Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత బ్యాటర్ చతేశ్వర్ పుజారా
లిసెస్టర్ : భారత జట్టు చరిత్రను వేటాడుతోంది. ఇంగ్లాండ్ గడ్డపై చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయానికి చేరువైంది. అయితే, ఇంగ్లీష్ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం అందుకునేందుకు భారత్ ఏడాది కాలంగా ఓపిగ్గా ఎదురుచూస్తోంది. ఐదు టెస్టుల పటౌడీ ట్రోఫీలో నాలుగు టెస్టుల అనంతరం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. కోవిడ్-19 పరిస్థితుల్లో వాయిదా పడిన చివరి టెస్టు జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగనుంది. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం జట్టులో చోటు కోల్పోయిన టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లీష్ కౌంటీల్లో రాణించి జాతీయ జట్టులో తిరిగి స్థానం సాధించాడు. పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టులోనూ విజయం సాధిస్తే.. భారత్ జట్టు అసమాన విజయాల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందని చతేశ్వర్ పుజారా అన్నాడు. నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ టీవీతో పుజారా ప్రత్యేకంగా మాట్లాడాడు.
అదే పునరావృతం చేయాలి : 'అన్నింటికంటే ముఖ్యమైన అంశం.. భారత్‌కు నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచ శ్రేణి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. తొలి నాలుగు టెస్టుల్లో చేసిన ప్రదర్శనే.. ఇప్పుడు పునరావృతం చేసేందుకు పేసర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై ఈ టెస్టులో భారత్ విజయం సాధించిగలిగితే.. భారత అతిపెద్ద విజయాల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోతుంది. టెస్టు సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్నాం. అయినా, ఇది మాకు మంచి సవాల్‌తో కూడిన అతి ముఖ్యమైన మ్యాచ్. విరామం అనంతరం, జట్టు అంతా మళ్లీ ఓ గ్రూప్‌గా చేరి.. బలాబలాలు అర్థం చేసుకోవాల్సి ఉంది. చివరి టెస్టుకు కాస్త ముందుగానే ఇక్కడికి రావటం మంచిదైంది. సన్నద్ధతకు, పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం చిక్కింది. నాలుగు టెస్టుల్లో ఏం చేశామో.. చివరి టెస్టులోనూ అదే పునరావృతం చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ శిబిరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన నాయకత్వంలోని ఇంగ్లాండ్ బలం, బలహీనతలు, వ్యూహలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది' అని చతేశ్వర్ పుజారా అన్నాడు.