Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్
- ముంబయి తొలి ఇన్నింగ్స్ 248/5
బెంగళూర్ : ముంబయి యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (78, 163 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ ఫామ్ కొనసాగించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం ఆరంభమైన రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కెప్టెన్ పృథ్వీ షా (47, 79 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జైస్వాల్ తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. తొలి సెషన్లో ఓపెనర్లు జోరు చూపించారు. తొలి సెషన్లో ముంబయి బ్యాటర్ల ఆధిపత్యం నడువగా.. లంచ్ తర్వాత మధ్యప్రదేశ్ బౌలర్లు లయ అందుకున్నారు. అర్మాన్ జాఫర్ (26), సువేద్ పార్కర్ (18) వికెట్లతో ముంబయిని ఇరకాటంలో పడేశారు. హార్దిక్ తోమరె (24) సైతం పెవిలియన్‌కు చేరటంతో 185/4తో ముంబయి కష్టాల్లో కూరుకుంది. ఈ పరిస్థితుల్లో సర్ఫరాజ్ ఖాన్ (40 నాటౌట్, 125 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు.ములాని (12 నాటౌట్, 43 బంతుల్లో 1 ఫోర్)తో కలిసి తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా క్రీజులో నిలిచాడు. 90 ఓవర్లలో ముంబయి 248/5 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ బౌలర్లు అనుభవ్ అగర్వాల్ (2/56), సరాన్షు జైన్ (2/31) రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి రోజు ఆటలో ముంబయి, మధ్యప్రదేశ్ సమవుజ్జీలుగా నిలిచాయి. నేడు ఉదయం సెషన్లో మ్యాచ్ ఎటువైపు మొగ్గుతుందో తేలనుంది.