Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిసెస్టర్‌షైర్ భారత్ వార్మప్ నేటి నుంచి
- విరాట్, రోహిత్, గిల్, పుజారాలపై ఫోకస్
- మధ్యాహ్నాం 3.30 నుంచి మ్యాచ్ షురూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ధమాకా, స్వదేశంలో సఫారీలతో పొట్టి సవాల్ అనంతరం టీమ్ ఇండియా అసలు సిసలు సమరానికి సిద్ధమవుతోంది. వైట్‌బాల్ ఫార్మాట్ నుంచి రెడ్‌బాల్ ఫార్మాట్ సవాల్ ఎదుర్కొనేందుకు తయారైంది. సుమారు మూడు మాసాల అనంతరం రెడ్‌బాల్ క్రికెట్ ఆడనున్న భారత్.. ఇంగ్లాండ్‌తో కీలక చివరి టెస్టుకు నేటి నుంచి సన్నాహాకం షురూ చేయనుంది. లిసెస్టర్‌షైర్ కౌంటీతో భారత్ నాలుగు రోజుల వార్మప్ నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-లిసెస్టర్‌షైర్
రసవత్తర భారత్, ఇంగ్లాండ్ పటౌడీ ట్రోఫీ వేట తిరిగి ప్రారంభం కానుంది. కోవిడ్-19 పడగ నీడలో నిరుడు అర్థాంతరంగా వాయిదా పడిన మాంచెస్టర్ టెస్టును ఏడాది తర్వాత ఆడేందుకు రంగం సిద్ధమైంది. జులై 1-5న ఎడ్జ్‌బాస్టన్‌లో పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టు జరుగనుండగా.. అసలు సమరం కోసం టీమ్ ఇండియా నేటి నుంచి సన్నాహాక సన్నద్ధతకు తయారవుతోంది. ఇంగ్లీష్ కౌంటీ జట్టు లిసెస్టర్షైర్తో టీమ్ ఇండియా నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. వైట్‌బాల్ క్రికెట్ ధమాకాలో టెస్టు క్రికెట్‌కు దూరమైన టీమ్ ఇండియా.. మార్చి తర్వాత తొలిసారి ఎర్ర బంతిని ఎదుర్కొనుంది. ఆతిథ్య ఇంగ్లాండ్ ఓ వైపు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ విజయంతో ఉత్సాహంతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బర్మింగ్‌హామ్ పరీక్షకు అన్ని అస్త్రాలు సిద్ధంగా ఉంచుకునేందుకు నేడు టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. భారత్, లిసెస్టర్‌షైర్ వార్మప్ మ్యాచ్ నేడు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3.30 గంటలకు ఆరంభం. లిసెస్టర్‌షైర్ యూట్యూబ్ ఛానెల్, ఫోక్సెస్ టీవీలో వార్మప్ మ్యాచ్ ప్రసారం కానుంది.
భారత్‌కు పరీక్ష : నాలుగు రోజుల వార్మప్ టీమ్ ఇండియాకు గట్టి పరీక్ష. జట్టులోని కీలక ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్ నుంచి వస్తున్నారు. కొంతమంది మాత్రమే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జశ్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, శార్దుల్ ఠాకూర్లు ఐపీఎల్ అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్ అనంతరం చతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్ మాత్రమే రెడ్‌బాల్ క్రికెట్ ఆడారు. దీంతో నిర్ణయాత్మక సమరంలో తుది జట్టును బరిలోకి నిలిపేందుకు భారత్ వార్మప్ మ్యాచ్‌లో అన్ని అస్త్రాలను ప్రయోగించనుంది. ఐదో టెస్టుకు జాతీయ సెలక్షన్ కమిటీ 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. కెఎల్ రాహుల్ గాయంతో దూరం కాగా.. అశ్విన్ కోవిడ్ పాజిటివ్‌తో బ్రిటన్‌కు బయల్దేరలేదు. కెఎల్ రాహుల్ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్. నిరుడు పటౌడీ ట్రోఫీలో భారత్ తరఫున పరుగులు రాబట్టిన బ్యాటర్లలో కెఎల్ రాహుల్ ఒకరు. తొలి మూడు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో జో రూట్, రోహిత్ శర్మ తర్వాతి స్థానం రాహుల్‌దే. రోహిత్ శర్మ, కెఎస్ రాహుల్ ఓపెనింగ్ కాంబినేషన్ భారత్‌కు విలువైన భాగస్వామ్యాలు అందించింది. మంచి ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ సేవలు కోల్పోవటం భారత్‌కు ఎదురుదెబ్బ.
గత ఏడాది మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చిన రాహుల్.. గిల్, మాయాంక్లకు గాయాలతో ఓపెనర్ అవతారం ఎత్తాడు. వార్మప్‌లో కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌పై శతకంతో తుది జట్టు తలుపు తట్టాడు. అదే తరహాలో ఓపెనింగ్ స్థానం దక్కించుకునేందుకు శుభ్‌మన్ గిల్ సిద్ధమవుతున్నాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారాలకు సైతం ఈ మ్యాచ్ కీలకం. విరాట్ కోహ్లి శతకం లేని ప్రయాణం మూడు ఫార్మాట్లలో కలిపి వంద మ్యాచులు దాటేసింది. క్రీజులో ఆరంభంలో బాగానే కనిపిస్తున్నా, అలవోకగా వికెట్ పారేసుకుంటున్న విరాట్ కోహ్లి విరామం అనంతరం బ్యాట్ పట్టుకున్నాడు. వార్మప్ మ్యాచ్‌లోనే లయ అందుకోవాలని కోహ్లి తపిస్తున్నాడు. కెప్టెన్‌గా పటౌడీ ట్రోఫీ విజయానికి బాటలు వేసిన కోహ్లి.. కీలక ఆటగాడిగా ఆ సిరీస్ చేజారకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలి. పరుగుల దాహం ఇంగ్లాండ్ బౌలర్లపై తీర్చుకుంటే అభిమానులకు పండుగే. ఇక పేలవ ప్రదర్శనలతో జాతీయ జట్టుకు దూరమైన చతేశ్వర్ పుజారా కౌంటీల్లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. నం.3 స్థానంలో అనుభవజ్ఞుడైన బ్యాటర్‌గా చతేశ్వర్ పుజారా కీలక భాగస్వామ్యాలు నిర్మించటంతో పాటు విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే, మరోసారి జట్టులో అతడి చోటు ప్రశ్నార్థకం అవుతుంది. ఈసారి పుజారా ఆ పరిస్థితి రానీయకుండా చూసుకోవాలని భావిస్తున్నాడు. రోహిత్ శర్మ, హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు సైతం రెడ్బాల్పై సానుకూల ఆరంభాన్ని ఆశిస్తున్నారు.
బౌలర్లకు సవాల్ : స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఐపీఎల్ సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఇప్పుడు నేరుగా లిసెస్టర్షైర్తో వార్మప్‌కు రెఢ అయ్యాడు. ఐపీఎల్‌కు ముందు భీకర ఫామ్‌లో ఉన్న జడేజా కెప్టెన్సీ బాధ్యతలతో ఆట పాడు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో జడేజా మళ్లీ జూలు విదిల్చేందుకు అవకాశం ఉంది. బౌలింగ్ విభాగానికి సైతం ఈ చివరి టెస్టు కఠిన సవాల్. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు సరైన లెంగ్త్‌లను వీలైనంత త్వరగా అందుకోవాలి. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లు గొప్పగా రాణించగలరు. వార్మప్ మ్యాచ్‌లో ఫామ్ అందుకుంటే బర్మింగ్‌హామ్‌లో పెద్ద సమస్య కాబోదు. ఏకైక వార్మప్ మ్యాచ్‌లో భారత్ 15 మంది ఆటగాళ్లను ఆడించనుంది. వార్మప్ ప్రదర్శన అనంతరం టెస్టు మ్యాచ్‌కు తుది జట్టు కూర్పు చేయనుంది.
భారత టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, జశ్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.