Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక విండోపై ఐసీసీలో చర్చకు పట్టు
కరాచీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల ఐపీఎల్ రానున్న ఐదేండ్ల కాలానికి మీడియా హక్కుల రూపంలో సుమారు రూ.50 వేల కోట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు సుమారు రూ.120 కోట్ల విలువతో ప్రపంచంలోనే ఐపీఎల్ రెండో విలువైన స్పోర్ట్స్లీగ్గా నిలిచింది. స్పోర్ట్స్ మార్కెట్లో ఆకాశానికి ఎదిగిన ఐపీఎల్‌కు రానున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక క్యాలెండర్లో ప్రత్యేక విండో (సమయం) కేటాయించటం పట్ల పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేయనుందని ఆ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా తెలిపారు. ఐపీఎల్‌కు ఐసీసీ ఎఫ్టీపీలో రెండున్నర నెలల ప్రత్యేక విండో లభించనుందని, అందుకోసం అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో పాటు ఐసీసీతో చర్చించినట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్న విషయం తెలిసిందే. 'ఐపీఎల్ కోసం ఐసీసీ ఎఫ్టీపీలో రెండున్నర నెలల సమయం ఇవ్వలేదు. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడలేదు. ఐపీఎల్‌కు ప్రత్యేక విండో కేటాయించటం పట్ల రానున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ప్రశ్న లేవనెత్తుతానని' రమీజ్ రాజా తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. సరిహద్దు ఉద్రిక్తల కారణంగా ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక క్రికెట్ నిలిచినపోయింది. 'ముగ్గురు మాజీ క్రికెటర్లు ప్రస్తుతం భారత క్రికెట్‌ను నడిపిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు మార్పు వస్తుంది (ద్వైపాక్షిక సిరీస్‌లపై). ఐపీఎల్ ఫైనల్స్‌కు రావాల్సిందిగా సౌరవ్ గంగూలీ గత సీజన్, ఈ సీజన్‌కు ఆహ్వానించారు. కానీ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోని ఆహ్వానం మన్నించాల్సి వచ్చిందని' రమీజ్ రాజా అన్నారు.