Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ వేటలో ముంబయి, మధ్యప్రదేశ్
- నేటి నుంచి రంజీ ట్రోఫీ టైటిల్ పోరు
బెంగళూర్ : 41 సార్లు చాంపియన్ ఒకవైపు. తొలిసారి చాంపియన్‌గా నిలిచేందుకు తపన పడుతున్న జట్టు మరోవైపు. నేడు చిన్నస్వామిలో జరిగే రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి, మధ్యప్రదేశ్ ఢ కొట్టనున్నాయి. 2016-17 తర్వాత తొలిసారి ఫైనల్స్‌కు చేరుకున్న 41 సార్లు విజేత ముంబయి నేడు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. రంజీ ట్రోఫీలో ముంబయి చివరగా ఆడిన 12 ఫైనల్స్‌లో ఒకే ఒక్కసారి పరాజయం పాలైంది. తాజా సీజన్లో ఆ జట్టు ప్రత్యర్థులపై పంజా విసిరింది. బ్యాటర్లు తొలుత భారీ స్కోరు నమోదు చేయగా.. బౌలర్లు ప్రత్యర్థులను స్వల్ప స్కోర్లకే ఆలౌట్ చేశారు. నేడు ఫైనల్లోనూ అదే జోరు చూపించాలని ముంబయి భావిస్తోంది. సెమీఫైనల్లో రెండు శతకాలు సాధించిన యశస్వి జైస్వాల్ టైటిల్ పోరులో చెలరేగాలని చూస్తున్నాడు. జట్టు దూకుడుగా సాగుతున్నప్పటికీ కెప్టెన్ పృథ్వీ షా తనదైన ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. జాతీయ జట్టులో చోటుకు దూరమైన పృథ్వీ షా.. రంజీ ట్రోఫీ ఫైనల్లో మెగా ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నాడు. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టు సైతం మంచి ఫామ్‌లో ఉంది. ఆ జట్టులో యువ పేసర్ కుమార్ కార్తికేయ నాకౌట్లో వరుస మ్యాచుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. చిన్నస్వామిలో పిచ్ అనుకూలిస్తే కుమార్ కార్తికేయ ఏం చేస్తాడో చూడాలి. ముంబయి రంజీ దిగ్గజాలు అమోల్ ముజుందార్ (ముంబయి), చంద్రకాంత్ పండిట్ (మధ్యప్రదేశ్) నేడు ఫైనల్లో ఇరు జట్లకు కోచ్‌లుగా వ్యవహరించటం సైతం అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు చేస్తోంది. నేడు ఉదయం 9.30 గంటలకు రంజీ ట్రోఫీ టైటిల్ పోరు షురూ కానుంది.