Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యప్రదేశ్ తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌కు చేరువైంది. యశ్ ధూల్ (133), శుభమ్ శర్మ (116) సెంచరీలతో చెలరేగారు. యశ్, శర్మ శతక జోరుకు తోడు రజత్ పటిదార్ (67) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. ఈ ముగ్గురు అసమాన ప్రదర్శన చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. టైటిల్ వేటలో ముంబయిపై పంజా విసిరేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
- దూబె, శుభమ్ సెంచరీలు
- రంజీ ట్రోఫీ ఫైనల్
- మధ్యప్రదేశ్ 368/3
నవతెలంగాణ-బెంగళూర్
యశ్ దూబె (133, 336 బంతుల్లో 14 ఫోర్లు), శుభమ్ శర్మ (116, 215 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) శతక మోత మోగించారు. రంజీ ట్రోఫీలో ప్రత్యర్థులపై ముంబయి ఎలా చెలరేగేదో.. తాజాగా రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయికి ఆ చేదు అనుభవం రుచి చూపించింది మధ్యప్రదేశ్. సుమారు రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ.. ముంబయి బౌలర్లను ఉతికారేసింది. రెండో వికెట్‌కు 222 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. యశ్ దూబె, శుభమ్ శర్మ సెంచరీలతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో విలువైన ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 368/3తో కొనసాగుతున్న మధ్యప్రదేశ్.. ముంబయి తొలి ఇన్నింగ్స్‌కు 6 పరుగు దూరంలోనే నిలిచింది. రజత్ పటిదార్ (67 నాటౌట్, 106 బంతుల్లో 13 ఫోర్లు), ఆదిత్య శ్రీవాస్తవ (11 నాటౌట్, 33 బంతుల్లో 1 ఫోర్) అజేయంగా ఆడుతున్నారు.
దంచికొట్టారు : యశ్ దూబె, శుభమ్ శర్మలు పరుగుల మోత మోగించారు. ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డారు. రంజీ ట్రోఫీలో ప్రత్యర్థి జట్లపై ఈ స్థాయిలో చెలరేగిన అలవాటున్న ముంబయి.. తొలిసారి ఆ అనుభవం చవిచూసింది!. యశ్ దూబె బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరువగా.. శుభమ్ శర్మ వేగంగా ఆడాడు. 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో శతకం సాధించాడు. ఓపెనర్‌గా జట్టుకు బలమైన పునాది వేసిన యశ్ దూబెతో కలిసి శుభమ్ శర్మ ఏకంగా 63.1 ఓవర్ల పాటు క్రీజులో నిలిచాడు. ఈ ఇద్దరూ క్రీజులో ఉండగా ముంబయి బౌలర్లు చేష్టలుడిగారు. ఓ జోడీని విడగొట్టేందుకు ముంబయి కెప్టెన్ పృథ్వీ షా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సెంచరీల అనంతరం శుభమ్ శర్మ, యశ్ దూబెలు వికెట్ కోల్పోయారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున మెరుపు శతకం బాదిన రజత్ పటిదార్.. తాజాగా రంజీ ఫైనల్లో జూలు విదిల్చుతున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రజత్ పటిదార్ (67, 106 బంతుల్లో 13 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. 13 ఫోర్లు బాదిన పటిదార్ మూడో రోజు చివరి సెషన్లో ముంబయి బౌలర్లతో ఆటాడుకున్నాడు. రజత్ పటిదార్ అర్థ సెంచరీతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి స్కోరుకు చేరువైంది. నేడు ఉదయం సెషన్లో రజత్ పటిదార్‌కు తోడు ఆదిత్య శ్రీవాస్తవ సైతం రాణిస్తే తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ భారీ ఆధిక్యం సొంతం చేసుకోనుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రంజీ ట్రోఫీని తొలిసారి ముద్దాడేందుకు మధ్యప్రదేశ్ గట్టి పునాది వేసుకుంది. అంతకముందు, సర్ఫరాజ్ ఖాన్ (134, 243 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (78, 163 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) జోరుతో ముంబయి ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
స్కోరు వివరాలు :
ముంబయి తొలి ఇన్నింగ్స్ : 374/10
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ : యశ్ దూబె (సి) తామోరె (బి) ములాని 133, హిమాన్షు మంత్రి (ఎల్బీ) దేశ్‌పాండే 31, శుభం శర్మ (సి) తామోరె (బి) అవస్తి 116, రజత్ పటిదార్ నాటౌట్ 67, ఆదిత్య శ్రీవాస్తవ నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు :10, మొత్తం :(123 ఓవర్లలో 3 వికెట్లకు) 368.
వికెట్ల పతనం : 1-47, 2-269, 3-341.
బౌలింగ్ : ధవల్ కులకర్ణి 21-3-51-0, తుషార్ దేశ్‌పాండే 24-8-73-1, శామ్స్ ములాని 40-4-117-1, మోహిత్ అవస్తి 20-5-53-1, తనుశ్ కొటియన్ 18-1-67-0.