Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు
- ఉత్కంఠ రేపుతున్న కొత్త సమీకరణాలు
భారత్, ఇంగ్లాండ్ పటౌడీ ట్రోఫీ. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ జోరుమీదున్న టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్‌ను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఎదురులేని ఆధిక్యం సాధించింది. చివరి టెస్టులో రూట్సేనను ఓడించి.. ఐపీఎల్‌కు బయల్దేరాల్సిన సమయంలో భారత శిబిరంలో కోవిడ్ కలకలం రేగింది. సిరీస్‌లో చివరి టెస్టు ఆడకుండానే సమరం ముగిసింది. సరిగ్గా ఏడాది తర్వాత.. పటౌడీ ట్రోఫీ ఫైట్‌కు మళ్లీ తెరలేవనుంది. జులై 1 నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టులో తలపడనున్నాయి.
నవతెలంగాణ క్రీడావిభాగం
అర్థాంతరంగా ముగిసిన ఓ అద్వితీయ సిరీస్ మళ్లీ ప్రాణం పోసుకుంది. భారత్, ఇంగ్లాండ్ పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టు సెప్టెంబర్ 10, 2021న కోవిడ్ పడగ నీడలో రద్దు (వాయిదా)కాగా.. ఆ పోరుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక విజయం లాంఛనం చేసుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు చివరి టెస్టు రూపంలో కఠిన సవాల్ ఎదుర్కొనేందుకు తయారైంది. జులై 1-5న బర్మింగ్‌హామ్‌లో చివరి టెస్టు జరుగనుంది. మాంచెస్టర్‌లో జరగాల్సిన చివరి టెస్టు వేదికను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎడ్జ్‌బాస్టన్‌కు మార్పు చేసింది. ఇంగ్లాండ్‌తో చివరి (ఏకైక) టెస్టు కోసం టీమ్ ఇండియా ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకుంది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా వికెట్ కీపర్ రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్లు మంగళవారం జట్టుతో చేరారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు టీమ్ ఇండియా ఓ వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. ఇంగ్లీష్ కౌంటీ జట్టు లీసెస్టర్‌తో నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. రేపటి నుంచి (జూన్ 23) వార్మప్ మ్యాచ్ ఆరంభం కానుండగా.. పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టుకు ముందు మారిన సమీకరణాలను చూద్దాం.
నయా నాయకత్వం : పటౌడీ ట్రోఫీ అరుదైన రికార్డు సాధించనుంది. ఓ సిరీస్‌లో ఇరు జట్ల నాయకత్వం పూర్తిగా మారటం బహుశా ఇదే ప్రథమం. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, చీఫ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కలమ్ బాధ్యతలు తీసుకున్నారు. తొలి పరీక్షలోనే న్యూజిలాండ్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పగ్గాలు అందుకున్నారు. పటౌడీ ట్రోఫీలో తొలి నాలుగు మ్యాచులకు ఇంగ్లాండ్ జో రూట్ సారథ్యంలో, భారత్ విరాట్ కోహ్లి సారథ్యంలో పోటీపడ్డాయి. ఇప్పుడు చివరిదైన ఐదో టెస్టులో ఇరు జట్లకు పూర్తిగా నూతన నాయకత్వం రావటం యాదృచ్చికమే.
బలమైన ఇంగ్లాండ్! : తొలి నాలుగు టెస్టుల్లో భారత్ ఎదుర్కొన్న ఇంగ్లాండ్.. చివరి టెస్టులో పోటీపడబోయే ఇంగ్లాండ్ ఒక్కటి కాదు!. ఈ విషయం భారత శిబిరం గమనంలో ఉంచుకోవాలి. స్టోక్స్, మెక్‌కలమ్ కాంబినేషన్లోని ఇంగ్లాండ్ తాజాగా ఐసీసీ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌కు వరుస మ్యాచుల్లో ఓటమి రుచి చూపించింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ఇప్పుడు గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. జట్టులోని కీలక ఆటగాళ్లందరూ సరైన సమయంలో సత్తా చాటుతున్నారు. పటౌడీ ట్రోఫీని గెల్చుకునే స్థితిలో లేని ఇంగ్లాండ్ కనీసం సిరీస్‌ను సమం చేసేందుకైనా గట్టి ప్రయత్నం చేస్తుందనటంలో సందేహం లేదు. ఈ సమయంలో భారత్‌తో చివరి టెస్టు ఆడనుండటం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం.
భారత్ సమిష్టిగా మెరిస్తేనే : పటౌడీ ట్రోఫీ అలవోకగా సొంతమయ్యే దశలో.. చివరి టెస్టు వాయిదా పడటం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ను ఎదుర్కొవటం అంత సులువు కాదు. భారత ఆటగాళ్లందరూ ఐపీఎల్ నుంచి నేరుగా ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చారు. జట్టులోకి కొందరు ఆటగాళ్లే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడారు. కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మంచి ఫామ్‌లో లేరు. జోరుమీదున్న కెఎల్ రాహుల్ ఫిట్నెస్ కోల్పోయాడు. ఎక్స్ ఫ్యాక్టర్ రిషబ్ పంత్ సఫారీలతో సిరీస్‌లో విఫలమయ్యాడు. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీ క్రికెట్లో దండిగా పరుగులు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు పుజారానే కీలకం కానున్నాడు. శుభ్‌మన్ గిల్, హనుమ విహారి సత్తా చాటనున్నారు. జశ్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలోని సిరాజ్, ఠాకూర్, ఉమేశ్, షమిలతో కూడిన పేస్ దళం బాగుంది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోవిడ్‌తో ఇంగ్లాండ్‌కు రాలేకపోయాడు. రవీంద్ర జడేజా రూపంలో స్పిన్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండటంతో భారత్‌కు ఇది పెద్ద సమస్య కాబోదు.