Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షంతో ఐదో టీ20 రద్దు
- 2-2తో ట్రోఫీ ఇరు జట్ల వశం
తొలి రెండు మ్యాచుల్లో ఆతిథ్య జట్టుపై దక్షిణాఫ్రికా పంజా. మలి రెండు మ్యాచుల్లో పర్యాటక జట్టుపై భారత్ ఎదురులేని విజయాలు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు చిన్నస్వామిలో రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు అభిమానులు రసవత్తర సమరంపై ఆశలు పెంచుకోగా.. వరుణుడు నీళ్లు చల్లాడు. ఆటకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టే ఇచ్చి.. మళ్లీ వచ్చి ఇక వెళ్లనేలేదు. ఎడతెరపి లేని వర్షంతో భారత్, దక్షిణాఫ్రికా ఐదో టీ20 రద్దుగా ముగిసింది.
నవతెలంగాణ-బెంగళూర్
ఐపీఎల్ అనంతరం అభిమానుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్న భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్ చప్పగా ముగిసింది. 2-2తో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కోసం చిన్నస్వామికి చేరుకున్న ఇరు జట్లతో పాటు అభిమానులకు సైతం చేదు అనుభవం తప్పలేదు. ఊహించినట్టుగానే ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో నిర్ణయాత్మక ఐదో టీ20 నిర్వహణ సాధ్యపడలేదు. రాత్రి 9.45 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు మ్యాచ్ అధికారులు ప్రకటించారు. ఐదో టీ20 సమరం రద్దు కావటంతో టీ20 సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా సంయుక్త విజేతలుగా నిలిచాయి. భారత కెప్టెన్ రిషబ్ పంత్, దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహరాజ్‌లు పొట్టి సిరీస్ ట్రోఫీని పంచుకున్నారు. స్వదేశంలో సఫారీలతో సిరీస్‌ను సమం చేసుకున్న టీమ్ ఇండియా.. తర్వాతి సమరం కోసం విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఐర్లాండ్‌తో రెండు మ్యాచుల టీ20 సిరీస్ కోసం హార్దిక్ పాండ్య సారథ్యంలోని టీమ్ ఇండియా ఈ వారంలోనే బ్రిటన్ పర్యటనకు బయల్దేరనుంది.
పంత్ ఐదోసారీ..! : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ రిషబ్ పంత్ కోరుకోని రికార్డు సాధించాడు!. సిరీస్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లో టాస్ కోల్పోయాడు. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా మళ్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్, లేదా కుదించిన ఓవర్ల మ్యాచ్ అంచనా వేసి సఫారీ ఈ నిర్ణయం తీసుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (15, 7 బంతుల్లో 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (10, 12 బంతుల్లో 1 ఫోర్) దూకుడుగా ఆడారు. కిషన్ రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జోరుమీదున్న ఓపెనర్లు ఇద్దరినీ ఆఫ్ కట్టర్లతో ఎంగిడి డగౌట్‌కు చేర్చాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్.. 3.3 ఓవర్ల వద్ద మరోసారి ఆటంకం కలిగించింది. అప్పటికి భారత్ స్కోరు 28/2. రిషబ్ పంత్ (1 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. విరామం లేకుండా వర్షం కురుస్తుండటం, వర్షం ఆగిపోయే సూచనలు లేకపోవటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. 2-2తో సమమైన సిరీస్‌లో ఇరు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచి ట్రోఫీని పంచుకున్నాయి. టీ20 సిరీస్‌లో అద్వితీయ ప్రదర్శన చేసిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు సొంతం చేసుకున్నాడు.