత గొప్పగా అడ్డుకుంది. అయినా, అర్జెంటీనా అలుపెరుగని ప్రయత్నాలు భారత డిఫెన్స్ వెనుకంజ వేసేలా చేశాయి. స్వల్ప విరామంలో గోల్స్ కొట్టిన అర్జెంటీనా 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి క్వార్టర్‌లో భారత్ దూకుడు పెంచింది. దీప గ్రేస్ ఎక్కా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 2-3తో ఆధిక్యం కుదించింది. 55వ నిమిషంలో వందన కటారియ చేసిన మెరుపు గోల్ ప్రయత్నం ఫలించలేదు. విలువైన పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకున్న అమ్మాయిలు ఓటమితో ముగించారు. 16 మ్యాచుల్లో 42 పాయింట్లతో అర్జెంటీనా అగ్రస్థానంలో ఉండగా.. 12 మ్యాచుల్లో 24 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్‌లో జూన్ 21, 22న అమెరికాతో భారత్ వరుస మ్యాచుల్లో తలపడనుంది.