Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో మళ్లీ వర్గ పోరు మొదలైంది. 2019లో ఏర్పాటైన హెచ్‌సీఏ కార్యవర్గం ఆధిపత్య పోరుతో క్రికెట్‌కు నష్టం చేకూర్చిందనే ఆరోపణలతో అపెక్స్ కౌన్సిల్‌ను, కార్యవర్గాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హెచ్‌సీఏకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేషు నారాయణ సహా 70 మంది సభ్యులతో ఆదివారం ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 9 నుంచి 19కు పెంచుతూ తీర్మానం చేశారు. దీంతో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మాజీ క్రికెటర్‌గా హైదరాబాద్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాడని అజహరుద్దీన్‌కు మద్దతుగా నిలిచి, అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అన్నీ తానై ఏకపక్ష నిర్ణయాలతో వ్యవస్థను నాశనం చేశాడని శివలాల్ యాదవ్ విమర్శించారు. సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నుకుంటామని శేషు నారాయణ తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రత్యేక సర్వ సభ్య సమావేశం లేదా ఏదైనా సమావేశం నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి సమావేశానికి, ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు ఎటువంటి చట్టబద్దత ఉండదు. అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య 19కు పెంచుకోవచ్చనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు హెచ్‌సీఏ దృష్టికి రాలేదని అజహరుద్దీన్ తెలిపారు.