Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెలరేగిన రిషబ్ పంత్
- లిసెస్టర్‌షైర్ 244/10
నవతెలంగాణ-లిసెస్టర్
రిషబ్ పంత్ (76, 87 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) ఫటాఫట్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శన, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో వైఫల్యంతో రిషబ్ పంత్ పదునైన విమర్శలు వచ్చాయి. వైట్‌బాల్ ఫార్మాట్ వైఫల్యాలను రెడ్ బాల్ ఫార్మాట్లో జోరుతో తప్పికొట్టాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు ముందు నాలుగు వార్మప్ మ్యాచ్‌లో పంత్ ధనాధన్ అర్థ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఇండియన్స్ ఎలెవన్‌పై మెరుపు ఇన్నింగ్స్ నమోదు చేశాడు. రిషబ్ పంత్ మెరిసినా..టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (0) డకౌట్ కావటంతో లిసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు మహ్మద్ షమి (3/42), మహ్మద్ సిరాజ్ (2/46), స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/28) వికెట్ల వేటలో రాణించారు.
చెలరేగిన పంత్ : వార్మప్ మ్యాచ్‌లో లిసెస్టర్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (76) రెడ్‌బాల్ ఫార్మాట్లో ఫామ్ కొనసాగించాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని తనదైన శైలిలో పరుగులు పిండుకున్నాడు. 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో ధనాధన్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో లిసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. ఇండియన్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక, కౌంటీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన చతేశ్వర్ పుజారా వార్మప్ మ్యాచ్‌లో తేలిపోయాడు. మహ్మద్ షమి బంతికి వికెట్ కోల్పోయాడు. పరుగులు ఖాతా తెరువకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ జట్టులో ఓపెనర్ కింబర్ (31, 39 బంతుల్లో 6 ఫోర్లు), ఎవిసన్ (22, 26 బంతుల్లో 4 ఫోర్లు), రిషి పటేల్ (34, 46 బంతుల్లో 6 ఫోర్లు), రోమాన్ వాకర్ (34, 57 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో 57 ఓవర్లలో లిసెస్టర్‌షైర్ 244 పరుగులకే కుప్పకూలింది.
ఇండియన్స్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 80/1తో ఆడుతోంది. తెలుగు తేజాలు శ్రీకర్ భరత్ (31 నాటౌట్, 59 బంతుల్లో 5 ఫోర్లు), హనుమ విహారి (9 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్) అజేయంగా ఆడుతున్నారు. శుభ్‌మన్ గిల్ (38, 34 బంతుల్లో 8 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన కెఎస్ భరత్.. తొలి ఇన్నింగ్స్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భరత్ అజేయ అర్థ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఇండియన్స్ ఎలెవన్ ప్రస్తుతం 82 పరుగల ఆధిక్యంలో కొనసాగుతోంది.
స్కోరు వివరాలు :
ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ : 246/8 డిక్లేర్డ్
లిసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్ : కింబర్ (సి) భరత్ (బి) సిరాజ్ 31, ఎవాన్స్ (సి) కోహ్లి (బి) షమి 1, పుజారా (బి) షమి 0, ఎవిసన్ (బి) సిరాజ్ 22, రిషబ్ పంత్ (సి) శ్రేయస్ (బి) జడేజా 76, రిషీ పటేల్ (సి) విహారి (బి) షమి 34, శామ్ బేట్స్ (సి) జడేజా (బి) శార్దుల్ 8, రోమన్ వాకర్ (సి) భరత్ (బి) జడేజా 34, నాథన్ బౌలే (సి) భరత్ (బి) జడేజా 17, విల్ డెవిస్ నాటౌట్ 5, శకాండె (బి) శార్దుల్ 0, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం :(57 ఓవర్లలో ఆలౌట్) 244.
వికెట్ల పతనం : 1-14, 2-22, 3-44, 4-71, 5-129, 6-138, 7-208, 8-226, 9-239, 10-244.
బౌలింగ్ : మహ్మద్ షమి 12-3-42-3, ఉమేశ్ యాదవ్ 10-3-45-0, శార్దుల్ ఠాకూర్ 16-2-71-2, మహ్మద్ సిరాజ్ 11-2-46-2, రవీంద్ర జడేజా 8-3-28-3.
ఇండియన్స్ రెండో ఇన్నింగ్స్ : కెఎస్ భరత్ నాటౌట్ 31, శుభ్‌మన్ గిల్ 38, హనుమ విహారి నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం :(18 ఓవర్లలో వికెట్ నష్టానికి) 80.
వికెట్ల పతనం : 1-62.
బౌలింగ్ : ప్రసిద్ కృష్ణ 4-0-30-0, రోమన్ వాకర్ 5-1-21-0, విల్ డెవిస్ 5-0-16-0.